జిల్లా ప్రజలకు ఏం చేశారు?

ABN , First Publish Date - 2022-07-05T06:03:24+05:30 IST

‘ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు మూడేళ్లలో ఏం మేలు చేశారో చెప్పి... ముఖ్యమంత్రి జగన్‌ ఇక్కడ అడుగు పెట్టాల’ని... తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

జిల్లా ప్రజలకు ఏం చేశారు?
మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి

 ఎన్ని ప్రాజెక్టులు చేపట్టారో సీఎం జగన్‌ చెప్పాలి

 టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి 


కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై 4: ‘ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు మూడేళ్లలో ఏం మేలు చేశారో చెప్పి... ముఖ్యమంత్రి జగన్‌ ఇక్కడ అడుగు పెట్టాల’ని... తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆదోని పర్యటనకు సీఎం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కర్నూలు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో వైసీపీ నాయకులనే ఎన్నుకున్నారని గుర్తు చేశారు. మూడేళ్ల కాలంలో జగన్‌ రెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై శ్రద్ధ చూపలేదని కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు.  నంద్యాల ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మూడేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నీటి ప్రాజెక్టులను ఏం చేపట్టారు?... ఎంత మేరకు పూర్తి చేశారు..? ఎన్ని నిధులు విడుదల చేశారు? ఈ వివరాలను  ఆదోని సభలో జగన్‌ రెడ్డి ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇవేమీ చేయకుండా జిల్లాకు ఏ ముఖం  పెట్టుకువస్తున్నారని కోట్ల ప్రశ్నిం చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీడువారిన భూములకు సాగునీరు అందించేందుకు మూడు ప్రధాన ప్రాజెక్టులకు నిధులను విడుదల చేస్తూ జీవోను విడుదల చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు రావడం... జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని 9 సాగునీటి ప్రాజెక్టుల పనులు ముందుకు సాగలేదని ఆరోపించారు. హంద్రీనీవా పనులను టీడీపీ హయాంలోనే 75 శాతం పూర్తయ్యాయని గుర్తు చేశారు. ‘రూ.150 కోట్లు ఖర్చు చేస్తే... మీ మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గమైన ఆలూరులోనే 52 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండేద’ని అన్నారు. ఏటా రూ.700 కోట్ల మేరకు పంటల రూపంలో రైతులకు మేలు చేకూరేదని తెలిపారు. మూడేళ్ల కాలంలో  ఒక్క రూపాయి కూడా ఈ పనుల కోసం ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా హంద్రీనీవాను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.  శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఫ్రంజ్‌ఫూల్‌ను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికపై పనులు చేయాలని కోరారు. నిర్లక్ష్యం చూపిస్తే ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమని ఇటీవల కేంద్ర జలవనరుల సేఫ్టీ కమిటీ సభ్యులు పాండే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నివేదిక అందించారని గుర్తు చేశారు. ఆ నివేదికను ఎందుకు బుట్టదాఖలు చేశారని జగన్‌ను ప్రశ్నించారు. ‘వచ్చే ఎన్నికల్లో మీ భరతం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నార’ని కోట్ల హెచ్చరించారు. కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ... ‘జగన్‌... మీ పనైపోయింది. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. అక్రమాలు... దౌర్జన్యాలతో జేబులు నింపుకుంటూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులను కట్టడి చేసి.. ప్రజలకు మేలు చేయాల’ని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు నంద్యాల నాగేంద్ర కుమార్‌, పోతురాజు రవికుమార్‌, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్‌, కోడుమూరు ఇన్‌చార్జి ఆకేపోగు ప్రభాకర్‌, సత్రం రామకృష్ణుడు, గోపినాథ్‌, హరిశంకర్‌, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T06:03:24+05:30 IST