పతనమైన వ్యక్తికి అధికారమిస్తేచేసేదేముంది

ABN , First Publish Date - 2022-08-20T08:09:46+05:30 IST

పతనమైన వ్యక్తికి అధికారమిస్తేచేసేదేముంది

పతనమైన వ్యక్తికి అధికారమిస్తేచేసేదేముంది

నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరం

పదవుల కోసం తల వంచేవాడిని కాదు 

ఎమ్మెల్యే భూమన సంచలన వ్యాఖ్యలు 

ఆయనను కొనియాడిన చీఫ్‌ జస్టిస్‌

భూమన పరివర్తన చెందిన మనిషి 

ఆయన సేవలను పార్టీలు సరిగ్గా ఉపయోగించుకోలేదు 

ఇంత మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు అభినందనలు: జస్టిస్‌ రమణ 


తిరుపతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమని, పతనం చెందిన వ్యక్తికి అధికారం వస్తే చేయగలిగిందేమీ లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చేసిన వ్యాఖ్యలు  కలకలం రేపుతున్నాయి. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆయన ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడారనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే భూమన పునర్ముద్రించిన మహాత్ముడి ఆత్మకథ ‘సత్యశోధన’ పుస్తక ప్రతులను శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కరుణాకర రెడ్డి మాట్లాడారు. ప్రకృతి వనరులకు మనం కాపలాదారులమే కానీ సొంతదార్లం కాదన్నారు. పదవుల కోసం తలవంచేవాడిని కాదని, పదవుల కంటే నైతికంగా ఉత్తమ జీవితాన్ని గడపడమే గొప్పగా భావించేవాడినన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి జైలు జీవితం గడిపిన సమయంలో ఎందరో మహామహులతో పరిచయం కావడం తనపై ఎంతో ప్రభావం చూపిందన్నారు.  గతంలో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడినై చేసిన పనులను, తర్వాత రాజకీయాల్లో చేయాల్సి వచ్చిన తప్పిదాలను ఇపుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఒక నిందితుడిగా చేతులు కట్టుకుని మరీ ఒప్పుకుంటున్నానన్నారు. 2006లో ఇద్దరు దుర్మార్గుల మాటలు విని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి తీరని అన్యాయం చేయడం ద్వారా అతిపెద్ద తప్పిదానికి పాల్పడ్డానన్నారు. సభ సాక్షిగా ఆయనకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. 


తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి: జస్టిస్‌ రమణ

జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం చాలా కష్టమని, చేసిన తప్పును ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలన్నారు. ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి తాను చేసిన తప్పులను ఒప్పుకోవడం చిన్న విషయం కాదన్నారు. దీంతో ఆయన్ను ఎలా చూడాలో, ఎలా గౌరవించాలో అర్థం కావడం లేదన్నారు. గొప్ప మనసుతో పరివర్తన చెందిన మనిషిగా ఆయన నిరూపించుకున్నారని ప్రశంసించారు. 2011లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా తనను కలసి తిరుపతిలో మద్యం షాపుల గురించి ఆవేదన వ్యక్తం చేశారని, వాటిని తొలగించాలంటూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కాంగ్రె్‌సలో పార్టీలో ఉంటూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా పిటిషన్‌ వేశారన్నారు. దురదృష్టవశాత్తూ గతంలోని పార్టీ కానీ, ఇపుడున్న పార్టీ గానీ ఆయన సేవల్ని సరిగా ఉపయోగించుకోలేదని సీజేఐ వ్యాఖ్యానించారు. తెలుగు భాష పట్ల అభిమానం, క్రమశిక్షణ కలిగిన కరుణాకర రెడ్డి మేధావి అని, ప్రజలతో మమేకం కావడంతో పాటు సమస్యల పట్ల అవగాహన కలిగిన వారని ప్రస్తుతించారు. పార్టీలకు అతీతంగా తన అభిప్రాయాలు చెప్పగలిగి, మంచి లక్షణాలున్న నాయకుడిని రాజకీయ పార్టీలు ఎందుకు ఉన్నత స్థానంలో ఉంచడం లేదో అర్థం కావడం లేదన్నారు. బహుశా ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా ఉండటం నచ్చడం లేదేమోనంటూ సీజేఐ వ్యాఖ్యానించారు. అలాంటి వారికి గుర్తింపు ఇస్తే తెలుగు ప్రజలకు మేలు చేసిన వారవుతారన్నారు. ఇంత మంచి నాయకుడిని తిరుపతి పట్టణ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ప్రజలకు అభినందనలు తెలపడంతో పాటు కరుణాకర రెడ్డికి అండగా నిలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉండి కూడా కరుణాకర రెడ్డి నిర్భయంగా మాట్లాడిన ఈ పరిణామం భవిష్యత్తులో ఎటువైపు దారితీస్తుందో అర్థం కావడం లేదని, వేచి చూడాల్సి ఉందన్నారు. రాజకీయాలంటే ఏవగించుకునే పరిస్థితి నుంచి మంచి వైపు మళ్లించాలని, ఆ ఉద్యమానికి కరుణాకర రెడ్డే నాయకత్వం వహించాలని జస్టిస్‌ రమణ అభిలషించారు. 

Updated Date - 2022-08-20T08:09:46+05:30 IST