పోషణ్‌ అభియాన్‌ నిధులు ఏవీ?

ABN , First Publish Date - 2022-05-22T05:20:02+05:30 IST

సామాజిక వేడుకలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించకపోవడంతో చేతిచమురు వదులుతోందని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకునేలా అవగాహన కల్పించడానికి పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

పోషణ్‌ అభియాన్‌ నిధులు ఏవీ?
అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం

అంగన్‌వాడీ కేంద్రాల్లో భారంగా వేడుకల నిర్వహణ
జిల్లాలో రూ.1.02 కోట్ల బకాయిలు
(ఇచ్ఛాపురం రూరల్‌)

సామాజిక వేడుకలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించకపోవడంతో చేతిచమురు వదులుతోందని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకునేలా అవగాహన కల్పించడానికి పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో నెలలో ఒకటి, మూడో బుధవారం వీటిని చేపడుతున్నారు. గర్భిణులకు ఆరోగ్య వేడుకలు, అన్నప్రాసనం, ప్రీస్కూల్‌ పిల్లల సంసిద్ధత, సామాజిక ఆరోగ్యం, సుపోషణ వేడుక కార్యక్రమాలను చేస్తున్నారు. గతంలో కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలల పాటు సామూహిక కార్యక్రమాలు నిర్వహించలేదు. గత ఏడాది సెప్టెంబరు నుంచి సామూహిక వేడుకలు తిరిగి ప్రారంభమయ్యాయి. జిల్లాలో నవంబరు నుంచి బకాయిలు చెల్లించలేదని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. జిల్లాలో 15 ప్రాజెక్టుల పరిధిలో 3,432 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు 75,425 మంది ఉన్నారు. వీరందరికీ రోజువారీ పోషకాహారంతో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చిక్కీలు, కోడిగుడ్లు, బాలామృతం, పీచు పదార్థాలు కలిగిన కూరలు ఆహారంలో తీసుకోవాలని చైతన్యపరుస్తున్నారు. తద్వారా మాతా, శిశువులు ఆరోగ్యంగా ఉండి సుఖప్రసవాలు జరుగుతాయని ప్రభుత్వం ఉద్దేశం. కార్యక్రమాలు అమలు చేస్తున్నా నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. వేతనాలు కూడా రెండు నెలలుగా అందకపోవడంతో అప్పు చేసి కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోందని చెబుతున్నారు.

రూ.1.02 కోట్ల బకాయిలు
ఈ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో పాయసం వండి, నోరు తీపి చేయడంతోపాటు పోషక విలువలు కలిగిన పండ్లు, పోషకాహార సామగ్రి కొనుగోలు చేసి అందజేస్తున్నారు. సీమంతంతో పాటు పోషణ కార్యక్రమాల కోసం ఒక్కో కేంద్రానికి రూ.250 చొప్పున నెలలో రెండు కార్యక్రమాలకు రూ.500 చొప్పున అందజేయాలి. ఈ లెక్కన జిల్లాలో ఆరు నెలలకు రూ.1.02 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఈ నిధులు నేరుగా ఆయా కేంద్రాల కార్యకర్తల ఖాతాల్లో జమ చేయాలి. నిధులు విడుదల చేయకపోవడంతో చేతి నుంచి చెల్లించాల్సి వస్తోందని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో జమ చేస్తాం
పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు అంగన్‌వాడీ కేంద్రాల నుంచి సీడీపీవోల ద్వారా సేకరించి వాటిని సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. బడ్జెట్‌ ప్రభుత్వం నుంచి రాలేదు. వచ్చిన వెంటనే వారి ఖాతాల్లో జమచేస్తాం.
- అనంతలక్ష్మీ, ఐసీడీఎస్‌ పీడీ, శ్రీకాకుళం

Updated Date - 2022-05-22T05:20:02+05:30 IST