Hyderabadలో ఇంతలా ట్రాన్స్‌ఫార్మర్లు ఎందుకు పేలిపోతున్నాయ్.. జనాల్లో భయం.. భయం..!

ABN , First Publish Date - 2022-05-17T14:18:17+05:30 IST

గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలతోపాటు విద్యుత్‌ డిమాండ్‌ (Power Demand) రికార్డు స్థాయిలో...

Hyderabadలో ఇంతలా ట్రాన్స్‌ఫార్మర్లు ఎందుకు పేలిపోతున్నాయ్.. జనాల్లో భయం.. భయం..!

  • నిర్వహణలో లోపం.. పెరుగుతున్న లోడు
  • చిన్న మరమ్మతులకే గంటల కొద్దీ పవర్‌ కట్స్‌
  • పేలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలతోపాటు విద్యుత్‌ డిమాండ్‌ (Power Demand) రికార్డు స్థాయిలో పెరిగింది. లోడ్‌ అమాంతంగా పెరగడంతో డిస్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల(డీటీఆర్‌)పై  (Transformers)ఒత్తిడి పెరిగి పేలిపోతున్నాయి. జంపర్‌లు కట్‌ అవుతున్నాయి. మాదన్నపేట చావునీ(ఇమ్లీజాడ్‌)లో  ఆదివారం రాత్రి అధిక లోడ్‌తో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్‌లోని అయిల్‌ లీకై భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  


వేసవిలో అంతరాయాలు తలెత్తకుండా గ్రేటర్‌లోని 9 సర్కిళ్లలో 500కు పైగా అదనపు డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయినా, పలు ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు భారం పడి బ్రేక్‌డౌన్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. శ్రీ కృష్ణానగర్‌ ఏ బ్లాక్‌లో ప్రధానరహదారి పక్కన ఏర్పాటుచేసిన డీటీఆర్‌పై అదనపు లోడ్‌ పడి తరుచూ బ్రేక్‌డౌన్‌ సమస్యలతో విద్యుత్‌సరఫరా నిలిచిపోతుందని స్థానికులు చెబుతున్నారు. సౌత్‌ సర్కిల్‌, రాజేంద్రనగర్‌ సర్కిళ్లలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. చిన్నపాటి మరమ్మతులకు గంటన్నర పాటు విద్యుత్‌సరఫరా నిలిపివేస్తున్నారంటూ పలు ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


వెయ్యికిపైగా మెగావాట్లు ఎక్కువ..

పగటిపూట ఉష్ణోగ్రతలు (Temparature) రికార్డుస్థాయిలో నమోదవుతుండటంతో గ్రేటర్‌లో రోజుకు 65 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదవుతోంది. గత ఏడాది మే 16న గ్రేటర్‌జోన్‌లో 1,929 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదు అయింది. ఈ ఏడాది అదే తేదీన 3,039 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదయింది. గత ఏడాదితో పోల్చితే 1,110 మెగావాట్ల విద్యుత్‌ అధికంగా నమోదయింది. 


పరిశీలన ఏదీ..?

ప్రతి సెక్షన్‌లో విద్యుత్‌ అధికారులు ఎప్పటికప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించి సమస్యలను ముందే గుర్తించాలి. అయితే, ట్రాన్స్‌ఫార్మర్‌ పేలితే కానీ, వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించడం లేదనే విమర్శలున్నాయి. గ్రేటర్‌జోన్‌లో ఏటా 2వేలకు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు రిపేరింగ్‌ సెంటర్లకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. బస్తీలు, కాలనీల్లో డిమాండ్‌ పెరగడంతో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌శాఖ ముందుకొస్తున్నా కొంతమంది స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క 500 కేవీఓ ట్రాన్స్‌ఫార్మర్‌పై సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ కనెక్షన్లు 600 వరకు, త్రీ ఫేజ్‌ కనెక్షన్లు 100 వరకు ఇవ్వవచ్చని అధికారులు చెబుతున్నారు. అంతకుమించి కనెక్షన్లు ఇస్తే లోడ్‌ సమస్యలు తలెత్తేఅవకాశముంటుందని వివరిస్తున్నారు.


ఈదురుగాలులకు పవర్‌ కట్‌ (Power Cut)

వర్షం కురిసినా.. ఈదురుగాలు వీచినా విద్యుత్‌సరఫరాలో గంటల కొద్దీ అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం కురిసిన వర్షం ఎఫెక్ట్‌తో సోమవారం మాదాపూర్‌, గుట్టలబేగంపేటతోపాటు పలు ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. గాజులరామారం శ్రీకృష్ణానగర్‌లో విద్యుత్‌స్తంభం నేలకూలడంతో గంటల కొద్దీ సరఫరా నిలిచిపోయింది. సూరారం షాపూర్‌నగర్‌  ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రామాంతాపూర్‌లో సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు సరఫరాలో అంతరాయాలు నెలకొన్నాయి. 

Updated Date - 2022-05-17T14:18:17+05:30 IST