ఉచిత చేప పిల్లలేవి..?

ABN , First Publish Date - 2022-07-04T05:12:25+05:30 IST

మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.

ఉచిత చేప పిల్లలేవి..?

- వర్షాకాలం ప్రారంభమైనా ముందుకు సాగని ప్రక్రియ

- పూర్తికాని టెండర్లు.. గత ఏడాది అరకొరగా పంపిణీ

- ఆందోళన చెందుతున్న మత్స్యకారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాదే అరకొరగా చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారైనా పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తుందా, లేదా అనే అనుమానాలను మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, పార్వతీ బ్యారేజీ, 1,013 మంది చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిపై 133 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చెందిన 9,003 కుటుంబాలు, 38 మహిళా సొసైటీలపై 1,279 కుటుంబాలు, 7 మత్స్య ప్రాథమిక మార్కెటిగ్‌ సంఘాల ద్వారా 360 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో చేపలు పెంచుకుని జీవించే వారికి ప్రభుత్వం లైసెన్సులను జారీ చేస్తుంది. చెరువులు, కుంటలను లీజుకు పొందడం ద్వారా చేపలు పెంచుకునే జీవించే వారికి చేప పిల్లలను ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. ప్రతి ఏటా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని జులై మాసంలో చేపడుతుంది. ఇందుకోసం మే నెల నుంచే ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంటుంది. చేప పిల్లలను సరఫరా చేసే వారి నుంచి టెండర్లను ఆహ్వానిస్తుంది. టెండర్లు దాఖలు కాగానే వాటిని ఫైనల్‌ చేసి చేప పిల్లలను సరఫరా చేస్తూ ఉంటారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పెంచేందుకు 80 నుంచి 100 ఎంఎం సైజు గల చేప పిల్లలను సరఫరా చేస్తారు. చెరువులు, కుంటల్లో పెంచేందుకు 35 నుంచి 40 ఎంఎం సైజు గల చేప పిల్లలను సరఫరా చేస్తారు. 

టెండర్లు ఆలస్యం..

జిల్లాలో గల నీటి వనరుల్లో చేప పిల్లలను పెంచేందుకు కోటి 59 లక్షల చేప పిల్లలు, 26 లక్షల రొయ్య పిల్లలు అవసరమని మత్స్య శాఖాధికారులు పేర్కొన్నారు. ఈమేరకు సదరు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గత ఏడాది కూడా ప్రతిపాదనలు పంపించినప్పటికీ, ఆ మేరకు చేపపిల్లలను పంపిణీ చేయలేదు. చేప పిల్లల సరఫరా కోసం ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో అవకతవకలు చోటు చేసుకోవడంతో వాటిని రద్దు చేశారు. చేప పిల్లలు పెంచే ఫామ్‌లు లేని వాళ్లు కూడా టెండర్లు దాఖలు చేశారు. అలాంటి వాళ్లు టెండర్లు దక్కించుకుని నాణ్యత లేని, తక్కువ సైజుగల చేపపిల్లలను సరఫరా చేస్తున్నారని, వీటివల్ల ప్రభుత్వ ప్రయోజనం నెరవేరడం లేదని, చెరువులు, కుంటల్లో పోసిన తర్వాత తొందరగానే మృతిచెందుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలస్యంగా ప్రభుత్వమే ఫెడరేషన్‌ ద్వారా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో కేవలం 35లక్షల చేప పిల్లలను మాత్రమే మత్స్యకారులకు పంపిణీ చేసింది. అప్పటికే మత్స్యకారులు బయట ఫామ్‌ల్లో పెంచిన చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో పోశారు. దీంతో చేపలు పెరగడం ఆలస్యమయ్యింది. ఆలస్యంగా చేపలను చెరువుల్లో పోయడం వల్ల వేసవి రావడంతోనే కొన్ని చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటిపోవడంతో చిన్నసైజు చేపలను పట్టి విక్రయించుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాదికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుందా, లేదా అనే డైలామా నెలకొన్నది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లుగా కనబడడం లేదు. వాస్తవానికి చేప పిల్లల సరఫరా టెండర్లు జూన్‌ నెలాఖరులోపే పూర్తికావాల్సి ఉంది. అయినా ఆలస్యం అవుతున్నది. అసలు చేపలను పంపిణీ చేస్తారా, చేయరా అనే డైలామాలో మత్స్యకారులు ఉన్నారు. ఈ విషయమై జిల్లా మత్స్య అభివృద్ధి శాఖాధికారి భాస్కర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా జిల్లాలో చేపల సరఫరాకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిందని 8 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారని, అందులో ఇద్దరికి అర్హత లేదని కొట్టివేశారని, ఇంకా ఫైనల్‌ కాలేదని చెప్పారు. 

Updated Date - 2022-07-04T05:12:25+05:30 IST