‘పేదలకు 15లక్షలు’.. హామీ ఏమైంది?

ABN , First Publish Date - 2022-05-28T08:12:56+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పిన ఏమైంది? ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఏమయ్యాయి? ఈ

‘పేదలకు 15లక్షలు’.. హామీ ఏమైంది?

- ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనయి?

- మోదీని అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా?

- మసీదులను తవ్వుతాననడం రెచ్చగొట్టడమే

- స్టాలిన్‌ దమ్మున్నోడు.. ప్రధానినే నిలదీసిండు

- కేసీఆర్‌ ఇక్కడే ఉంటే ఆ అవకాశం ఉండేది కదా? 

- టీఆర్‌ఎస్‌, బీజేపీది రాజకీయ అక్రమ సంబంధం

- టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పిన ఏమైంది? ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఏమయ్యాయి? ఈ అంశాలపై బండి సంజయ్‌.. ప్రధాని మోదీని ఎందుకు అడగలేదు?’’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిలదీశారు. ప్రధాని హోదాలో తెలంగాణకు వచ్చిన మోదీ.. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కావడం సరైంది కాదన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేత బిజ్జి శుత్రువురావుతో కలిసి జగ్గారెడ్డి మాట్లాడారు. తెలంగాణ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా గుడికి వెళ్లని బండి సంజయ్‌.. శివలింగాల పేరుతో మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన ముస్లింలను వేరు చేస్తూ హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీల అమలుపై ప్రధానిని ప్రశ్నించే దమ్ములేని బండి సంజయ్‌.. మసీదులను తవ్వుతాననడం రెచ్చగొట్టడమేనని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అలా కాదని, అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుందని, అందరూ బాగుండాలని కోరుకుంటుందని చెప్పారు. ‘‘మోదీని కేసీఆర్‌.. కేసీఆర్‌ను మోదీ తిడితే ప్రజల కడుపు నిండుతదా? రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తే.. ఆయన కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ ఎందుకు హాజరు కాలేదు? హాజరై ఉంటే రాష్ట్ర సమస్యలపై ప్రధానిని నిలదీసేవారు కదా? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌.. దమ్మున్నోడు. జీఎస్టీ నిధులు ఇవ్వాలని ప్రజల ముందే ప్రధానిని నిలదీసిండు. సీఎం అంటే అలా ఉండాలి’’ అని అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీది రాజకీయ అక్రమ సంబంధమని, అందులో భాగంగానే మోదీ హైదరాబాద్‌ వస్తుంటే.. కేసీఆర్‌ బెంగళూరు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఈ టూర్లు.. కేసీఆర్‌, మోదీ అండర్‌స్టాండింగ్‌ టూర్‌ల లాగా ఉన్నాయన్నారు. మరో మూడు నెలల్లో సంచలన వార్తను వింటారంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. శుభవార్తలు చెబుతానంటూ గతంలో చాలా సార్లు చెప్పి.. ఒక్కటీ చెప్పలేదన్నారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీని కాదని కేసీఆర్‌ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలా సమస్యలున్నాయని తాము చెబితే.. పరిష్కరించాల్సిన మంత్రి హరీశ్‌రావు విమర్శలకు దిగడం సరికాదన్నారు.

Updated Date - 2022-05-28T08:12:56+05:30 IST