ఏమిటీ నత్తనడక?

ABN , First Publish Date - 2021-09-07T06:48:55+05:30 IST

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర

ఏమిటీ నత్తనడక?

  • కేసుల పరిష్కారంలో సీబీఐ విఫలం
  • శిక్షలు వేయించడంలో సక్సెస్‌ తక్కువే
  • 6 వారాల్లో అఫిడవిట్‌ వేయండి: సుప్రీం

  

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్పగించిన కేసులను పరిష్కరించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులెన్ని? ఎన్నేళ్లుగా పెండింగులో ఉన్నాయి? వివిధ స్థాయిల్లోని కోర్టుల్లో శిక్షలు వేయించడంలో సీబీఐ సక్సెస్‌ రేటు ఎంత? వంటి వివరాలను సంవత్సరాల వారీగా ఆరు వారాల్లో తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ప్రాసిక్యూషన్‌ విభాగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలను, వేగంగా కేసులను పరిష్కరించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అఫిడవిట్‌లో వివరించాలని నిర్దేశించింది.


సుప్రీం డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ శుక్రవారం విచారణ సందర్భంగా నిందితులకు శిక్షలు పడేట్లు చేయడంలో సీబీఐ సాధించిన విజయాల శాతం తక్కువేనని అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీరులో ఇద్దరు మహిళల అత్యాచారం, హత్య కేసులో న్యాయవాదులు మహమ్మద్‌ అల్తాఫ్‌ మహమ్మద్‌, షేక్‌ ముబారక్‌లకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు 2018 మార్చి 25న ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సీబీఐ డైరెక్టర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇద్దరు న్యాయవాదులకు వ్యతిరేకంగా సీబీఐ తప్పుడు సాక్ష్యాలను సృష్టించిందని ఆరోపణలను ఎదుర్కొంది. సీబీఐని పంజరంలో చిలకగా అభివర్ణిస్తూ గతంలో మద్రాస్‌ హైకోర్టు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను కూడా ఈ తీర్పులో సుప్రీం ప్రస్తావించింది. తాము పంజరంలో ఉన్న చిలకకు స్వేచ్ఛ కల్పించాలనుకుంటున్నట్లు హైకోర్టు చెప్పింది. హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సమర్థించింది.


కాగా.. సీబీఐ సమర్థతపై సుప్రీంకోర్టు సందేహాలను వ్యక్తం చేస్తూ జారీ చేసిన ఆదేశాలు అత్యంత కీలకమైనవని న్యాయనిపుణులు భావిస్తున్నారు. సీబీఐ ముందున్న పెండింగ్‌  కేసుల వివరాలు,  దర్యాప్తు పురోగతికి సంబంధించి వివరాలను ఆరు వారాల్లోపు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీబీఐ పనితీరు స్పష్టమయ్యే అవకాశాలు ఉన్నాయని, పలువురు వీఐపీల కేసులకు సంబంధించి పురోగతిని రహస్యంగా ఉంచలేని పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు. దేశవాప్తంగా న్యాయసంస్థల్లో తాజా ఘటన చర్చనీయాంశమైంది. 


Updated Date - 2021-09-07T06:48:55+05:30 IST