ఆంధ్రజ్యోతి(28-09-2021)
మెటబాలిజానికి మాస్టర్ గ్లాండ్గా పేరున్న థైరాయిడ్ గ్రంథి పనితీరులో హెచ్చుతగ్గులు పలు లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ సాధారణ స్వల్పకాలిక రుగ్మతలను మరిపించేలా ఉన్నా, ఒకే సమయంలో రెండు, మూడు లక్షణాలు విడవకుండా వేధిస్తూ ఉంటే, థైరాయిడ్ సమస్యగా అనుమానించి వైద్యులను కలవాలి.
వెంట్రుకలు, చర్మం: వెంట్రుకలు పొడి బారి, బిరుసుగా మారతాయి. తేలికగా ఊడిపోతూ ఉంటాయి. చర్మం మందంగా మారి, గరుకుగా తయారవుతుంది. జీవం కోల్పోతుంది.
జీర్ణసమస్యలు: మలబద్ధకం వేధిస్తుంది. డయేరియా, ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కూడా బాధిస్తాయి.
నెలసరి సమస్యలు: నెలసరి క్రమం తప్పుతుంది. నెలసరి సమయం పెరగడం, తరగడం, నెలసరి నొప్పి ఎక్కువ అవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
కుంగుబాటు: అకారణంగా మానసిక కుంగుబాటు ఆవరిస్తుంది. ప్యానిక్ ఎటాక్స్ కూడా వేధించే వీలుంది.
నిస్సత్తువ: నీరసం, నిస్సత్తువ వేధిస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి.
కండరాల నొప్పులు: కండరాలు, ఎముకల నొప్పులు బాధిస్తాయి.