సానుభూతిని ఏం చేసుకుంటారు, రాజేంద్రా?

ABN , First Publish Date - 2021-05-06T06:06:51+05:30 IST

ఆయనకు తెలియకపోతే అధికారులైనా చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది? నాయకుడూ ఇబ్బంది పడతాడు, తామూ సమస్యలు ఎదుర్కొంటారు. నిబంధనలు సహకరించని చోట...

సానుభూతిని ఏం చేసుకుంటారు, రాజేంద్రా?

ఆయనకు తెలియకపోతే అధికారులైనా చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది? నాయకుడూ ఇబ్బంది పడతాడు, తామూ సమస్యలు ఎదుర్కొంటారు. నిబంధనలు సహకరించని చోట ముఖ్యమంత్రికి నో చెప్పడం బ్యూరోక్రాట్లకు రాకపోతే ఏం జరుగుతుందో వై.ఎస్. హయాంలో జరిగిన వ్యవహారాల కేసుల్లో సహముద్దాయిలుగా కోర్టులకు హాజరవుతున్న అధికారులను అడిగితే చెబుతారు. మంచీ చెడ్డా చూడకుండా, అధినేత చెప్పాడని ఉన్నతాధికారులు తలూపడం మంచిది కాదు. ఆ మాత్రం జీహుజూర్‌కి జాతీయ స్థాయి సివిల్ సర్వీసు పరీక్షలూ, ఎంపికలూ అవసరమా? పెద్దలే ఎస్ బాస్ అంటున్నప్పుడు, కిందిస్థాయి యంత్రాంగం అంతకు మించి ఏమి చేయగలుగుతుంది? ఈటల రాజేందర్ విషయంలో ముఖ్యమంత్రికి ఆత్రుత ఉండవచ్చు. అనుకున్నదే తడవుగా విచారణలూ నివేదికలూ చర్యలూ జరిగిపోవాలని అనుకోవచ్చు. కానీ, హడావుడి పడితే దెబ్బతింటామని, ఆశించిన ప్రయోజనం సిద్ధించదని ఎవరన్నా రాజకీయ హితవరులు ఆయనకు చెబితే బాగుండేది. చెప్పడాలూ వినడాలూ జాన్తా నై అని ఆయన అనుకున్నా, ప్రధాన కార్యదర్శో మరో అధికారో హెచ్చరించి ఉండవలసింది. అట్లా చేయకపోవడం వల్ల ఏమయింది? అసలుకే మోసం వచ్చింది. దొడ్డిదారిని ఆశ్రయించారన్న చెడ్డపేరు వచ్చింది. ప్రభుత్వానికి పరువు పోయింది. ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తిపై సానుభూతి మరింత పెరిగింది. 


అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు మొదలైనవి ఈటల రాజేందర్ అక్రమంగానో సక్రమంగానో కొనుక్కునో ఆక్రమించుకునో తన ఆస్తుల్లో కలిపేసుకున్నారన్న ఆరోపణకు ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ప్రాధాన్యం లేదు. ఆ ఆరోపణలను ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి తన సీనియర్ రాజకీయ సహచరుడితో, సహ ఉద్యమకారుడితో, మంత్రివర్గ సభ్యుడితో ఎట్లా వ్యవహరించారన్నదే ఇక్కడ ముఖ్యం అవుతున్నది. తన పరిపాలనలో అవినీతి అన్నదే ఉండదని, కుటుంబసభ్యులు పాల్పడినా క్షమించేది లేదని కెసిఆర్ తాను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రకటించారు. దాన్ని ఎందరు సీరియస్‌గా తీసుకున్నారో తెలియదు. బహుశా, కెసిఆర్ తన భీషణ ప్రతిజ్ఞను అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకుని, ఎంపిక చేసిన నిందితులకు ఉద్వాసన చెబుతుంటారేమో తెలియదు. అవినీతిపరులను గుర్తించి వారిని శిక్షించే తీరులో ఒక ప్రత్యేకతను కెసిఆర్ చూపిస్తారు. ఆశ్చర్యకరంగా, తాను పెట్టుకున్న లక్ష్యంపై అవినీతి కథనాలు ‘ఇతర’ పత్రికలలో వస్తాయి. ఆ మంత్రి ఇంకా పదవిలో ఉండగానే గగ్గోలు మొదలవుతుంది. పత్రికాముఖంగా బర్తరఫ్ చేసినట్టు అన్నమాట. ఈటల రాజేందర్ విషయంలో ఇతర పత్రికలతో, మీడియాతో పాటు పాటు స్వీయ వేదికలలో కూడా కథనాలు ప్రచురితమయ్యాయి. ఒక వ్యక్తిని ‘ఇతరుడి’గా ఆయన ప్రకటించే పద్ధతి అది. అది చాలా అవమానకరమైనదని, క్రూరమైనదని ఎవరికన్నా అనిపిస్తే అది వారి సొంత అభిప్రాయం. నిర్దిష్ట లక్ష్యానికి గుణపాఠం చెప్పడం ఒక్కటే కాదు, తక్కిన అందరికీ కూడా హెచ్చరిక చేయడం, విధేయత విధివిధానాలను గుర్తుచేయడం అధినాయకుడి ఉద్దేశ్యం. ఈటల ఉదంతంలో జరిగింది అవిధేయతను శిక్షించడమేనని జనం అర్థం చేసుకున్నారు. అవినీతో, ఆక్రమణలో కాదు అవిధేయత అంటే. అవిధేయత అంటే అవే అయితే తెలంగాణ అధికారపార్టీలో అది కోకొల్లలుగా ఉన్నది. పార్టీపై యాజమాన్య హక్కున్నదని చెప్పుకోవడం దగ్గర నుంచి, ఈటల ఇటీవలి అన్యాపదేశ ఆత్మాభిమాన వ్యాఖ్యల దాకా అవిధేయతే. పార్టీని తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని, వారసత్వాన్ని కూడా తానే నిర్ణయించాలని అనుకునే ఏ నాయకుడైనా ఇటువంటి అవిధేయతను సహించకపోవడం సహజమే. 


మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేస్తానని చెప్పి, ఈటలను జాబితానుంచి తొలగిస్తే సరిపోయేది. అవిధేయతకు ఒక హెచ్చరికగా మిగిలేది. కెసిఆర్ కాక మరెవరైనా అయిఉంటే అటువంటి సాత్విక పద్ధతులు అనుసరించేవారు. కానీ, అంతటితో కెసిఆర్‌కు తృప్తి కలగదు. అసమ్మతిని ప్రకటించినవారిని, అణగి ఉండకుండా తమ పనితీరుతో ప్రాభవాన్నీ, జనాకర్షణనీ పెంచుకునేవారినీ కూడా, తగిన సమయంలో, భవిష్యత్ రాజకీయ జీవితం ఉండకుండా అప్రదిష్ఠ పాలుచేసి అవమానకరంగా శిక్షించడం ఆయన పద్ధతి. పోనీ, అట్లా చేయడం రాజకీయంగా సరైనదే అనుకున్నా, కాస్త జాగ్రత్తగా చేయాలి కదా, వేసే నిందలను నమ్మడమో, తీవ్రమైనవని భావించడమో జనం చేయాలి కదా? ఈటల విషయంలో ఆయన ఆశించినదానికి భిన్నంగా జరిగింది, కక్షపూరితంగా శిక్ష విధిస్తున్నారన్న అభిప్రాయం కలిగింది. దొడ్డిదారి, రాజమార్గం అంటూ హైకోర్టు చెప్పింది కేవలం భూముల సర్వేకు మాత్రమే కాకుండా, మొత్తం పాలక నేత వ్యవహార సరళికి కూడా అన్వయించుకోవచ్చు. 


ఆదరాబాదరా నివేదికను కోర్టు నిలిపివేసింది కాబట్టి, ఈటల రాజేందర్‌పై కెసిఆర్ తలపెట్టిన అంచెలంచెల చర్యలు వేగంలో మందగించవచ్చు. ఒక పక్కన హైకోర్టు అక్షింతలు వేస్తుండగా, దేవాదాయ భూముల సర్వే కూడా మరోపక్క అదే హడావుడిగా జరుగుతూనే ఉన్నది. కానీ, పనిలోపనిగా, అధికారపార్టీలో, మంత్రివర్గంలో ఉన్న అనేకమంది భూభాగోతాలు చర్చలోకి వస్తున్నాయి. అధినేతకు అదేమంత ఆనందకరమైనది కాదు. భూ అంశాల మీదనే దృష్టి కొనసాగిస్తారా, లేక, క్రమశిక్షణారాహిత్యం మీద విధేయ నేతల నుంచి డిమాండ్లు రాబట్టి పార్టీ నుంచి బహిష్కరణ, ఆపైన అనర్హత అన్న వరుసను అనుసరిస్తారా చూడవలసి ఉన్నది. ఈ క్రమం ఎంత ఎక్కువ కాలం నడిస్తే, ఈటలకు అంత ఎక్కువ సానుభూతి సమకూరే అవకాశం ఉన్నది. 


సమకూరే సానుభూతిని ఆయన ఏం చేసుకుంటాడు అన్నది మరో ప్రశ్న, కీలకమయిన ప్రశ్న కూడా! తెలంగాణ సమాజం, ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో కలసి నడిచి, దాని ఉద్వేగాలను, కీలక ఘట్టాలను మనసుకు పట్టించుకున్న ఉద్యమసమాజం, ఈటల రాజేందర్‌ను గౌరవంతో పరిగణిస్తుంది. ఉద్యమంలో ఆయన క్రియాశీలత, ఉద్యమపార్టీలో సుదీర్ఘకాలం భాగస్వామిగా ఉండడం, హుందా అయిన వ్యక్తిత్వం, మృదువైన మాట తీరు మొదలైనవి అందుకు కారణాలు కావచ్చును. అటువంటి స్వభావాలు ఉన్న వారు ఇప్పటికీ టిఆర్ఎస్‌లో అనేకులు ఉన్నారు. వారందరి మీదా ప్రజలకు ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. గత ఏడు సంవత్సరాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని, ఆయన వ్యవహారసరళిలోని ప్రతి ఒక్క అంశాన్ని రాజేందర్ కానీ, ఆయన వంటి ఇతరులు కానీ నూటికి నూరుపాళ్లు సమర్థించారని భావించలేము. సంక్షేమతత్వాన్ని, అభివృద్ధి ప్రాజెక్టులను హర్షించి ఉండవచ్చు, అప్రజాస్వామికతను, హక్కుల ఉల్లంఘనలను అయిష్టంగానే భరించి ఉండవచ్చు. ఆ నాయకులు తమ భిన్నాభిప్రాయాన్ని కానీ, అసమ్మతిని కానీ ప్రకటించి ఉంటే బాగుండేదని తెలంగాణ ప్రజలు కోరుకున్న సందర్భాలున్నాయి. ఎందువల్లనో, తమ అభిప్రాయాలను, ఈటల ఇప్పుడు ప్రస్తావిస్తున్న అవమానాలను వారు దిగమింగారు. ముఖ్యమంత్రిని, పరిపాలనను సరిదిద్దే మిత్రసమ్మిత వాక్యాలు కూడా వారు పలకలేకపోయారు. ఇప్పుడు, తనను ఇంతగా అవమాన పరుస్తున్న సందర్భంలో మాట్లాడుతున్న మాటలను ఈటల మునుపే మాట్లాడి ఉండవలసిందని కొందరు భావిస్తున్నారు. అలాగని, ఈటల అసలే మాట్లాడకుండా పోలేదు, తన పదవిలో తనకు ఊపిరాడకపోవడాన్ని ఏదో రూపంలో వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. తన భిన్నాభిప్రాయానికి ఒక ఆచరణ రూపం ఇవ్వడంలో, పరిస్థితులను అంచనా వేయడంలో ఆయనకు సమస్యలు ఎదురయ్యాయి. అనువైన సందర్భాన్ని తనంతట తాను ఎంచుకునే అవసరం లేకుండా ఇప్పుడు అధినేతే అందుకు ఆస్కారం కలిగించారు. 


ఇప్పుడు సంచలనంగా ఉన్న సంగతి రేపు చప్పపడిపోవచ్చు. నిప్పు కాపాడుకునే నేర్పు ఉండాలి. మార్గాన్ని నిర్దేశించుకోవాలి. మంచిని సమర్థించి, చెడును మాత్రమే వేలెత్తి చూపాలి. వ్యక్తిని గౌరవిస్తూనే విధానాలను వ్యతిరేకించాలి. కెసిఆర్ వంటి చాణక్యుడు తన సమస్త బలగాలనీ ప్రయోగిస్తే కూడా, నిబ్బరంగా నిలబడే ఓపిక ఉండాలి. ఈటల తనకు జరిగిన అవమానం గురించి మాట్లాడితే, ఆయన ప్రాసంగికత పరిమితమే అవుతుంది. తెలంగాణ సమాజం అనుభవిస్తున్న అప్రజాస్వామికతతో తన వ్యక్తిగత అనుభవాన్ని జోడించగలగాలి. తన సమస్యలతో మొదలుపెట్టినా, ప్రజాసమస్యలకు విస్తరించాలి. 


కెసిఆర్‌ను నూటికి నూరుపాళ్లు గౌరవించేవారు కూడా, ప్రత్యామ్నాయం లేకుండా ఆయన ఒక్కడే నిరంకుశుడిగా ఉండడాన్ని కోరుకోరు. చతికిల పడిన కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే. భారతీయ జనతాపార్టీకి దాని పరిమితులు, ప్రతికూలతలు దానికి ఉన్నాయి. మరో ప్రాంతీయపార్టీ అవతరించడమే తెలంగాణకు సహజమైన పరిణామం. అది ఉద్యమపార్టీ కడుపునుంచే రావాలి. అటువంటి పరిణామమేదో జరగబోతోందని మరో సీనియర్ మంత్రిని మరో రకంగా శిక్షించినప్పుడు అనిపించింది. కానీ, అప్పుడు ఆ సంచలనం సర్దుకుంది. ఇప్పుడు ఈటల సందర్భంలో మళ్లీ ఊహలకు ఆస్కారం ఏర్పడుతోంది. కానీ, ఈటల ఆ సాహసం చేయగలరా; చేసినా దాన్ని నిలబెట్టడానికి జరగవలసిన క్లిష్టతర ప్రయాణం చేయగలరా?


కె. శ్రీనివాస్

Updated Date - 2021-05-06T06:06:51+05:30 IST