న్యాయవ్యవస్థ స్వతంత్రత ఏమయ్యేట్టు?

ABN , First Publish Date - 2020-10-29T06:17:43+05:30 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ. బాబ్డేకు ఫిర్యాదు చేశారు...

న్యాయవ్యవస్థ స్వతంత్రత ఏమయ్యేట్టు?

హైకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రప్రభుత్వానికి  అనుకూలంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుంది. అంతేగానీ భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలకు అనుగుణంగా ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడేవారుగా ఉండాలని ఆయన భావించడం లేదు. అనుకూల తీర్పులు ఇవ్వని న్యాయమూర్తులపై వ్యక్తిగతంగా ఫిర్యాదు చేస్తూ పోతే న్యాయమూర్తుల స్థానాల్లో ఎవ్వరూ మిగలరు. చివరకు సామాన్యుడు న్యాయం పొందే పరిస్థితి లేకుండా పోతుంది. 


సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ. బాబ్డేకు ఫిర్యాదు చేశారు. జస్టిస్ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకూడదనే లక్ష్యంతో ఆయనపై ఆరోపణలు చేసినట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు కొంతమంది తనకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని, వారిపై జస్టిస్‌ రమణ ఒత్తిడి కారణంగానే ఆ విధంగా జరుగుతున్నదని కూడా ముఖ్యమంత్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జస్టిస్ రమణ సన్నిహితుడయినందునే తీర్పులు తనకు వ్యతిరేకంగా వస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. నిజానికి ప్రతి న్యాయమూర్తీ ఏదో ఒక రాజకీయపార్టీ అధికారంలో ఉండగానే ఆ ప్రభుత్వ మద్దతుతోనే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడవుతారు. ఇది సర్వసాధారణ విషయం. అయితే ఇక్కడ కొత్త విషయం ఏమంటే రాష్ట్రంలోని నలుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ వల్ల ప్రభావితులై తీర్పులు ఇస్తున్నారనేది! రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారనేది ముఖ్యమంత్రి వాదన. ఈ వాదనే సరియైనదని అనుకుంటే ఆ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులు దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ నెగ్గుతున్నాయి. సుప్రీంకోర్టు వాటిని సమర్థిస్తున్నది. న్యాయమూర్తులు రాజ్యాంగపరమైన అంశాలు మాత్రమే చూస్తారు తప్ప మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోరు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగపరంగా సమర్థనీయమా? కాదా? ఆ ప్రభుత్వ ఉత్తర్వులు అమలులోనికి వస్తే ప్రజలు ఎలా స్వీకరిస్తారు? ప్రజలు ఎంతమేరకు నష్టపోతారనే విషయాలు ఆలోచించి తీర్పులు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలు మార్చుకోకుండా, కోర్టులతో వైరం పెంచుకోవడం సరికాదు. 


తెలుగుదేశం ప్రభుత్వహయాంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌- జనరల్‌ (ఎజి)గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌తో కలిసి ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యులు రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని ముఖ్యమంత్రి తన ఫిర్యాదులో ఆరోపించారు. అమరావతి భూకుంభకోణంగా ప్రభుత్వం పేర్కొంటున్న వ్యవహారంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ విచారణను, సిట్‌ దర్యాప్తును నిలిపివేస్తూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వి. సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులను తన వాదనకు మద్దతుగా ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన వార్తలు ప్రసారమాధ్యమాలలో రాకుండా గ్యాగ్‌ ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. అసలు, రాష్ట్రప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌.వి. రమణపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం సమంజసమేనా అన్నది రాజ్యాంగపరమైన మీమాంస. దీనిని రాజ్యాంగ పరిధిలోనే పరిష్కరించుకోవాలి కానీ, ఫిర్యాదును బహిరంగంగా పత్రికలు విడుదల చేయడంతోపాటు ప్రభుత్వ ప్రధానసలహాదారు అజయ్‌ కల్లం ద్వారా మీడియా సమావేశం పెట్టి న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేయడం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది, చర్చనీయాంశమయింది. ఈ చర్చ న్యాయవ్యవస్థపైనా, న్యాయస్థానాలపైన ప్రజలలో అనుమానాలకు, అవహేళనకు దారితీసి సమస్త రాజ్యాంగ వ్యవస్థలపైన నమ్మకం పోయే పరిస్థితిని కల్పించింది. ఇలాంటి వాటి వల్ల న్యాయమూర్తులపై ప్రజలలో గౌరవం పోతుంది. కోర్టులకు వెళితే న్యాయం జరుగుతుందనే గ్యారంటీ ఏమీలేదు అనే భావన ఏర్పడుతుంది. భారత న్యాయవ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. 


తనపై ఉన్న పలు కేసుల విచారణ సత్వరమే ప్రారంభమయ్యే పరిస్థితి ఉండడంతో, కిందిస్థాయి జడ్జీలు మొదలుకొని, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైన ఫిర్యాదు చేయడం తాను ఎదుర్కోబోతున్న నేరవిచారణను ప్రభావితం చేస్తుందని ముఖ్యమంత్రి ప్రాథమికంగా ఆలోచించి ఉండవలసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనే ఫిర్యాదు చేసినవాడు మన మీద కూడా చేయవచ్చనే భయంతో తన కేసులను విచారిస్తున్న న్యాయమూర్తులు అనుకోవాలని జగన్‌ భావిస్తూ ఉండవచ్చు. ఇది ఎంత మాత్రమూ సరికాదు. పైగా న్యాయమూర్తులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అంతేకాకుండా న్యాయమూర్తులు అందరూ ఏదో ఒక విధమైన ప్రలోభాలకు లొంగుతారనుకోవడం అవివేకమే  అవుతుంది తప్ప మరొకటి కాదు. అసలు న్యాయవ్యవస్థను లొంగదీసుకోవాలని ప్రయత్నించడమే పెద్ద తప్పు. ఇది ‘కోర్టు ధిక్కరణ’ కిందకు వస్తుందా లేదా? అనే మీమాంసను భారత ప్రధాన న్యాయమూర్తి ఇంకా తేల్చలేదు. దీనిపై త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. జగన్మోహన్‌రెడ్డి చేసిన ఫిర్యాదు ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత’ను దెబ్బతీసే విధంగా ఉందనడంలో ఏమాత్రమూ సందేహం లేదు.


ఒక ముఖ్యమంత్రికి ఏమైనా ఇబ్బందులు ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ప్రధాన న్యాయమూర్తికీ, ప్రధాన న్యాయమూర్తిపై రాష్ట్రపతికీ ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి బెదిరించాలనే దృష్టితో చేసిన ఫిర్యాదుకు, ఆరోపణలకు సరైన ఆధారాలు ఏమీలేవు. ఆయన చూపించినవన్నీ సర్వసాధారణమైనవే, అందరికీ బహిరంగంగా అందుబాటులో ఉండేవే. ఈ సందర్భంగా ‘గౌరవ న్యాయమూర్తుల పదవిలో కూర్చున్నవారు లొంగిపోయి ప్రభుత్వంలోని రాజకీయ నాయకులకు సేవకులుగా వ్యవహరిస్తే దెబ్బతినేది రాజ్యాంగ ఆధిపత్యమే. అప్పుడు అన్ని వ్యవస్థలూ చెలరేగి రాజ్యాంగ అరాచకం, న్యాయపరమైన గందరగోళానికి దారితీసే పరిస్థితికి కారణభూతమవుతుందని’ మహోన్నత న్యాయమూర్తి జస్టిస్ హెచ్. ఆర్. ఖన్నా పేర్కొన్న మాటలను మనం తప్పక గుర్తు చేసుకోవాలి. అటువంటి పరిస్థితి రాకుండా న్యాయవ్యవస్థ తన్ను తాను రక్షించుకుంటూ ప్రజలను రక్షించే బాధ్యతను నెరవేర్చుతుంది. అంతేకాకుండా భారత న్యాయవ్యవస్థ చాలా బలమైనది. భారత రాజ్యాంగం విశిష్టమైనది. రాజ్యాంగ నిర్దేశాల ప్రకారమే ప్రతి వ్యవస్థా పని చేస్తుంది. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ‘చట్టబద్ధత’ లేని కార్యనిర్వాహక ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు చట్టాన్ని అనుసరించి కొట్టివేయడంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు రాగద్వేషాలకు అతీతంగా, న్యాయసూత్రాలకు అనుగుణంగా పనిచేస్తూ న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుతున్నారు. అయితే ప్రతి తీర్పూ తనకు అనుకూలంగా రావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవడం సమంజసం కాదు. వ్యతిరేకంగా వచ్చిన తీర్పులపై ఎలాగూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చును. కానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులను ఏదో ఒక విధంగా లొంగదీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్లు అర్థమవుతున్నది. అంతేకాకుండా ఆయన, రేపటిరోజున తన ప్రభుత్వానికి అవకాశం వస్తే తమకు అనుకూలమైన న్యాయవాదులను న్యాయమూర్తులుగా పంపే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది. హైకోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండాలని ఆయన భావిస్తున్నట్లుంది. అంతేగానీ భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు లేదా ప్రవేశికకు అనుగుణంగా ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడేవారుగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భావించడం లేదు. ఇది శోచనీయం, రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం. ఏ కేసులోనైనా ఒక్కరి వైపే కోర్టు న్యాయం చెబుతుంది లేదా ఇరువురూ కలిసి సమంగా పరిష్కరించుకోండని సలహా ఇస్తుంది కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయమూర్తులపై వ్యక్తిగతంగా ఫిర్యాదు చేస్తూ పోతే ఆ స్థానాల్లో ఎవ్వరూ మిగలరు. చివరకు సామాన్యునికి న్యాయం పొందడం దుర్లభం అవుతుంది. న్యాయం పొందే పరిస్థితి లేకుండా పోతుంది. జగన్ ప్రభుత్వ చర్యలు ప్రజలను అరాచకం వైపు నడిపించే దిశగా ఉన్నాయి. వాటిలో సమదృష్టి, సమతుల్యత లేవు. అవి ఎంత మాత్రం సమన్యాయానికి దోహదం చేయవు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు జస్టిస్‌ ఎన్‌.వి. రమణ భారత ప్రధాన న్యాయమూర్తి కాకుండా నిరోధించలేవు. అవి కేవలం ఆస్తులకు సంబంధించినవి మాత్రమే. ఆ ఆస్తులు ఏరూపకంగా వారికి సమకూరాయో నిరూపించడం కష్టసాధ్యం. అంతేకాకుండా ఆ ఆరోపణల విషయాన్ని ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ చూసుకుంటుంది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ‘భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రత’కు ఎదురవుతున్న ముప్పు గురించి. ఆ స్వతంత్రత భవిష్యత్తులో ఏమైపోతుందన్నది చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి ఆరోపణలు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న విలువను కించపరిచేవిధంగా ఉన్నాయి. అంతే కాదు, అవి సుప్రీంకోర్టు న్యాయపాలనా అధికారాలను తక్కువ చేసే విధంగా ఉన్నాయి. వాటిని బలహీనపరిచే కుట్రగా కూడా భావించవచ్చు. భారత రాజ్యాంగం దేశ పౌరులకు ప్రసాదించిన హక్కులను సజీవంగా ఉంచాలంటే న్యాయవ్యవస్థకు సంపూర్ణ స్వతంత్రత ఉండాలి. ఉన్నత న్యాయస్థానాలు స్వతంత్రతను కోల్పోతే, ప్రాథమిక హక్కులను ప్రసాదించే రాజ్యాంగ నిబంధనలను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రద్దు చేసే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో అది నియంతృత్వానికి దారితీస్తుంది. 

జాన్‌ బర్నబాస్‌ చిమ్మె


Updated Date - 2020-10-29T06:17:43+05:30 IST