Abn logo
Jul 23 2021 @ 23:30PM

వెతల అలలపై జీవన యానం!

- మత్స్యకారుల సమస్యలు తీరేదెన్నడో?

- దశాబ్దాలుగా తీరని కష్టాలు

- అమలు కాని ప్రభుత్వ హామీలు

(రణస్థలం)

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. మత్స్యకారుల తలరాతలు మాత్రం మారడం లేదు. దశాబ్దాలుగా వారి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. తుఫాన్లు, భారీ వరదల సమయంలో పాలకులు హామీలు గుప్పించడం... తర్వాత వాటిని విస్మరించడం షరా మాములైపోయింది. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటిస్తున్నా.. అవి వారి దరి చేరడం లేదు. సాంత్వన కలిగించే శాశ్వత ప్రాజెక్టులేవీ నిర్మించడం లేదు. దీంతో జిల్లా మత్స్యకారులకు ఉపాధి కరువై.. వలస బాట పడుతున్నారు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య జీవన పోరాటం సాగిస్తున్నారు. సుమారు ఏడాదిన్నర కిందట గుజరాత్‌ నుంచి చేపలవేటకు బయలుదేరిన జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారులు పాక్‌లో చిక్కుకున్నారు. రోజుల తరబడి నరకయాతన అనుభవించి...ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా చెన్నై నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతై.. ఎట్టకేలకు శుక్రవారం తీరానికి చేరుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఇటువంటి ఘటనలతో మత్స్యకార కుటుంబాల్లో ‘అల’జడి రేగుతూనే ఉంది. 

 

దశాబ్దాలుగా మత్స్యకారులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ హామీలు అమలు కాక, స్థానికంగా ఉపాధి లేక.. కష్టాల కడలిలో వెతల అలలపై మత్స్యకారుల జీవన యానం కొనసాగుతోంది. సుదీర్ఘ తీర ప్రాంతం జిల్లా సొంతం. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్‌, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో 193 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. లక్షకుపైగా మత్స్యకార జనాభా ఉండగా, 6,211 మంది వేటకు వెళ్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్లు కానీ, జెట్టీలు కానీ అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు సంప్రదాయ వేటకే పరిమితమయ్యారు. ఇప్పటికీ నాటు పడవలపై ప్రమాదకర స్థితిలో వేట సాగిస్తున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు గాక జిల్లా నుంచి వేలాదిమంది మత్స్యకారులు చెన్నై, గుజరాత్‌, ముంబాయి, కోల్‌కతా, పారాదీప్‌ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కాంట్రాక్టర్ల వద్ద పనికి కుదురుతున్నారు. వేటలో భాగంగా విదేశీ జలాల్లోకి ప్రవేశించి అక్కడి కోస్టుగార్డులకు చిక్కుతున్నారు. ఖైదీలుగా మారుతున్నారు. అక్కడ పడరాని కష్టాలు పడుతున్నారు. ఇటువంటి ఘటనలు ఎన్నో గతంలో జరిగాయి. ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారు ఉన్నారు. అటువంటి విషాద సమయాల్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా హామీలు గుప్పిస్తున్నారు. తరువాత వాటిని మరిచిపోతున్నారు. 


పట్టాలెక్కని ప్రాజెక్టులు 

మత్స్యకారులకు ఉపాధి కల్పించే ప్రాజెక్టులన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన భావనపాడు హార్బర్‌.. ఇప్పటికీ పట్టాలెక్కలేదు. గతంలో టెండర్ల ప్రక్రియ పూర్తయినా.. వైసీపీ అధికారంలోకి వచ్చిత తర్వాత ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవల కదలిక వచ్చినా.. ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. అలాగే గత ఏడాది వైసీపీ ప్రభుత్వం వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఇవి ఇంకా భూ సేకరణ దశలో ఉన్నాయి.  ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకొంది. థర్మల్‌, అణు ప్రాజెక్టుల విషయంలో భూ సేకరణ త్వరితగతిన చేసి.. మత్స్యకారులకు ప్రయోజనకరమైన ప్రాజెక్టుల విషయంలో మాత్రం ప్రభుత్వం తాత్సారం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  


కంటితుడుపు చర్యలే

ప్రభుత్వ రాయితీలు, పథకాల విషయంలో మత్స్యకారులు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నారు. వేట నిషేధ సమయంలో అందించే మత్స్యకార భరోసా ఇప్పటికీ చాలామంది అర్హులకు అందలేదు. సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లో మత్స్యకార భరోసా పథకం పక్కదారి పట్టింది. రాజకీయ ఒత్తిళ్లతో చాలామంది అనర్హులు దక్కించుకున్నారు. బినామీల పేరుతో  కొంతమంది నాయకులు లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదులు వచ్చినా ఎటువంటి దర్యాప్తులు లేవు. వేటలో భాగంగా మత్స్యకారులు చిన్న వయసులోనే కంటి సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇటువంటి వారిని గుర్తించి పింఛన్లు అందిస్తామన్న ప్రభుత్వ హామీ బుట్టదాఖలైంది. మత్స్యకార గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కూడా సాగని దుస్థితి నెలకొంది. స్థానికంగా ప్రత్యామ్నాయ ఉపాధి లేక కొంతమంది రహదారుల పక్కన కళ్లద్దాలు, బొమ్మలు విక్రయిస్తూ.. కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం పక్క గ్రామాలు, మైదాన ప్రాంతాల్లోనైనా తమకు ఉపాధి పనులు కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. భావనపాడు, ఫిషింగ్‌ హార్బర్‌ వంటి ప్రాజెక్టులు త్వరగా నిర్మిస్తే తమకు స్థానికంగానే ఉపాధి దొరుకుతుందని ఎదురుచూస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


 మత్స్యకారుల సంక్షేమానికి కృషి

మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వేట నిషేధ సమయంలో అర్హులందరికీ మత్స్యకార భరోసా అందించింది. జిల్లాలో భావనపాడు, బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ల నిర్మాణం చేపడుతున్నాం. మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణ పనులు చేపడుతున్నాం.  

 - పీవీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ జేడీ, శ్రీకాకుళం


మోసపూరిత ప్రభుత్వం

వైసీపీ.. మోసపూరిత ప్రభుత్వం. మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మత్స్యకారుల సంక్షేమం కోసం కనీసం పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉపాధి అవకశాలు లేక బతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళిన మత్స్యకారులు అక్కడే మట్టిలో కలిసిపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఒక్కటీ వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేదు.

- దుమ్ము అశోక్‌, మత్స్యకార నాయకుడు, జీరుపాలెం 


ఇబ్బందులు పడుతున్నాం

స్థానికంగా వేట గిట్టుబాటు కాకపోవడంతో  ఇబ్బందులు పడుతున్నాం.  45 ఏళ్లు దాటిన మత్స్యకారులకు పింఛను అందజేస్తామని ప్రకటించారు. కానీ, అమలు చేయడం లేదు. ఆయిల్‌ సబ్సిడీ లేదు. జీరుపాలెంలో 150 మందికి ‘మత్స్యకార భరోసా’ నిధులు  నేటికీ పడలేదు. పెళ్లికానుక ఊసేలేదు.  ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాలో హార్బర్లు, జెట్టీల నిర్మాణం పూర్తిచేయాలి.

- అంబటి చిరంజీవి, జీరుపాలెం