Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 26 Jun 2022 03:15:49 IST

నువ్వు హీరో ఏంటన్నారు

twitter-iconwatsapp-iconfb-icon
నువ్వు హీరో ఏంటన్నారు

నాన్న రైతు. పెరిగింది రాయలసీమ. చదివింది బీటెక్‌. సినీ నేపథ్యం లేని ఓ కుర్రాడు బెంగళూరులో ఉద్యోగం వదిలేసి హైదరాబాద్‌ వచ్చాడు. ‘నువ్వు హీరో ఏంట’ని నవ్విన చోటే... ‘వీడు హీరోగా బానే ఉన్నాడ’నే ప్రశంసలందుకున్నాడు. అవమానాలు భరించి... ఒత్తిడులను జయించి... పరిశ్రమలో నిలబడిన అతడిపై ఇప్పుడు బడా బ్యానర్లు భారీగా డబ్బు పెడుతున్నాయి. హీరో, రచయిత కిరణ్‌ అబ్బవరంతో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ... 


మీ నేపథ్యం గురించి చెప్పండి? 

మాది కడపజిల్లా రాయచోటి. నాన్న రైతు. బీటెక్‌ అయ్యాక కొన్నాళ్లు బెంగళూరులో జాబ్‌ చేశాను. 2016 నుంచి షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసుకుంటూ వర్క్‌ నేర్చుకుంటూ సినిమాల్లోకి వచ్చాను. 2018లో నా తొలిచిత్రం ‘రాజావారు రాణిగారు’ ప్రారంభమైంది.

 

నటుడిగా నిలదొక్కుకునే క్రమంలో ఎదురైన ఇబ్బందులు? 

అసలు ఏమీ తెలియని రంగంలో రాణించడం అనుకున్నంత సులభం మాత్రం కాదు. అందులోనూ హీరోగా రాణించడం చాలా కష్టం. దానికి మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. హీరో అవ్వాలనే మొండి ధైర్యంతో వచ్చాను. ‘పదేళ్లు పట్టినా కష్టపడదాం’ అని డిసైడ్‌ అయ్యాను. 


హీరో అవ్వాలనుకోవడానికి కారణం? 

ఉద్యోగ జీవితం చాలా సాదాసీదాగా అనిపించింది. జీవితం అంటే ఇంతేనా? ఇంకేం లేదా? అనిపించింది. అనుకోకుండా షార్ట్‌ఫిల్మ్‌ చేయడం, ప్రేక్షకుల నుంచి ‘వీడు హీరోగా బాగానే ఉన్నాడు’ అనే ప్రశంసలు రావడంతో సినిమానే నా గమ్యం అనిపించింది. ఈ రంగంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం కాబట్టి దీన్నే సాధిద్దాం అనుకున్నాను. 


కెరీర్‌ ఆరంభంలో ఈ ఫీల్డ్‌కు ఎందుకొచ్చామా అనిపించిందా? 

అనిపించింది. ‘రాజావారు రాణిగారు’ రిలీజైనదాకా కూడా మా ఇంట్లో వాళ్లు నేను ఉద్యోగం చేస్తున్నాననే అనుకున్నారు. ఇండస్ట్రీలో చూస్తే అంతా నెగిటివిటీ. నూటికి తొంబై తొమ్మిది మంది ‘ఉద్యోగం ఎందుకు వదులుకున్నావు. నీకు పిచ్చి పట్టింది. హీరో అంటే మాటలు కాదు’ అనేవారు. సాయంత్రం కృష్ణానగర్‌లో తిరిగేటప్పుడు ‘మనవల్ల కాద’నిపించేది. ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రం సాధించగలననే మొండి ధైర్యం వచ్చేది. ఇక్కడ అన్నీ భరించాలి. మెంటల్‌ స్ట్రగుల్‌ చాలా పడ్డాను. తొలి చిత్రాలు రెండింటికీ వచ్చిన స్పందన తర్వాత కుదుటపడ్డాను.

 

ఇండస్ట్రీలో వివక్ష ఎదుర్కొన్నారా? 

‘నువ్వు హీరో ఏంట’ని నవ్వేవారు. అయినా ఎప్పుడూ వెనక్కి వెళ్లిపోవాలని అనుకోలేదు. ఎప్పుడూ నెగిటివిటీ ఉండేది. ఇతర రంగాల్లోలా ‘నువ్వు సక్సెస్‌ అవుతావ’ని ప్రోత్సహించేవాళ్లు ఎవరూ ఇక్కడ లేరు. పెద్ద హీరోలు, దర్శకులు తప్ప ఇతర విభాగాల్లో పనిచేసేవారు కూడా తమ పిల్లలు ఈ ఫీల్డ్‌లోకి వస్తామంటే వద్దంటారు. కెరీర్‌ దెబ్బతినడం, ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావడం దానికి కారణం. 


అవమానాలు ఎదుర్కొన్నారా? 

‘రాజావారు రాణిగారు’ అయిపోయాక ఒక నిర్మాణ సంస్థ పిలిచి ‘సినిమా చేద్దాం’ అంది. ‘షూట్‌కి వెళ్లడానికి కారు ఇస్తాం. పారితోషికం మాత్రం ఇవ్వం. ఊరికే అందరూ హీరోలయిపోరు’ అన్నారు. హీరో అయిందాకా ఒక స్టేజీ. హీరో అయ్యాక మళ్లీ ‘చిన్న హీరో’ అని ముద్ర వేస్తారు. ఇవన్నీ రోజూ నడుస్తుంటాయి. 


బాగా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా? 

కొన్ని జరిగాయి కానీ, నేను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. నేను బయట ఎక్కడా ఆడిషన్స్‌కు వెళ్లలేదు. అవకాశం ఇవ్వమని ఎవరినీ అడగలేదు. నా అవకాశాలను నేనే సృష్టించుకున్నాను. అందుకే అలాంటి సందర్భాలు ఎదురవ్వలేదు. 

నువ్వు హీరో ఏంటన్నారు

తొలి సినిమా అవకాశం ఎలా వచ్చింది? 

లఘుచిత్రం తీశాక, తక్కువ బడ్జెట్‌లో సినిమా చేయాలనుకున్నాం. వెబ్‌సిరీస్‌ కోసం అనుకున్న కథను సినిమాగా మలిచాం. డబ్బులు కొంచెం కొంచెం కూడబెట్టి, ‘రాజావారు రాణిగారు’ పూర్తి చేశాం. అన్నీ నేనే దగ్గరుండి చూసుకున్నాను. సురేష్‌బాబు గారికి సినిమా చూపించి థియేటర్లదాకా తీసుకువచ్చాం. ఏడాదిన్నర కష్టపడ్డా. డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌ మీద కూడా పట్టు వచ్చింది. నేనే కూర్చొని కథ, డైలాగ్‌లు, స్ర్కీన్‌ప్లే రాసుకున్నాను. ‘మనం  ఏంటో చూపించే సినిమా ఒకటి ఉండాలి’ అని చెప్పి డిజైన్‌ చేసుకొన్నా. మా ఊళ్లోనే ఆ సినిమా తీశాం. 


‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ తర్వాత పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? 

‘ఒక శుక్రవారం జాతకం మార్చేస్తుంది’ అంటారు కదా... ఆ సినిమాతో నా విషయంలో అదే జరిగింది. లాక్‌డౌన్‌  తొలగించిన వెంటనే విడుదలైన చిత్రం అది. అందరూ సినిమాలు విడుదల చేయడానికి జంకుతున్న సమయం. మేం చాలా కష్టపడి విడుదల చేశాం. ‘మహా అయితే రూ.30 లక్షల వసూళ్లు వస్తాయి’ అన్నారు. కానీ సినిమాకు ఎక్కడ చూసినా సెలబ్రేషన్స్‌ జరిగాయి. థియేటర్లు హౌస్‌ఫుల్‌. ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ ఫోన్‌ చేసి ‘మళ్లీ నువ్వే మాకు అన్నం పెట్టావమ్మా’ అన్నట్లు మాట్లాడారు. చాలాచోట్ల వాళ్లకి రూపాయికి ఐదు రూపాయల లాభం తెచ్చిపెట్టింది ఆ సినిమా. దానివల్ల కిరణ్‌ అంటే గౌరవం పెరిగింది. తర్వాత రచనలో నాకు పట్టుండడంతో పెద్ద బ్యానర్ల నుంచి పిలుపు వచ్చింది. అయితే ‘సెబాస్టియన్‌’ ఫలితం నిరాశపరచడంతో మళ్లీ మొదటికొచ్చింది. హిట్‌ అయితే అలా ఉంటుంది. ఫ్లాప్‌ వస్తే ఇలా ఉంటుంది. దేన్నయినా తట్టుకోవాలని అర్థమైంది. పెద్ద బ్యానర్లు నా మీద నమ్మకంతో నా రేంజ్‌కు మించి నాపైన డబ్బు పెడుతున్నాయి. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసినా, ఏమీ తెలియనట్లే నటిస్తున్నారు. 


ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో రచయితగా భాగం అవుతున్నారా? 

‘నేను మీకు బాగా కావాల్సినవాణ్ణి’ సినిమాకు రచన చేస్తున్నాను. 


ప్రేక్షకుల నాడి పట్టాలంటే రచయితకు ఏముండాలి?

కామన్‌సెన్స్‌ ఉండాలి. చిన్నప్పటి నుంచి మట్టి విలువ, మధ్యతరగతి అనుబంధాలు తెలిసి ఉండాలి. సినిమా అంటే హైదరాబాద్‌ మల్టీప్లెక్స్‌లో కూర్చొని చూసేది కాదు. పల్లెలకు వెళ్లి చూడాలి. సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో డోర్లు ఓపెన్‌ చేసి, షోలు వేసిన సందర్భాలున్నాయి. చుట్టుపక్కల వాళ్లతో ఎక్కువ మాట్లాడాలి. ఉదాహరణకు బస్సులో పక్క ప్రయాణికులను గమనిస్తే కొత్త కంటెంట్‌ వస్తుంది. మన చుట్టుపక్కలే కథకు కావాల్సిన ముడిసరుకు దొరుకుతుంది. దాన్ని పట్టుకోగల నేర్పు రచయితకు ఉండాలి. 


మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు? 

ఫాదర్‌ ఎమోషన్‌ అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక పౌరుషం, బాధ్యత ఉంటాయి. దానికి ఎవరైనా కనెక్ట్‌ అవుతారు. 

నువ్వు హీరో ఏంటన్నారు

మీకు ఏ జానర్‌ చిత్రాలు ఇష్టం? 

అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ ఎంటర్టైనర్‌లు ఇష్టం. కుటుంబంలో అందరినీ థియేటర్‌కు రప్పించే జానర్‌ అది. 


సినిమా ఫలితం కోసం ఎదురుచూడడం ఎలా అనిపిస్తోంది? 

చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంది. భయమైతే లేదు. ఒక్కసారి తెరమీద కనపడితే చాలనుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బోనస్‌లు. కష్టపడడం మాత్రమే నా చేతుల్లో ఉంది. 


కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఎలా అనిపిస్తోంది? 

ఈ జర్నీ నాకు నచ్చింది. నాపైన నాకు గౌరవం పెరిగింది. నాకు చదువు అంతగా అబ్బలేదు. సినిమా రూపంలో ఒక వ్యక్తిగా గొప్ప స్థానం దక్కడం ఆనందం ఇచ్చింది. 


వరుస చిత్రాలు చేయడానికి కారణం?

లెక్కలు వేసుకోకుండా సినిమాలు చేయాలనేది నా కోరిక. ఒకప్పుడు చిరంజీవిగారు చేసినట్లు చేయగలిగితే ఇండస్ట్రీ, సినీ కార్మికులు బాగుంటారు. ప్రతిభావంతులకు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి. అందుకే వరుసగా సినిమాలు చేస్తున్నా.


నటుడిగా మీకు గుర్తుండిపోయిన ప్రశంస?

‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ షూటింగ్‌ అయిపోయాక సాయిగారు ‘చాలా రోజుల తర్వాత జాబ్‌ శాటిస్‌ఫాక్షన్‌ వచ్చింది... థాంక్స్‌’ అన్నారు. అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది.  


ఇబ్బందుల నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏమిటి? 

మనం సాధించలేమని అనుకొనే దానికోసం మనం చేసే జర్నీ చాలా బాగుంటుంది. మనం స్ట్రాంగ్‌గా ఉండాలని అది నేర్పుతుంది. 


ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? 

ఐదు ప్రాజెక్ట్‌లు చేస్తున్నా. కోడి రామకృష్ణ గారి బ్యానర్‌లో, గీతా ఆర్ట్స్‌లో, మైత్రి మూవీ మేకర్స్‌లో, ఏఎం రత్నం గారి బ్యానర్‌లో, ఏషియన్‌ సునీల్‌ గారి బ్యానర్‌లో ఒక చిత్రం చేస్తున్నాను. వీటిలో మూడు చిత్రాల షూటింగ్‌ పూర్తయింది. ఈ ఏడాది మొత్తంగా నావి నాలుగు సినిమాలు విడుదలవుతాయి. 


గతంతో పోల్చితే ఇప్పటి జీవితం ఎలా ఉంది? 

చాలా హ్యాపీ. కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి. 

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌ 


నటుడు రచయిత అయితే వచ్చే సౌలభ్యం ఏమిటి? 

రచయిత భావాన్ని సులభంగా అర్థం చేసుకొని నటించగలం. దానివల్ల దర్శకుడికి పని సులువవుతుంది. నటుడు రచయిత అయితే అది అతని కెరీర్‌కు మేజర్‌ అడ్వాంటేజ్‌ అవుతుంది. కథ వింటున్నప్పుడే ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వాలనే ఓ అంచనా వస్తుంది. 


ఎలాంటి ప్రాజె క్ట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు? 

‘వినరో భాగ్యము విష్ణు కథ’ నాకు గౌరవం తెచ్చేలా ఉంటుంది. ‘మైత్రి మూవీస్‌’లో చేసే సినిమా మంచి పేరు తెస్తుంది. పది సినిమాల తర్వాత పడాల్సింది ఇప్పుడే పడింది. కమర్షియల్‌గా భారీ స్కేల్‌లో ఉంటుంది. రవితేజ గారి తర్వాత మళ్లీ నేనే ఆ స్థాయిలో చేశాను. దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. 


గడ్డు పరిస్థితుల్లో మీకు అండగా నిలిచేవారు ఎవరైనా ఉన్నారా? 

నాకు 15 మంది బృందం ఉంది. ఏ ఇబ్బంది వచ్చినా అందరం కలసి పరిష్కరించుకొంటాం. బయటకు వెళ్లడం ఇష్టం ఉండదు. సినిమా షూటింగ్స్‌ లేకపోతే ఊరికి వెళ్లిపోతాను. ప్రస్తుతం రోజూ 19 గంటలు షూటింగ్‌లో ఉంటున్నాను. నాలుగు సినిమాలు కంప్లీట్‌ చేయాలి. రాత్రి... పగలు పని చేస్తున్నా. 


తెలుగులో మీకు బాగా నచ్చిన హీరో?

పవన్‌కల్యాణ్‌ గారు అంటే ప్రత్యేకాభిమానం. ఎవరు బాగా చేసినా, వారిని చూసి ఎంతో కొంత నేర్చుకుంటాను.


హీరోయిన్లలో ఎవరు ఇష్టం?

గతంలో సిమ్రాన్‌, శ్రియ అంటే ఇష్టం. ఇప్పుడు ఎవరూ లేరు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.