చెరకు బకాయిలపై ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2021-08-06T05:38:46+05:30 IST

జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీలకు గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు రూ.119 కోట్లు చెల్లించాల్సి వుందని, చక్కెర కర్మాగారాల పరిధిలోని చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట, తుని ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

చెరకు బకాయిలపై ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?
చెరకు రైతులకు బకాయిలు చెల్లించాలని కోరుతూ చోడవరంలో ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

సీఎంని కలిసి బకాయిల గురించి మాట్లాడే ధైర్యం వీళ్లకి లేదు

మాజీ మంత్రి అయ్యన్న ధ్వజం

రైతులు, కార్మికులకు రూ.119 కోట్లు చెల్లించాలి

నెలల తరబడి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారు

షుగర్‌ ఫ్యాక్టరీలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.... అధికారంలోకి వచ్చాక మరోమాట

తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలను మూసేయాలని మంత్రి బొత్స కమిటీ నివేదిక

ఇదే జరిగితే రైతులు, కార్మికులు ఏమైపోవాలని ఆవేదన

చెరకు బకాయిలపై గోవాడ ఫ్యాక్టరీ వద్ద టీడీపీ ఆందోళన


చోడవరం, ఆగస్టు 5: జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీలకు గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు,   ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు రూ.119 కోట్లు చెల్లించాల్సి వుందని, చక్కెర కర్మాగారాల పరిధిలోని చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట, తుని ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. చెరకు బకాయిల కోసం టీడీపీ ఆధ్వర్యంలో గురువారం రైతులు, టీడీపీ నాయకులు గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెరకు డబ్బులు చేతికి అందక రైతులు, నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. చెరకు బకాయిల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు వుండడం రైతుల దౌర్భాగ్యమన్నారు. సీఎంని కలిసి బకాయిల గురించి అడిగే ధైర్యం వీరికి లేదని ఎద్దేవా చేశారు. 

షుగర్‌ ఫ్యాక్టరీలపై మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలను మూసివేయాలని సూచించిందని, దీనిని అమలు చేస్తే వేలాది మంది రైతులు, కార్మికుల పరిస్థితి  ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము అఽధికారంలోకి వస్తే సహకార చక్కెర ఫ్యాక్టరీలను అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి... సీఎం అయిన తరువాత షుగర్‌ ఫ్యాక్టరీలను ఏకంగా మూతపడేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 


భారీగా తరలివచ్చిన రైతులు, టీడీపీ నాయకులు

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద టీడీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు చెందిన చెరకు రైతులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తొలుత చెరకు యార్డు నుంచి ర్యాలీగా బయలుదేరి ఫ్యాక్టరీ ఆవరణలోకి చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకుని, చెరకు బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఫ్యాక్టరీ ఎండీ వి.సన్యాసినాయుడుకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, గవిరెడ్డి రామానాయుడు, గోవాడ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ మల్లునాయుడు, టీడీపీ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్‌, చోడవరం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, పార్టీ నాయకులు పీవీజీ కుమార్‌, సత్యవతి, కనిశెట్టి మత్స్యరాజు, మజ్జి గౌరీశంకర్‌, పోతల రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-06T05:38:46+05:30 IST