సీఆర్‌పీల గోస తీరేనా?

ABN , First Publish Date - 2022-05-19T05:44:26+05:30 IST

విద్యా విధానంలో మార్పులొస్తున్నాయి. కొత్త విధానాలు అమలువుతున్నాయి. వాటి పర్యవేక్షణకు నియమించిన సీఆర్పీల అవస్థలు మాత్రం మారడం లేదు.

సీఆర్‌పీల గోస తీరేనా?
ప్రభుత్వం నిర్దేశించిన పనులను చేపడుతున్న సీఆర్‌పీలు

- చాలీచాలని వేతనాలు

- అదనపు పని భారంతో సీఆర్‌పీల అవస్థలు

- పదేళ్ల క్రితం విధుల్లో చేరిన సీఆర్‌పీలు

- ఈఎస్‌ఐ, పీఎఫ్‌, హెల్త్‌కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌


కామారెడ్డి టౌన్‌, మే 18: విద్యా విధానంలో మార్పులొస్తున్నాయి. కొత్త విధానాలు అమలువుతున్నాయి. వాటి పర్యవేక్షణకు నియమించిన సీఆర్పీల అవస్థలు మాత్రం మారడం లేదు. ఉద్యోగంలో చేరి పదేళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఉద్యోగ భద్రతలేదని కనీసం ఈఎస్‌ఐ, పీఎఫ్‌, హెల్త్‌కార్డులు అమలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు సీఆర్‌పీ వ్యవస్థ ప్రారంభమైన సమయంలో నియామకాలు చేపట్టగా మధ్యలో మానేసిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకోకపోవడంతో ఉన్న వారిపై అదనపు భారం పడుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మేరకు న్యాయం జరుగుతుందోనని అంతా ఆశగా ఎదురుచూశారు. గుడ్డిలో మెల్లలా గత జనవరి నుంచి పెంచిన జీతాలను అమలు చేస్తున్నప్పటికీ సమాన పనికి సమాన వేతనం మాత్రం అందడం లేదు.

సీఆర్‌పీల నియామకం ఇలా..

ఉపాధ్యాయులు, అధికారులకు వారధిగా ఉంటూ పాఠశాలలు, క్లస్టర్‌ ఇన్‌చార్జీలు, ఎంఈవోలకు అనుసంధానంగా పని చేయడానికి సీఆర్‌పీలను నియమించారు. పదేళ్లకు ముందు ఉపాధ్యాయులకు రాతపరీక్ష నిర్వహించి ప్రతీ మండలానికి ముగ్గురు చొప్పున ఎమ్మార్పీలను ఎంపిక చేసి వారి ద్వారా ఎమ్మార్సీ కార్యాలయ పనులు, పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలు చేయించేవారు. అయితే టీచర్లు పాఠశాలలు వదిలి కార్యాలయానికి రావడంతో విద్యార్థులు నష్టపోతారనే ఉద్దేశ్యంతో పాటు విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను అత్యవసర పరిస్థితులు జనాభా లెక్కలు, ఎన్నికల విధులకు మాత్రమే వినియోగించాలని ఉండడంతో ఈ వ్యవస్థను రద్దు చేసి వారిని తిరిగి పాఠశాలలకు పంపించారు. 2011లో కొత్త విధానాన్ని తీసుకొచ్చి బీఈడీ పూర్తిచేసిన వారికి 2012లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి సర్వశిక్ష అభియాన్‌ కింద ఒప్పంద పద్ధతిలో కార్యాలయ పనులకు ఒక్కో ఎంఐఎస్‌ కోఆర్టినేటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లను మండలంలోని పాఠశాలలను విభజించి క్లస్టర్లుగా మార్చి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో సీఆర్‌పీని నియమించారు.

ఇవీ విధులు..

సీఆర్‌పీలు తరచూ పాఠశాలలకు వెళ్లి అవసరమైన సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాంప్లెక్స్‌ హెచ్‌ఎంకు సహకరిస్తూ యూడైస్‌, చైల్డ్‌ ఇన్సో పూర్తిచేయాలి. ప్రతి నెలకు సంబంఽధించిన డైరి రాస్తు, ఎస్‌టీపీఎస్‌ టీచర్లు సెలవులో ఉంటే పాఠశాలలకు వెళ్లి పాఠం బోధించాల్సి ఉంటుంది. ప్రతీ నెల కాంప్లెక్స్‌ సమావేశం నిర్వహించాలి. దీనికి తోడు సర్వేలు, బడిబయటి పిల్లల గుర్తింపు, పాఠశాల వివరాలు, అక్కడి సమస్యలతో పాటు మ్యాప్‌ తయారు చేయాల్సి ఉంటుంది. ఇక రవాణా సౌకర్యం లేని స్కూళ్లను గుర్తించాలి. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. క్లస్టర్‌ పరిధిలోని పాఠశాలల్లో నిర్వహించే ఎస్‌ఎంసీ సమావేశాలకు హాజరై వచ్చిన వినతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతీ పాఠశాలను నెలలో రెండుసార్లు సందర్శించి టీచర్ల పనితీరును గుర్తించాలి. ప్రతీ ఏడాది ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, ఖాళీలు గుర్తించాలి. వివిధ రకాలైన మేళాలు, పోటీలు నిర్వహించాలి. కేజీబీవీలను సైతం సందర్శించాలి.

సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్‌

పది సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న సీఆర్‌పీలు పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఖాళీలను భర్తీ చేసి పని భారం తగ్గించడంతో పాటు ఉద్యోగభద్రత కల్పించాలని నిరసన, ర్యాలీలు చేపట్టి అనేక సార్లు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించారు. అయితే కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భాగస్వామ్యంతో వేతనాలు అందుతాయి. సీఆర్‌పీలకు రూ.15వేల జీతం వస్తుండగా గత సంవత్సరం జూన్‌ నుంచి పెంచిన జీతాలను అమలు చేస్తూ రూ.19500లను జనవరి నెలలో చెల్లించారు. తమకు కేటాయిస్తున్న విధులకు తగిన వేతనం అందించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, హెల్త్‌కార్డులు అమలు చేయడంతో పాటు ఉద్యోగభద్రత కల్పించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-05-19T05:44:26+05:30 IST