Abn logo
Sep 26 2021 @ 03:11AM

హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌పై ఏంచేద్దాం?

ఏఎంఆర్‌డీఏలో అంతర్మథనం

(విజయవాడ, ఆంధ్రజ్యోతి): హ్యాపీనెస్ట్‌ రివర్స్‌ టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువవటంతో ప్రాజెక్టును ఏం చేయాలన్న విషయమై అమరావతి మహానగర ప్రాంత ప్రాధికార సంస్థ (ఏఎంఆర్‌డీఏ) సందిగ్ధంలో పడింది. టెండర్లలో ఒక్క బిడ్‌ కూడా పడకపోవటంతో ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం దీనికి సంబంధించి ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌కు నిర్ణయం తెలపాల్సిందిగా ఫైల్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫైల్‌ కమిషనర్‌ దగ్గర ఉంది. ఆమె దీనిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. మునిసిపల్‌ శాఖ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే  హ్యాపీనెస్ట్‌ లబ్ధిదారులు ఏఎంఆర్‌డీఏను డిఫాల్టర్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ.. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) గడపతొక్కటం, హైకోర్టుకు కూడా వె ళ్లేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఏఎంఆర్‌డీఏ అధికారులలో ఆందోళన నెలకొంది. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టును 2021 డిసెంబరు నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉంది.


ఇప్పటివరకు పనులే మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో రెరా ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బాధితులు కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉన్నందున రెరాపైనా ఒత్తిడి ఉంటుంది. రెరా కనుక ఏఎంఆర్‌డీఏను డిఫాల్టర్‌గా ప్రకటిస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టే పరిస్థితి ఉండదు. దీంతో ఏం చేయాలన్నదానిపై ఏఎంఆర్‌డీఏ అధికారులు అంతర్మథనం చెందుతున్నారు. ప్రాజెక్టు పూర్తి చేయటానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు మరోసారి రివర్స్‌ టెండర్లు పిలిస్తే ఎలా ఉంటుందోనని యోచిస్తున్నట్టు సమాచారం. రీ టెండర్లు పిలుస్తారా? ఇంతటితో ఆపేస్తారా? అన్నది వేచి చూడాలి.