ప్రియాంక ఏ రాజ్యాంగ పదవిలో ఉన్నారు?: బీజేపీ

ABN , First Publish Date - 2022-01-09T21:23:46+05:30 IST

ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..

ప్రియాంక ఏ రాజ్యాంగ పదవిలో ఉన్నారు?: బీజేపీ

న్యూఢిల్లీ: ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని భద్రతపై ప్రియాంక గాంధీ వాద్రాకు సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ (చన్నీ) వివరించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ ఎలాంటి రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు? అని సంబిత్ పాత్ర ఒక ట్వీట్‌లో నిలదీశారు.


దీనికి ముందు, చరణ్‌జిత్ సిగ్ చన్నీ ఓ ట్వీట్ చేస్తూ, ప్రధాని భద్రతకు ఎలాంటి ముప్పూ పంజాబ్‌లో లేదన్నారు. ఆయన పూర్తిగా సురక్షితంగా ఉన్నారని, ఆయన సమీపానికి ఎవరూ వెళ్లలేదని చెప్పారు. ప్రియాంక గాంధీతో కూడా తాను మాట్లాడాడని, అసలు పంజాబ్‌లో ఏమి జరిగిందనే విషయం ఆమెకు వివరించానని ట్వీట్ చేశారు. ఆ వెంటనే చన్నీపై బీజేపీ విమర్శలకు దిగింది. ఈనెల 5న ఫిరోజ్‌పూర్‌లో నిరసనకారుల దిగ్బంధం కారణంగా ప్రధాని కొద్ది నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పైనే కాన్వాయ్‌లో ఉండిపోయారు. దీంతో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ర్యాలీకి ప్రధాని హాజరు కాకుండానే వెనుదిరిగారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం చోటుచేసుకోలేదని, అయినప్పటికీ దర్యాప్తునకు ఆదేశించామని పంజాబ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

Updated Date - 2022-01-09T21:23:46+05:30 IST