చక్కెర కార్మికులకు చేదేనా..!

ABN , First Publish Date - 2022-05-25T05:59:52+05:30 IST

కష్టపడి కర్మాగారాన్ని దశాబ్దాల పాటు కంటికి రెప్పలా కాపాడుకొని తమ జీవితాల్లో తీపి నిండు తుందనుకున్న కార్మికులకు చేదుమాత్రమే మిగులుతోంది. పదేళ్లుగా పేరుకుపోయిన జీతభత్యాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించినా అధికారులు సరిగా స్పందిం చడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందరో రైతులకు దన్నుగా ఉన్న చెన్నూరు చక్కెర కర్మాగారం 2009లో మూతపడింది. బకాయిలు సరిగా రాకపోయినా కార్మికులు ఈ ఏడాది ఏప్రిల్‌ 29 వరకు చక్కెర కర్మాగారానికి కాపలా కాశారు. 2009లో చివరి క్రషింగ్‌ జరిగింది. కర్మాగారంలో అప్పటివరకు పనిచేసిన కార్మికులకు నిలువ ఉన్న చక్కెర బస్తాలు, మొలాసీస్‌ అమ్మి 2012 ఫిబ్రవరి వరకు జీతాలు ఇచ్చారు.

చక్కెర కార్మికులకు చేదేనా..!
మూతబడిన చెన్నూరు చక్కెర కర్మాగారం

రూ.13 కోట్ల బకాయిల కోసం పదేళ్లుగా ఎదురుచూపు

కోర్టు ఆదేశంతో అధికారుల్లో చలనం

చెన్నూరు, మే 24: కష్టపడి కర్మాగారాన్ని దశాబ్దాల పాటు కంటికి రెప్పలా కాపాడుకొని తమ జీవితాల్లో తీపి నిండు తుందనుకున్న కార్మికులకు చేదుమాత్రమే మిగులుతోంది. పదేళ్లుగా పేరుకుపోయిన జీతభత్యాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించినా అధికారులు సరిగా స్పందిం చడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎందరో రైతులకు దన్నుగా ఉన్న చెన్నూరు చక్కెర కర్మాగారం 2009లో మూతపడింది. బకాయిలు సరిగా రాకపోయినా కార్మికులు ఈ ఏడాది ఏప్రిల్‌ 29 వరకు చక్కెర కర్మాగారానికి కాపలా కాశారు. 2009లో చివరి క్రషింగ్‌ జరిగింది. కర్మాగారంలో అప్పటివరకు పనిచేసిన కార్మికులకు నిలువ ఉన్న చక్కెర బస్తాలు, మొలాసీస్‌ అమ్మి 2012 ఫిబ్రవరి వరకు జీతాలు ఇచ్చారు. ఆ తరువాత పదేళ్ల పాటు (2022 వరకు) జీతాల ఊసేలేదు. సీజనల్‌, పర్మినెంట్‌, ఎన్‌ఎంఆర్‌ల కింద 435 మంది కార్మికులు పనిచేయగా వారికి రూ.13 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. పదేళ్లుగా బకాయిలు రాక పోవడంతో జీవనం కోసం ఎన్నో అవస్థలు పడ్డారు. అప్పుల పాలయ్యారు. అంతేగాక ఆర్థిక సమస్యలు వెంటాడాయి. అనారోగ్యం పాలయ్యారు. కర్మాగారం మూతబడినప్పటి నుంచి ఇప్పటి వరకు రిటైర్‌ అయిన వారితో కలిపితే 50 మంది కార్మికులు కన్నుమూశారు. వీరిలో ఎక్కువ మంది ఆకలి, అనారోగ్యం చావులేనని తోటి కార్మికులు చెప్పడం గమనార్హం. అంతేగాక ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక చక్కెర కర్మాగారం కార్మికులను ఆదుకుంటానని ఇచ్చిన భరోసా ఊసేలేకుండా పోయింది. 

ఐదు కమిటీలు వేసి ఏం చేశారు

కార్మికుల బకాయిల కోసం ఐదు కమిటీలు వేశారు. వీరంతా చూడటమే తప్ప తేల్చిందేమీ లేదు. పైగా 1995న కర్మాగారంలో లాకౌట్‌ ప్రకటించి 2005లో తిరిగి తెరిపిం చాక ఇప్పటివరకు ఎనిమిది మంది ఎండీలు పనిచేశారు. వీరిలో రామిరెడ్డి మాత్రం పర్మినెంట్‌ ఎండీ కాగా ఆపై సుదర్శన్‌ బాబు, షంషీర్‌ అహ్మద్‌, కృష్ణమూర్తిరాజు, వెంకటసుబ్బయ్య, విజయకుమార్‌, రవికుమార్‌, ప్రస్తుతం ఉన్న జాన్‌ విక్టర్‌లు ఇన్‌చార్జ్‌లుగా పనిచేశారు. అయినా కార్మికులకు ఒరిగిందేమీ లేదు.

బకాయిలు ఇచ్చేందుకు జీవో విడుదల చేసినా..

రూ.13 కోట్ల బకాయిల కోసం కార్మికులు పదేళ్లుగా పోరాటం చేశారు. కోర్టుకు వెళ్లారు. ఈ మేరకు వీరికి జీతాలు చెల్లించాలిన కోర్టు సైతం అధికారులను ఆదేశిం చింది. దీంతో ఈ ఏడాది మార్చి 17వ తేదీన జీవో నెంబర్‌ 15ను ప్రభుత్వం విడుదల చేసింది. కార్మికులకు రావలసిన బకాయిలు ఏ మేరకు ఉన్నాయి... ఎంత మందికి ఎంత ఇవ్వాలి... వంటివి పకడ్బందీగా నివేదిక, ఆడిట్‌చేసి పక్కాగా అందివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జీవో ప్రకారం ఏప్రిల్‌ నెలాఖరుకు జీతాలు చెల్లించాల్సి ఉంది. దీంతో పదేళ్లుగా కర్మాగారానికి కాపుకాసిన కార్మికులు సంతోషించారు. ఇక నైనా తమ కష్టాలు తీరుతాయని ఆశించారు. కానీ జీవోలో చెప్పిన మేరకు అధికారులు స్పందించలేదు. ఆడిటంగ్‌ చాలా ఆలస్యమైంది. ఏప్రిల్‌ 30 నాటికి కార్మికులకు జీతాలు ఇవ్వక పోగా.. ప్రభుత్వం చక్కెర కర్మాగారం వద్ద ఉన్న కార్మికులం దరినీ ఇళ్లకు పంపించేసింది. కర్మాగారం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది 13 మందిని ఏర్పాటు చేసింది. తమకు జీతాల బకాయిలు రాకపోవడంతో కార్మికులు తిరిగి కోర్టును ఆశ్రయించారు. జూన్‌ నెలాఖరులోపు బకాయిలన్నీ చెల్లించా లని కోర్టు మరోమారు ఆదేశించింది. ఈ మేరకు ఆడిటింగ్‌ జరుగుతోంది. అయితే జూన్‌ ఆఖరునాటికి తమకు బకాయిలు అందే దిశగా పనులు జరగడం లేదని కార్మికులు వాపోతున్నారు.

ఇక్కడ ఉండలేక బయటకు వెళ్లలేక..

కర్మాగారం మూతపడినప్పటి నుంచి కష్టాలు పడుతున్నాం. బకాయిలు వస్తాయన్న ఆశతో ఇక్కడే ఉంటున్నా. బయ టకు వెళదామంటే.. మరలా ఇక్కడకు వస్తామో రాలేమో.. ఒకవేళ ఏదైనా అవసరం వస్తే ఇబ్బందేకదా. దీంతో బయటకు పోవడం లేదు. ఇక్కడ ఉందామంటే బతకు దెరువులేదు.

- ఎస్‌.తిరుమలరావు, చక్కెర కార్మగార కార్మికుడు


బకాయిల విషయం సీఎం దృష్టికి

కర్మాగారంలో పనిచేసి రిటైరైన వారిలో 20 మంది వైద్యం చేయించుకోలేక అనారోగ్యంతో చనిపోయారని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ముఖ్యమంత్రికి చెప్పారు. సీఎం సాను కూలంగా స్పందించినప్పటికీ ఇంకా ఆలస్యం జరుగుతోంది. పైగా మాకు రావాలసిన బకాయిలలో ఆదాయపన్ను పేరుతో కోతపెట్టాలని చూస్తున్నారు. మరో రెండు నెలల్లో ఆడిట్‌ పూర్తి అవుతుంది. ప్రభుత్వం బకాయిలు ఇస్తుందన్న ఆశతో ఉన్నాం. 

- పి.కృష్ణ, కర్మాగార యూనియన్‌ నాయకుడు


73 మంది కార్మికులతో కోర్టుకెళ్లాం

పాత బకాయిల కోసం 2017లో 73 మంది కార్మికులతో కలిసి కోర్టుకెళ్లాం. హైకోర్టులో వాదనలు జరిగాయి. కార్మికులకు బకాయిలు చెల్లించాలని కోర్టు తీర్పు నిచ్చింది. ఈ మేరకు ఎండీ, కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. వారు స్పందించకపోవడంతో మరలా కోర్టును ఆశ్రయించాం. మరో రెండు నెలల్లో పూర్తి బకాయిలు 73 మంది కార్మికులకు చెల్లించాల్సి ఉటుంది. ఇలా జరిగినా కొంత వరకు మేలే 

- పి.పెంచల్‌రెడ్డి, చక్కెర కర్మాగారం నాయకుడు

Updated Date - 2022-05-25T05:59:52+05:30 IST