మకాం వెనుక మతలబేంటి?

ABN , First Publish Date - 2021-09-09T07:39:15+05:30 IST

: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చి ఎనిమిది రోజులవుతోంది. ఈ ఎనిమిది రోజుల్లో ఆయన హడావుడిగా పాల్గొన్న కార్యక్రమాలేవీ పెద్దగా కనిపించలేదు. తిరిగి రాష్ట్రానికి ఎప్పుడు వెళతారన్నది ఎవరికీ తెలియడంలేదు....

మకాం వెనుక మతలబేంటి?

ఎనిమిది రోజులుగా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్‌

రోజుకో కార్యక్రమానికి మాత్రమే పరిమితం

ప్రధాని, ఇద్దరు మంత్రులనే కలిసిన ముఖ్యమంత్రి

మిగతా రోజుల్లో తుగ్లక్‌ రోడ్‌లోని తన నివాసంలోనే

రాష్ట్రానికి ఎప్పుడు తిరిగి వెళతారో తెలియని పరిస్థితి

ఢిల్లీ పెద్దలతో వరుస భేటీల వెనుక రాజకీయ కోణం!

బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థి కాదని చెప్పే ప్రయత్నం!!


న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చి ఎనిమిది రోజులవుతోంది. ఈ ఎనిమిది రోజుల్లో ఆయన హడావుడిగా పాల్గొన్న కార్యక్రమాలేవీ పెద్దగా కనిపించలేదు. తిరిగి రాష్ట్రానికి ఎప్పుడు వెళతారన్నది ఎవరికీ తెలియడంలేదు. ముఖ్యమంత్రి రేపు తిరిగి వెళతారా? అని బుధవారం రాత్రి కేసీఆర్‌ సన్నిహితుడైన ఓ నేతను అడగగా.. ‘‘మా ముఖ్యమంత్రి సంగతి తెలిసిందే కదా! మాకే తెలియదు మీకేం చెబుతాం?’’ అని  జవాబిచ్చారు. దీంతో దేశ రాజధానికిలో కేసీఆర్‌ సుదీర్ఘ మకాంపై రాజకీయంగా పలు ఊహాగానాలు తలెత్తుతున్నాయి. కేసీఆర్‌ ఈ నెల 1న ఢిల్లీలో దిగినప్పుడు.. రేపో, మాపో తిరిగి రాష్ట్రానికి వెళతారని ఆ పార్టీ నేతలు అన్నారు. కానీ, ఆయన మాత్రం ఢిల్లీ నుంచి అంత త్వరగా కదిలేందుకు ఇష్టపడడం లే దని తెలుస్తోంది. ‘‘నేను రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటాను.. మీరు వెళ్లిపోండి’’ అని చెప్పడంతో అనేక మంది అధికారులు తిరిగి వెళ్లిపోయారు. వాస్తవానికి కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చినప్పనుంచి రోజుకో కార్యక్రమానికి మాత్రమే పరిమితమయ్యారు.


ఈ నెల 2న ఢిల్లీలో టీ ఆర్‌ఎస్‌ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 3న ప్రధాని నరేంద్రమోదీని, 4న హోంమంత్రి అమిత్‌ షాను కలుసుకున్నారు. 5న మాత్రం ఎవరినీ కలుసుకోలేదు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక అధికారిక ప్రకటన జారీ చేసి మిన్నకున్నారు. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలుసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ..ఆయనఅపాయింట్‌మెంట్‌ లభించలేదు. ఇక ఈ నెల 6న కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి ని, జలశక్తి మంత్రిని కలుసుకున్నారు. 7న తెలంగాణ లోవరదల పరిస్థితి గురించి అధికారులతో ఫోన్‌ ద్వారా సమీక్షించారు.  


మీడియాకూ దూరంగా కేసీఆర్‌..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చేస్తున్నారో ఢిల్లీలో చెప్పేవారే కరువయ్యారు. అంతేకాదు.. ఈ ఎనిమిది రో జులూ ఆయన ఢిల్లీలో మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. అయితే జలశక్తి మంత్రితో మాట్లాడాల్సిన వి షయాల గురించి అధికారులతో దాదాపు ఒక పూటం తా చర్చించారని, ఆ తర్వాత జలశక్తి మంత్రిత్వ శాఖలోనే మూడు గంటలు గడిపారని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో తెలంగాణకు అధికార భవన్‌ ఎక్క డ ఉండాలో అన్న అంశంపై కూడా చాలాసేపు చర్చించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రెండు సందర్భా ల్లో తప్ప.. ఎనిమిది రోజుల్లో కేసీఆర్‌ ఏమి చేశారన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు.


అడిగిన వెంటనే మోదీ, షా అపాయింట్‌మెంట్‌.. 

కేసీఆర్‌ అడిగిన వెంటనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్లు ఇస్తుండడం, ఆయనను ఆదరభావంతో స్వీకరిస్తుండడంపై రాజకీ య వర్గాల్లో కీలక చర్చలు జరుగుతున్నాయి. ఓవైపు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఢిల్లీలో మోదీ, అమిత్‌ షా ల ను కలుసుకునేందుకు నానాకష్టాలు పడుతూ సుదీర్ఘ నిరీక్షణ చేయాల్సి వస్తోంది. కానీ, కేసీఆర్‌ పట్ల మాత్రం ఎంతో గౌరవంతో వ్యవహరించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే కేసిఆర్‌ ఢిల్లీ పెద్దలను కలుస్తున్నప్పటికీ.. అందులో రాజకీయ కోణంకూడా ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ తనకు రాజకీయ ప్రత్యర్థి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా.. కేంద్రంలో తాను రాజకీ యప్రత్యర్థి కాదనే సంకేతం పంపేందుకే ఆయన మోదీ, అమిత్‌ షాలను కలుసుకున్నట్లు అర్థమవుతోం ది. మరోవైపు జాతీయస్థాయిలో బీజేపీ బలహీన పడుతున్న రీత్యా కేసీఆర్‌ లాంటి తటస్థులను మోదీ వదులుకోబోరని, భావి అవసరాల రీత్యా స్నేహహస్తమే చాస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 


Updated Date - 2021-09-09T07:39:15+05:30 IST