పెండింగ్‌ కేసులను ఏం చేస్తారు?

ABN , First Publish Date - 2022-05-11T08:21:54+05:30 IST

రాజద్రోహం సెక్షన్‌ను కొనసాగించే విషయంపై పునరాలోచిస్తున్నామని, అందుకు తమకు సమయం కావాలని కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది.

పెండింగ్‌ కేసులను ఏం చేస్తారు?

రాజద్రోహం కొత్త కేసులపై వైఖరి ఏమిటి?.. నేడు చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించిన జస్టిస్‌ ఎన్వీ రమణ


న్యూఢిల్లీ, మే 10 (ఆంధ్రజ్యోతి): రాజద్రోహం సెక్షన్‌ను కొనసాగించే విషయంపై పునరాలోచిస్తున్నామని, అందుకు తమకు సమయం కావాలని కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈలోపు రాజద్రోహం సెక్షన్‌ 124(ఏ) కింద కొత్త కేసులేవీ పెట్టకూడదనే సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. అలాగే... ఇప్పటికే ఈ సెక్షన్‌ కింద అరెస్టయిన వారి హక్కులను కాపాడేందుకు మార్గదర్శక సూత్రాలను రూపొందించే విషయాన్ని కూడా పరిశీలించాలని పేర్కొంది.


రాజద్రోహానికి సంబంధించి పెండింగ్‌ కేసులు, భవిష్యతులో పెట్టబోయే కేసుల విషయంలో ఏం చేస్తారో బుధవారంలోగా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించారు. ఈ అంశాలపై ప్రభుత్వంతో చర్చించి బుధవారం కోర్టుకు వెల్లడిస్తామని తుషార్‌ మెహతా తెలిపారు. తొలుత రాజద్రోహ సెక్షన్‌ కొనసాగాల్సిందేనని, ఈ అంశంపై 1962లో కేదార్‌నాథ్‌ సింగ్‌ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే అంతిమమని వాదించిన సర్కారు.. ఆ వెంటనే వైఖరిని మార్చుకున్న సంగతి తెలిసిందే. రాజద్రోహంపై పునరాలోచిస్తామని పేర్కొంటూ మరో అఫిడవిట్‌ను దాఖలుచేసింది. కాగా 2014-19 మధ్య రాజద్రోహం సెక్షన్‌ కింద దేశవ్యాప్తంగా 326 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 6 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి.

Read more