ప్లేటోకు కవులతో ఏం పేచీ?

ABN , First Publish Date - 2021-08-02T10:02:04+05:30 IST

ప్రాచీనకాలం నుండీ ఒక తరం నుంచి మరో తరానికి సంస్కృతీ సంప్రదాయాల పేరిట పూర్వపు నియమాలు, చరిత్ర, నాగరికత లాంటివి అందుతాయి....

ప్లేటోకు కవులతో ఏం పేచీ?

ప్రాచీనకాలం నుండీ ఒక తరం నుంచి మరో తరానికి సంస్కృతీ సంప్రదాయాల పేరిట పూర్వపు నియమాలు, చరిత్ర, నాగరికత లాంటివి అందుతాయి. సాహిత్యంలో కథలూ కవిత్వం ఈ కొనసాగింపుకి కీలక మాధ్యమాలుగా ఉంటాయి. సాహిత్యంలో ‘మిత్‌’ (Myth- పురాణం/ గాథ) చాలా ప్రత్యేక మైనది. దీన్ని వాడుక భాషలో పుక్కిట పురాణమని అంటుంటాం. ‘మిత్‌’ చరిత్రను సజీవంగా ఉంచుతుంది. ఆ నోటా ఈ నోటా వినే పిట్టకథల ద్వారానో; బుఱ్ఱకథలు, తోలుబొమ్మలాటలూ, సాహిత్యం, చిత్రలేఖనం, నాట్యం వంటి వివిధ కళారూపాల ద్వారానో; ఇత రత్రా చిహ్నాల ద్వారానో ఒక తరం నుండి మరో తరానికీ, ఒక వ్యవస్థ నుంచి మరో వ్యవస్థ లోకీ జొరబడే ఈ పురాణాలు మనిషికి గతించిన కాలపు సంస్కృతిని పరిచయం చేస్తాయి. పాలిటిక్స్‌, జర్నలిజం వంటి రంగాలలో విస్తృతమైన అధ్యయనాలు చేసిన రోలాండ్‌ బార్త్‌ తన ‘మైథాలజీస్‌’ పుస్తకంలో ‘మిత్‌’ గురించి రాస్తూ ఏ సంస్కృతికి సంబంధించిన పురాణమైనా ‘‘సైన్‌ని సిగ్నిఫైర్‌గా మార్చే సెమియోటిక్‌ సిస్టమ్‌లో భాగం’’ అని అంటారు. వివిధ సంస్కృతు లకు సంబంధించిన చరిత్ర ఈ మిత్‌ ప్రాతిపదికగా రూపొంది నదే. మిత్స్‌ సమాజాన్ని ప్రత్య క్షంగానూ పరోక్షంగానూ కూడా శాసిస్తాయి.


ఇటాలియన్‌ రచయిత రోబర్టో కలాస్సో (Roberto Calasso) ‘ది ఫోర్టీ నైన్‌ స్టెప్స్‌’ అనే పుస్తకంలో ‘ది టెర్రర్‌ ఆఫ్‌ ఫేబుల్స్‌’ పేరిట రాసిన వ్యాసంలో మిత్‌కు కొన్ని పేజీలు కేటాయించారు. అక్కడ పురాణాల వల్ల మనిషికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసే ప్రయత్నం చేశారు. చరిత్ర మనకు మార్గం సులభం చేస్తుందా లేక మోయలేక వదిలించుకోవాలనుకునే గుదిబండగా మిగులుతుందా అనే దిశగా ఆలో చనలు రేకెత్తిస్తూ ఇందులో పలు విశ్లేషణలు ఉన్నాయి. కథలూ, గాథలూ మేలు చెయ్యడం గురించి తెలుసు గానీ కీడు చెయ్యడం ఏమిటి...? అని ఆశ్చర్యంగా అనిపిం చినా, కలాస్సో తన పదునైన వాదనతో పాఠకుల్ని ఆలోచనలో పడేస్తారు. ఈ మిత్‌ను రెండు అర్థాల్లో తీసుకోవచ్చునంటారు కలాస్సో: మొదటిది, ‘ప్రశ్నించడానికి అవకాశం లేని అద్భుతం’ అయితే రెండోది దానికి పూర్తిగా భిన్నమైన అర్థంలో ‘ఒక అబద్ధం/ భ్రమ/ పుక్కిటి పురాణ’మని కొట్టిపారేసేది. ఈ నేపథ్యంలో ప్లేటో ‘రిపబ్లిక్‌’ను ఉదహరిస్తూ గ్రీకు పురాణాల్లో తరచూ వివాదాస్పదమైన అంశంగా నిలిచిన ఈ మిత్‌కు పూర్తి స్థాయి సాధికార స్వరంలో వ్యతిరేకత ఎదురైంది మాత్రం ప్లేటో ‘రిపబ్లిక్‌’ లోనే అంటారు కలాస్సో. ప్లేటో తన ‘రిపబ్లిక్‌’ గ్రంథంలో తాత్వికతకూ కవిత్వానికీ మధ్య పూర్వపు వైరాన్ని వెలికి తీస్తారు. ఆనాటికి కవిత్వానికి మారు పేరుగా నిలిచినవీ, ప్రాచీన గ్రీకు సాహిత్యానికి పునాదులు వేసినవీ  హోమర్‌ సృష్టించిన ‘ఇలియడ్‌’, ‘ఒడిస్సీ’లు. ఈ కోణంలో చూస్తే మొత్తం ‘రిపబ్లిక్‌’ గ్రంథాన్ని ప్లేటో, హోమర్‌ల మధ్య ఘర్షణకు వేదికగా పరిగణించవచ్చు. గ్రీకులు హోమర్‌ కవిని తమ తొలి ఆధ్యాత్మిక గురువుగా, ప్రపంచానికీ దేవుళ్ళకీ మధ్య తన కవిత్వాన్ని వారధి వేసిన అనుసంధానకర్తగా చూస్తారు. అటువంటి హోమర్‌ని ప్లేటో తన ‘రిపబ్లిక్‌’ రెండవ పుస్తకంలో కవిత్వం పేరిట కట్టుకథలల్లి పుక్కిటి పురాణాలను సృష్టించిన వ్యక్తి అంటూ అధిక్షేపిస్తారు. ఇక ‘రిపబ్లిక్‌’ పదవ పుస్తకం దగ్గరకు వచ్చేసరికి కవులను ‘మిమెసిస్‌’ (అనుకరణ- ‘‘the   dangerous art of imitation’’)ను సాధన చేసే వ్యక్తులుగా నిందిస్తారు. కవులు లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపజేస్తూ తాము ప్రాతినిధ్యంవహించే కళకు న్యాయం చెయ్యడంలో విఫలమ య్యారని అంటారు ప్లేటో.


హోమర్‌కు వ్యతిరేకంగా ప్లేటో చేసిన వాదనలన్నీ కేవలం ఒక ఆదర్శవాది అభియోగాలని అనుకుంటే పొరపాటే. నిజానికి ప్లేటో ఆరోపణలన్నీ పూర్తి స్థాయి మెటాఫిజికల్‌ దృష్టికోణం నుంచి చేసినవేనంటారు కలాస్సో. ఒక వేళ మనం హోమర్‌ సృష్టించిన దేవుళ్ళను నమ్మాల్సిన పక్షంలో, హోమరిక్‌ కావ్యాల్లో నిరంతరం రూపాలను మార్చుకుంటూ మనుషుల్ని మోసం చేసే వారిని ఇంద్రజాలికులుగా, మాంత్రికులుగా, గారడీలు చేసే వ్యక్తులుగా భావించవలసివస్తుంది. కానీ దైవత్వాన్ని తన కవిత్వంలో పునః సృష్టించే క్రమంలో హోమర్‌ సైతం దేవుళ్ళు నిరంతరం రూపాం తరం చెందే ప్రక్రియకు ప్రత్యక్ష సాక్షి ఏమీ కాదు. హోమర్‌ ఆ మెటామార్ఫోసిస్‌కు పరోక్షంగా ప్రాతినిధ్యం వహించే సాధనం మాత్రమే. ఈ కారణంగా ఏ విధమైన స్పష్టతా, నియంత్రణా లేని ఈ మెటాఫిజికల్‌ జోన్‌  సహజంగానే ప్లేటో వంటి ఫిలాస ఫర్లకు శత్రుసమానంగా కనిపిస్తుంది. అందువల్ల వాస్తవికతకు దూరంగా అసంగతమైన ఆవరణకు ప్రాతినిధ్యం వహించే కవులను ప్రజాశ్రేయస్సు దృష్ట్యా సంఘం నుంచి బహిష్కరించా లంటాడు ప్లేటో.


ఈ తరహా హోమరిక్‌ మిత్‌నూ, కవుల ‘మిమెటిక్‌’ కవిత్వాన్నీ ఖండించిన ‘‘ప్లేటో ప్రపంచం’’లో కేవలం కవికేగాక అతడు సృష్టించిన దేవుళ్ళకు కూడా స్థానం లేదు. ప్లేటో కవిని ‘‘A man skillfully able to transform himself into everything’’ అని నిర్వచిస్తారు. కవిత్వం విషయంలో సిములాక్రా (simulacra), అనగా కొన్ని ప్రత్యేకమైన లేదా మెటాఫోరిక్‌ పదాల వాడకం పట్ల ప్లేటోకి ఉన్న ఖచ్చితమైన అభ్యంతరాలవల్ల పెద్ద నష్టం లేకపోయి నప్పటికీ, కావ్యసృష్టిలో భాగమైన మెటమార్ఫోసిస్‌ను తిరస్కరించడం వల్ల మాత్రం రెండు ప్రమాదాలుం టాయంటారు కలాస్సో. మెటామోర్ఫోసిస్‌ను తిరస్కరించడంతో ‘A is transformed into B’ అనే బదులు ‘A is B’ అని వాడవలసిన పరిస్థితి ఎదురవుతుంది. మెటమార్ఫొసిస్‌ ఖచ్చితంగా వృత్తాంతపరమైనది కాబట్టి, అంటే నేరేటివ్‌కి అవకాశమున్న అంశం కాబట్టి, ఏ ఇమేజ్‌ అయినా రూపాంతరం చెందే క్రమంలో జ్ఞాన సముపార్జనకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎంతో కొంత జ్ఞానం ప్రసాదించని సంస్కృతీ, నాగరికతా అంటూ ఉండే అవకాశం లేదు గనుక. దీనికి భిన్నంగా, ‘A is B’ అన్న పద్ధతి నేటి సాంకేతిక రంగంలోని అల్గోరిథంలా ఇన్‌పుట్‌ అవుట్‌పుట్‌ పద్ధతిలో ఉండడం వల్ల మెటమార్ఫోసిస్‌కు అవకాశం శూన్యం. ప్లేటో మెటమార్ఫోసిస్‌ను తిరస్కరిస్తున్నాడంటే, కవి భావోద్వేగాల వల్ల ప్రభావితమయ్యే ఊహాత్మకతనూ, తద్వారా ఇమేజిని అర్థం చేసుకునే (cognitive power) ప్రయత్నంలో జనించే అపరిమితమైన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నట్లే లెక్క. ప్లేటో వాదనలో లొసుగులేమిటో చూశాం కాబట్టి, ఇప్పుడు ఆయన ఆక్షేపిస్తున్న అనుకరణలోని ప్రమాదా లేమిటో కూడా చూద్దాం. పురాణాలు మనుషుల్ని తమను అనుకరించేలా మాయ చేస్తాయి, వారిని తమ సైద్ధాంతిక ప్రతి రూపాలుగా తయారుచేస్తాయి. ఈ మాయలో పడ్డవాళ్ళు గుడ్డి అనుకరణ మినహా తామేం చేస్తున్నారో కనీస స్పృహ లేక తమను తాము ఆ సిములాక్రాలో భాగంగా అంగీకరిస్తారు. 


ఇక మిత్‌ గురించి సోక్రటీస్‌ నిర్వచనం ప్లేటో ప్రతిపాదనకి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఈ విషయంలో ప్లేటోలో ఉన్న మొండితనం సోక్రటీస్‌లో కనిపించదు. సోక్రటీస్‌ మిత్‌ గురించి మాట్లాడుతూ ‘‘Beautiful indeed is this risk, and we somehow need to be enchanted with these things [i.e., fables]’’ అంటారు. ఈ సందిగ్ధంలో రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ కవితలో చెప్పిన రెండు మార్గాలూ గుర్తొచ్చాయి. ప్లేటో హెచ్చరించిన అస్పష్టత, అనుకరణలతో కూడిన దారిలో ప్రయాణించడమా లేదా గుడ్డి అనుసరణకు అవకాశం ఇవ్వకుండా తర్కాన్ని నమ్మి స్పష్టతతో కూడిన సౌకర్యవంతమైన దారిలో ప్రయాణించడమా అనేది ఎవరికి వారు చేసుకోవాల్సిన నిర్ణయం. ఈ మిత్‌ ప్రభా వాన్ని మనకు అర్థయ్యేలా చెప్పడానికి ఒక ఆసక్తికరమైన గ్రీక్‌ మిత్‌ను ఉదహరిస్తారు కలాస్సో: మిత్‌ మన మీద చెక్కతో చేసిన టారియన్‌ ఆర్టెమిస్‌ విగ్రహంలా పనిచేస్తుందంటారాయన. ఓరెస్టిస్‌ దాన్ని ఆలయంలో నుండి దొంగిలించి చేతుల్లో గట్టిగా పొదువు కుని పారిపోతున్నంతసేపూ అతడిలో ఒక విధమైన ఉన్మాదం జనిస్తుంది. చాలా దూరం పరిగెత్తి అలసిపోయిన ఓరెస్టిస్‌ ఒకరోజు హఠాత్తుగా ఆ విగ్రహాన్ని వదిలించుకోవాలని యూరోటస్‌ నదికి సమీపంలో ఒక చిట్టడివిలోని పొదల్లో దాచేసి వెళ్ళిపోతాడు. ఆ విగ్రహం ఏళ్ళ తరబడి ఎవరి కంటాబడకుండా శిథిలమైపోతుంది. ఒకరోజు ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఇద్దరు స్పార్టన్‌ యువకులు ఆస్ర్టాబాకస్‌, ఏలోపెకస్లు యాదృ చ్ఛికంగా ఆ విగ్రహాన్ని చూస్తారు. తీక్షణంగా తమ కేసి చూస్తున్న ఆ విగ్రహాన్ని చూసి తామేం చూస్తు న్నారో గ్రహించలేని స్థితిలో వాళ్ళిద్దరూ పిచ్చివాళ్ళవు తారు. సిములాక్రంకి ఉన్న శక్తి కూడా ఇటువంటిదే అంటారు కలాస్సో. అర్థం చేసుకోగలిగినవారిని మాత్రమే అది నయం చేస్తుంది. మిగతావారికి అది ఒక విరుగుడు కాని వ్యాధిలా సంక్రమిస్తుంది.

నాగిని కందాళ

nagini.kandala@gmail.com


Updated Date - 2021-08-02T10:02:04+05:30 IST