Abn logo
Jul 28 2020 @ 00:46AM

ఇప్పటి మాటేదీ?

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం నాటి ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగంలో, కరోనా గురించిన ప్రస్తావనలూ హెచ్చరికలూ చేశారు. మరీ ముఖ్యంగా, కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కనుక ఇరవైఒక్క సంవత్సరాల క్రితం సాధించిన విజయం గురించి మరింత గట్టిగా మాట్లాడారు. కరోనా ప్రమాదం తొలగిపోయిందన్న భ్రమలో ప్రజలు ఉండవద్దనీ, ఆదిలో ఎంత ప్రమాదమో, ఇప్పుడూ అంతేనంటూ హెచ్చరించారు. పైగా, కరోనా అనేక ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నందున మాస్కులు పెట్టుకోకపోవడం, తీసేసిమాట్లాడటం కూడదనీ, తగు జాగ్రత్తల్లో ఉండాలని హితవు పలికారు. ఇలా జాగ్రత్తలు పాటిస్తూనే పనుల్లో వేగం పెంచుకుందామని నిర్థారించారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నా, ఇతర దేశాల రికవరీ రేటు, మరణాల రేటుతో మనల్ని పోల్చుతూ, ఎంతో మెరుగ్గా ఉన్నామని తేల్చారు ఆయన. లక్షలమంది ప్రాణాలను కాపాడటంలో సైతం సఫలమయ్యామన్నారు. మాల్స్‌, థియేటర్ల వంటివి కూడా చేర్చి, మూడోదశ అన్‌లాక్‌ ప్రక్రియకు దేశం సిద్ధపడుతున్న నేపథ్యంలో ప్రజలను ఆయన ఇలా సన్నద్ధం చేసివుంటారు.


కరోనా బారిన పడి, ఆస్పత్రిలో ఉన్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి చౌహాన్‌ సైతం ఈ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమాన్ని మంచం మీదనుంచే విని, మాస్కులు ఇత్యాది ఆయుధాలతో రోగంపై పోరాడమని ప్రజలకు సలహా ఇచ్చారు. రోగానికి భయపడవద్దనీ, సకాలంలో చికిత్సతీసుకుంటే సరిపోతుందనీ తేల్చేశారు. కరోనా కాలంలో పాలకులు ఏమి చెప్పినా ప్రజలు వినవలసిందే. ప్రమాదం పెరుగుతోందని అనేదీ వారే, మరిన్ని రంగాలను తెరిచి ప్రజలను ఆ ప్రమాదంవైపు నెట్టివేసేదీ వారే. పాలకుల ఈ లాక్‌, ఆన్‌లాక్‌ రహస్యాలు ఒకపట్టాన అర్థంకావు. చప్పట్లు చరచడం, దీపాలు వెలిగించడం ఇత్యాది చర్యలతో కరోనాపై పాలకులు ఆరంభించిన భీకర యుద్ధాన్ని ఇక మాస్కులు, దూరాలతో ప్రజలు కొనసాగించాల్సిందే. ప్రజలందరినీ సామూహికంగా రోగానికి ఎరవేసి, అంతిమంగా ‘మందబలం’ సాధించడం ఒక్కటే తరుణోపాయంగా కనిపిస్తున్నది. కొవిడ్‌ లెక్కలు, ఇతర దేశాలతో పోలికలదేముంది? లాక్‌డౌన్‌కాలంలోనూ, ఇప్పుడు రోజుకు యాభైవేలమంది రోగగ్రస్థులవుతున్నా అవే వింటున్నాం.


కార్గిల్‌ విజయ్‌ దివస్‌ పురస్కరించుకొని ప్రధాని తన ప్రసంగంలో పాకిస్థాన్‌ను చీల్చిచెండాడేశారు. ఆయన మనసులో మాటలన్నీ మా గట్టిగా బయటకు వచ్చాయి. పాకిస్థాన్‌తో స్నేహంగా ఉండటానికి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ, అది తన దుర్బుద్ధినీ, వెన్నుపోటు స్వభావాన్నీ వీడటం లేదనీ, చివరకు మన భూభాగాన్ని దురాక్రమించుకోవడానికి చూసిందని ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు. కుటిల, దుష్ట, వెన్నుపోటు పాకిస్థాన్‌ అంటూ అలనాటి దాని చొరబాటు, మన వీరజవాన్ల సాహసాలను ఆయన ఘనంగా ప్రస్తావించారు. అయితే, ప్రధాని మాట్లాడిన దానికంటే మాట్లాడని అంశాలపైనే ఇప్పుడు ఎక్కువచర్చ జరుగుతున్నది. కార్గిల్‌ను మించిపోయిన పరిస్థితులే ఇప్పుడూ ఉన్నా ప్రధాని తన ప్రసంగంలో చైనా పేరు, దాని చొరబాట్ల ఊసెత్తకపోవడం అనేకులను ఆశ్చర్యపరుస్తోంది. పాకిస్థాన్‌ విషయంలో ఆయన వాడిన పదజాలమంతా ఇప్పుడు చైనాకు వర్తిస్తుంది. గతనెల మన్‌కీ బాత్‌లో భారత భూభాగంమీద కన్నేసినవారికి ఘాటైన జవాబిచ్చామని ప్రధాని అన్నారు. స్నేహం చేయడమే కాదు, తగిన జవాబుచెప్పడం కూడా మాకు తెలుసని ప్రకటించారు. ఇప్పటి ప్రసంగంలో అటువంటి పరోక్ష ప్రస్తావనలు, హెచ్చరికలు సైతం లేవు. లద్దాఖ్‌ యాప్రికాట్‌ సేద్యం గురించి, కొవిడ్‌నియంత్రణ చర్యలు గురించి మాట్లాడతారు కానీ, చైనా చొరబాట్ల ఊసుండదు. పైగా, ఈ రోజుల్లో యుద్ధాల స్వరూప స్వభావాలు మారిపోయాయనీ, దేశంలోనే కొందరు సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే రీతిలో వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలకు చురకలు అంటిస్తారు. ప్రశ్నించడమే దేశద్రోహం అన్నమాట. కార్గిల్‌ యుద్ధంలో భారతదేశం తన శక్తిసామర్థ్యాలను అద్భుతంగా ప్రదర్శించిందనీ, ప్రపంచమంతా దానిని కళ్ళారా చూసిందని ప్రధాని అన్నారు. బహుశా అప్పటికంటే ఇప్పుడు మరింత ఎక్కువగానే మిగతా ప్రపంచం మనలను గమనిస్తోంది. సరిహద్దులు దాటి దెబ్బకు దెబ్బ తీయడంలో నిష్ణాతులైన పాలకులు ఏం చేస్తారోనని గమనిస్తోంది. కానీ, సరిహద్దు వాతావరణంలో పెద్ద సానుకూల మార్పు లేకున్నా, వర్తమానం ఊసెత్తకుండా, బలవంతుడైన కొత్త శత్రువు పేరెత్తకుండా, అలనాటి శౌర్యప్రతాపాలను ముచ్చటించుకోవడంతో సరిపెట్టుకున్నాం.

Advertisement