పిల్లలకు తప్పక నేర్పాల్సినవి...

ABN , First Publish Date - 2020-09-24T06:02:11+05:30 IST

మంచి అయినా, చెడు అయినా పిల్లలు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. అందుకే పేరెంట్స్‌ సరైన నడవడిక, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా అవసరం.

పిల్లలకు తప్పక నేర్పాల్సినవి...

మంచి అయినా, చెడు అయినా పిల్లలు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. అందుకే పేరెంట్స్‌ సరైన నడవడిక, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా అవసరం. పిల్లలకు చిన్నతనంలోనే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరచడం వల్ల పెద్దయ్యాక అవి వారి జీవితంలో భాగం అవుతాయి. పసితనంలోనే పిల్లలకు పెద్దలు విధిగా నేర్పించాల్సినవి ఏమంటే...


రోజులో మనం తీసుకొనే ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యమైనది. శక్తితో రోజును ప్రారంభించేందుకు ఇది తోడ్పడుతుంది. వారికి వేళకు భోజనం చేయడం అలవాటు చేయాలి. దాంతో వారి జీవగడియారం ప్రకారం నడుచుకోవడం వల్ల జబ్బుల బారిన పడకుండా ఉంటారు.


కరోనా భయంతో పిల్లలను తల్లితండ్రులు అడుగు కూడా బయటపెట్టనివ్వడం లేదు. అయితే వారికి శారీరక వ్యాయామం అవసరం. ఆరుబయట కనీసం గంట సమయం వారితో ఎక్సర్‌సైజ్‌ చేయించండి. చిన్నతనం నుంచే శారీరకంగా ఉత్సాహంగా ఉండడం వల్ల చదువులో, ఆటలో చక్కని ప్రతిభ కనబరుస్తారు. ఆటలు ఆడేటప్పుడు మెదడులో విడుదలయ్యే ఎండార్ఫిన్లు చదువు, పరీక్షల తాలూకూ ఒత్తిడి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. 


రాత్రిపూట నిద్రపోవడానికి ముందు పదినిమిషాలు ఏదైనా పుస్తకం పిల్లలచే చదివించాలి. వారికి నచ్చిన పుస్తకం చదివే స్వేచ్ఛ ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల వారి పదసంపద పెరుగుతుంది. అంతేకాదు పిల్లలు పుస్తక పఠనాన్ని ఒక పనిగా, బోర్‌గా కాకుండా ఫన్‌ యాక్టివిటీగా భావించేలా చూడాలి. దాంతో పెద్దయ్యాక వారి వ్యక్తిత్వం, నడవడికలో మార్పునకు చక్కని పునాది పడుతుంది.


కుటుంబంతో పిల్లలకు చక్కని అనుబంధం ఏర్పడేలా చేయడం ఎంతో ముఖ్యం. వారి మీద నమ్మకం ఉంచడం కూడా ముఖ్యమే. ఇంటిల్లిపాది కలిసి భోజనం చేసేటప్పుడు పిల్ల్లలు ఆరోజు ఎలా గడిపారు? సినిమాలు వంటి సరదా విషయాలు మొదలెట్టి, సాహిత్యం, రాజకీయాలు వంటి విషయాలు మాట్లాడుతూ డిన్నర్‌ చేయండి. వారికి నచ్చిన విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. పిల్లలు తమకు ఏ సందేహం, సమస్య వచ్చినా మీతో చర్చించే చొరవ, వాతావరణాన్ని కల్పించండి.


పిల్లలు రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోయేలా చూడాలి. నిద్ర చాలకపోవడం వల్ల వారిలో పెరుగుదల హార్మోన్లు తక్కువ విడుదలయ్యే అవకాశముంది. దాంతో వారి ఎముకల పెరుగుద ల, కణాలు, కణజాలాల వృద్థిపై ప్రభావం పడుతుంది. అంతేకాదు రోగనిరోధకశక్తి ప్రభావితం అవుతుంది. ఏకాగ్రత కూడా తగ్గే వీలుంది. పిల్లలకు రాత్రిళ్లు తొందరగా నిద్రపోవడం అలవాటు చేస్తే వారు పెద్దయ్యాక కూడా అదే అలవాటును కొనసాగిస్తారు.


పిల్లలకు చిన్న వయసు నుంచే వ్యక్తిగత పరిశుభ్రత గురించి నేర్పించాలి. రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవడం, భోజనానికి ముందూ, తరువాతా చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటివి పిల్లలను చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడకుండా చూస్తాయి. అలానే జుట్టు, దుస్తులు శుభ్రంగా ఉంచుకోవడం నేర్పించాలి. ఇవన్నీ చిన్నతనంలోనే అలవడితే  వారు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతారు.


భావోద్వేగాల పరంగా పిల్లలు అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారికి అన్నిరకాల భావోద్వేగాలను ఎప్పుడు, ఎలా వ్యక్తం చేయాలో చెప్పాలి. ఎందుకంటే వారికి తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది. కోపం, బాధ వంటి ఉద్వేగాలను ఎలా చూపించాలో వారికి చిన్నప్పుడే నేర్పాలి. మీతో వారు తమ మన సులోని బాధను పంచుకునేలా చూడాలి. దాంతో కౌమారంలోకి అడుగుపెట్టిన పిల్లలు తమ ఉద్వేగాలను అదుపులో పెట్టుకుంటారు.

Updated Date - 2020-09-24T06:02:11+05:30 IST