బుద్ధుని బోధ: ఘోరంగా అవమానించి, ముఖం మీద కాండ్రించి ఉమ్మేసిన వ్యక్తితో బుద్ధుడు ఏమన్నాడంటే...

ABN , First Publish Date - 2021-11-13T13:01:07+05:30 IST

ఒకసారి గౌతమబుద్ధుడు తన శిష్యులతో..

బుద్ధుని బోధ: ఘోరంగా అవమానించి, ముఖం మీద కాండ్రించి ఉమ్మేసిన వ్యక్తితో బుద్ధుడు ఏమన్నాడంటే...

ఒకసారి గౌతమబుద్ధుడు తన శిష్యులతో సత్సంగం నిర్వహిస్తున్నాడు. “కోపం మనిషికి పెద్ద శత్రువు. కోపంతో రగిలిపోయే వ్యక్తి తనకు తాను హానిచేసుకోవడమే కాకుండా, ఇతరులకు కూడా హాని తలపెడతాడు. అటువంటి వ్యక్తి ప్రతీకార జ్వాలలో మాడిపోయి, తన జీవితాన్నే నాశనం చేసుకుంటాడు’’ అని బుద్ధుడు శిష్యులకు తెలిపాడు. బుధ్దుని ఉపన్యాసం ముగిసిన తరువాత అక్కడున్నవారిలో ఒకరు లేచి నిలబడి.. ‘‘మీ మాటలు మనుషుల తీరుకు విరుద్ధంగా ఉన్నాయి. మీరు ఏది చెప్పినా, జీవితంలో అనుసరించడం కష్టం” అని అన్నాడు. ఈ మాటలకు గౌతమ బుద్ధుడు స్పందించలేదు. పైగా నిశ్శబ్దం వహించాడు.  దీంతో ఆ వ్యక్తి మరింత కోపంతో రెచ్చిపోతూ.. గౌతమ బుద్ధుని ముఖం మీద ఉమ్మివేసాడు. అయినప్పటికీ గౌతమ బుద్ధుడు ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. ప్రశాంత చిత్తంతోనే ఉన్నాడు.  తన ముఖం మీద పడిన ఉమ్మిని తుడుచుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. దీనిని గమనించిన ఆ వ్యక్తికి బుద్ధుని ప్రవర్తన ద్వారా ఏమీ అర్థం కాలేదు. దీంతో ఇంటికి వెళ్లిపోయాడు. 


కాసేపటికి అతని మనసు శాంతించింది. తాను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థం చేసుకున్నాడు. “నేను  మహాత్ముడిని హోరంగా అవమానించాను.  పాపపు పనిచేశాను. వెంటనే వెళ్లి బుద్ధుడిని క్షమాపణ కోరాలి’’ అని మనసులో అనున్నాడు. బుద్ధుని వద్దకు వెళ్లాడు. అయితే అక్కడ బుద్ధుడు లేడు.  దీంతో అతను బుద్ధుని కోసం వెదకడం ప్రారంభించాడు.  కొద్దిసేపటి తరువాత బుద్ధుడు ఎదురుపడగానే.. అతను ఆ మహనీయుని పాదాలపై పడి, "నన్ను క్షమించండి. నేను పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని ఘోరంగా అవమానించాను.  నేను మహాపాపం చేశాను." అని వేదనతో అన్నాడు. ఇదంతా చూసిన గౌతమబుద్ధుడు అతనితో మాట్లాడుతూ "శాంతంగా ఉండండి, విషయం ఏమిటో చెప్పండి? ఇంతకీ మీరెవరు?" అని అడిగాడు.  గౌతమ బుద్ధుడు ఇలా అడగడంతో ఆ వ్యక్తి.. ‘‘ఇంతగా అవమానించిన తనను బుద్ధుడు ఇంత త్వరగా ఎలా మరచిపోతాడు’’ అని మనసులో అనుకుంటూ.. "నిన్న నేను మిమ్మల్ని ఘోరంగా అవమానించాను. అలాంటి నన్ను మీరు ఇంత త్వరగా ఎలా మరచిపోయారు?" అని అడిగాడు. దీనికి బుద్ధుడు సమాధానమిస్తూ.. “గడచిపోయిన సంగతిని మర్నాటికికైనా వదిలేయాలి.  అది మంచిదైనా.. చెడ్డదైనా మళ్లీ మళ్లీ ఆలోచించకూడదు. గతాన్ని విడిచిపెట్టి, మనమందరం ముందుకు సాగాలి’’  అని అన్నాడు. మహాత్ముని మాటలు విన్న ఆ వ్యక్తిని నోటమాట రాలేదు. బుద్ధుని ఘనత గ్రహించి..‘‘ఈరోజు నుండి మీరు చెప్పినదానిని ఆచరిస్తాను’ అని పశ్చాత్తాపంతో అన్నాడు. కోపం మనిషికి శత్రువని, మనిషి కోపానికి గురి కాకూడదని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే గతాన్ని మరిచిపోయి ముందుకు సాగాలని కూడా ఈ కథ మనకు నేర్పుతుంది.

Updated Date - 2021-11-13T13:01:07+05:30 IST