బహుళత్వమే కదా, భారతీయ ఆత్మ!

ABN , First Publish Date - 2021-07-01T06:15:06+05:30 IST

‘‘ప్రజలు అంటే ఉమ్మడి ప్రేమలు కలిగి ఉండే జనబాహుళ్యం’’ అన్న వాక్యాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఈ ఏడాది జనవరిలో తన ప్రమాణస్వీకార ప్రసంగంలో ఉటంకించారు....

బహుళత్వమే కదా, భారతీయ ఆత్మ!

‘‘ప్రజలు అంటే ఉమ్మడి ప్రేమలు కలిగి ఉండే జనబాహుళ్యం’’ అన్న వాక్యాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఈ ఏడాది జనవరిలో తన ప్రమాణస్వీకార ప్రసంగంలో ఉటంకించారు. అయిదో శతాబ్దంలో రోమ్ నగర పతనం నేపథ్యంలో, సెయింట్ అగస్టీన్ రాసిన ‘సిటీ ఆఫ్ గాడ్’ లోని వాక్యం అది. మనలోని అతిహీన సహజాతాలకు, అత్యుత్తమ నైతిక వైఖరులకు నడుమ అమెరికా అంతరాత్మ కోసం పోరాటం సాగుతున్నదని బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు గుర్తువచ్చినప్పుడు, భారతదేశపు ఆత్మ గురించిన ప్రశ్న రావడం సహజం. ‘‘ప్రజలు అంటే ఉమ్మడి ద్వేషాలు కలిగి ఉండే జనబాహుళ్యం’’ అని నిర్వచించుకుని, ఆ రకంగా ద్వేషనిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, అతిహీన సహజాతాలను, సజ్జన నైతికతను మనదేశంలో ఎట్లా గుర్తించాలని చర్చించవలసి ఉంటుంది. 


బయటి ప్రపంచానికి అమెరికా సామ్రాజ్యవాది కావచ్చును కానీ, అంతర్గతంగా అది ప్రజాస్వామ్యాన్ని మెరుగుగా ఆచరించే దేశం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనల్ని మనం ప్రశంసించుకుంటాము, ఇతరులు కూడా ముఖస్తుతులు చేస్తుంటారు కానీ, పోలిక అంటూ తెస్తే అమెరికాయే అనేక విషయాలలో నయం. అందులో ఒకటి, ‘జాతీయత’ను అది నిర్మించుకోవడానికి చేసిన ప్రయత్నం. ఐరోపా అర్థంలో జాతీయత, జాతి అన్న మాటలు భారత్‌కు, అమెరికాకు కూడా వర్తించేవి కావు. తెగ, నరవర్గం, భాష, రంగు మొదలైన అనేక ప్రాతిపదికలపై జాతి దేశాలు ఏర్పడ్డాయి కానీ, అనేక తెగల, నరవర్గాల, రంగుల, భాషల, మతాల, కులాల ప్రజలతో భారతదేశం ఏర్పడింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడుతున్నప్పుడు, భారత జాతీయతను నిర్మించే ప్రయత్నం మొదలయింది. అమెరికా ప్రవాసుల దేశం. దేశీయ ప్రజానీకం మీద ఐరోపా వలసవాదులు అమలుజరిపిన అతి దారుణమయిన నిర్మూలన అనంతరం అమెరికా రూపుదిద్దుకున్నది. ఆఫ్రికా నుంచి వేటాడి తరలించిన నల్లజాతి బానిసల దగ్గరి నుంచి, తరలివచ్చిన అనేక ఐరోపా తదితర ఖండాల ప్రజలు, అమెరికా కోరి రప్పించుకున్న దేశదేశాల భౌతిక, బౌద్ధిక కార్మికులు, మేధావులు- అందరూ కలిస్తే అమెరికా అయింది. తెల్లవారి ఆధిక్యం, యూదుల ప్రాబల్యం.. ఇంకా అనేక అంశాలు అమెరికా స్వభావాన్ని తీర్చిదిద్ది ఉంటాయి. కానీ, ఇంత కలగూరగంప ప్రజానీకాన్ని ఒక దేశప్రజగా తీర్చిదిద్దడంలో అంతర్యుద్ధమూ, అనంతర ప్రజాస్వామ్యం మంచి పాత్ర వహించాయి. అక్కడి సమాజంలోను రంగువివక్ష, స్త్రీలపై హింస మొదలైనవన్నీ ఉన్నాయి, అమెరికన్ గర్వం అన్నది ఇప్పటికీ దాని దాష్టీకం మీద కూడా ఆధారపడి ఉన్న మాట నిజం. అయినప్పటికీ, ఆ దేశంలో జాతీయతను సంకుచితంగా, ద్వేషపూరితంగా నిర్వచించడానికి గట్టి ప్రతిఘటన ఎదురయింది. ట్రంప్ తీసుకువచ్చిన విభజనలకు, కేపిటల్ హిల్‌పై జరిపించిన దాడితో సహా ఆయన చేసిన దౌర్జన్యాలకు, అమెరికన్ సమాజం చెప్పుకునే సంస్కారానికి పొంతన కుదరలేదు. కార్మిక వలసలకు, మైనారిటీ మతాలకు, ప్రజల హక్కులకు, ఉదారవిలువలకు పచ్చి వ్యతిరేకిగా పరిణమించిన రిపబ్లికన్ ఉగ్రవాదమే బైడెన్ చెప్పిన అతిహీన సహజాత శక్తి. 


వాషింగ్టన్‌కు చెందిన ‘ప్యూ రీసర్చి సెంటర్’ అనేక సమస్యలు, వైఖరులు, ధోరణులపై తటస్థ అధ్యయనాలను, పరిశోధనలను చేస్తుంది. ఇటీవలి కాలంలో ఆ సంస్థ అమెరికాలో జరిపిన ఒక సర్వేలో, 2010 తరువాత జరిగిన వివాహాలలో 39 శాతం మతాంతర వివాహాలు అని తేలింది. అరవై ఏళ్ల కిందట ఇది కేవలం 19 శాతంగా మాత్రమే ఉండేది. వివాహం విషయంలో మతం అన్నది క్రమంగా అప్రధానమైపోతున్నదని ఈ అంకెలు చెబుతున్నాయి. కానీ, నూటికి 55మంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెళ్లిచేసుకునేవారి కుటుంబం రిపబ్లికనా, డెమొక్రాటా అన్న విషయంలో పట్టింపుతో ఉన్నారట. అరవై ఏళ్ల కిందట 72 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ పార్టీ వారిని చేసుకున్నా పట్టించుకోబోమని చెప్పారు. ఇది అమెరికన్ సమాజంలో పెరుగుతున్న సెక్యులర్ ధోరణిని తెలియజేస్తుందా, లేక, ఒకప్పుడు మత విశ్వాసాలు అందించే గాఢమైన ఉద్వేగాలను ఇప్పుడు రాజకీయపార్టీలే అందిస్తున్నాయా? అన్న సందేహం కలుగుతుంది. ఇదే ‘ప్యూ’ సంస్థ తాజాగా భారతదేశంలో జరిపిన అభిప్రాయసేకరణలో వెల్లడైన అభిప్రాయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. నూటికి అరవైఏడు మంది హిందువులు, తమ ఆడపిల్లలు మతాంతర వివాహాలు చేసుకోగూడదని గట్టిగా భావిస్తున్నారు. తమ మగపిల్లలు ఇతరమతస్థుల అమ్మాయిలను చేసుకోవడం విషయంలో నూటికి అరవై ఐదు మంది వ్యతిరేకంగా ఉన్నారు. మరొక ఆసక్తికరమైన పరిశీలన- భారతీయ జనతాపార్టీకి ఓటు వేసిన హిందువుల్లో ఈ ధోరణి మరింత హెచ్చుగా ఉన్నది. నూటికి 87 మంది మతాంతర వివాహాలను నిరోధించాలన్న అభిప్రాయంలో ఉన్నారు. రాజకీయ సామాజిక భావాల కంటె మతభావాలే మన దేశస్థులను ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయనుకోవాలా? మతభావాల ప్రభావం ఒక పార్టీ ఓటర్లలో అత్యధికంగాను, ఆ పార్టీ ప్రభావం వ్యాపించిన సమాజంలో అధికంగానూ ఉంటే, రాజకీయ సామాజిక భావాలు, మతతత్వభావాలూ కలగలసిపోయాయనుకోవాలా? 


‘ప్యూ’ అధ్యయనం తేల్చిన మరొక పచ్చి నిజం ఏమిటంటే, హిందువుగా ఉండడమే భారతీయతకు అసలైన గుర్తుగా నూటికి 67 శాతం మంది భావిస్తున్నారట. మతానికీ జాతీయతకు హద్దులు పూర్తిగా చెరిగిపోతున్న వాస్తవాన్ని ఈ పరిశీలనలో చూడవచ్చు. అయితే, దాదాపుగా అంతమందీ, భారతదేశంలో మతవైవిధ్యం ఉండాలని, అన్ని మతాలకు ఆదరణ లభించాలని భావిస్తున్నారట. అంటే, హిందువు నికార్సయిన భారతీయుడుగా భావిస్తూనే, ఇతరులు తక్కువ భారతీయత కలిగి ఉన్నప్పటికీ, వారిపై సహిష్ణుత కలిగి ఉండాలని అనుకుంటున్నారన్నమాట. ఈ వ్యత్యాసమే, ప్రథమశ్రేణి పౌరసత్వం, ద్వితీయశ్రేణి పౌరసత్వంగా పరిణమిస్తున్నదా? జాతీయోద్యమ కాలంలోనూ మతభావనల వినియోగం విస్తృతంగానే జరిగింది. కానీ, మతానికి నిమిత్తంలేని లౌకిక భావనలతో భారత జాతీయతను నిర్మించాలన్న ఆదర్శం కూడా నాడు ఉన్నది. స్వాతంత్ర్యపు తొలినాళ్లలో అటువంటి ప్రయత్నం కూడా ఎంతో కొంత జరిగింది. 1980 దశకం నుంచి మతజాతీయత క్రమంగా బలపడడం మొదలయింది. దేశసమగ్రత, సమైక్యతకు ప్రమాదం వచ్చిందన్న నినాదం, మైనారిటీ మతస్థుల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలలోని సమస్యలతో బలపడింది. దేశసమగ్రతను, వైవిధ్యాన్ని ప్రజానుకూల అర్థంలో ప్రచారం చేయడంలో పార్లమెంటరీ కమ్యూనిస్టులు ఘోరంగా విఫలం కావడమే కాక, సరిహద్దుల దేశభక్తిని వారు కూడా తలకెత్తుకున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ రంగాలంకరణ చేసి వేదిక సిద్ధం చేసిన తరువాత, భారతీయ జనతాపార్టీకి గాంధీయ సోషలిజం వంటి లక్ష్యాలతో నిమిత్తం లేకపోయింది. భారతీయ అంతరాత్మ వైవిధ్యం కాదు, మెజారిటీ ధర్మమే అన్న భావం బలపడుతూ పోయింది. 


జాతి దేశం కాదు, దేశపు జాతి ఏర్పడాలని కొందరు మేధావులు సూచిస్తున్నారు. భారతీయులంతా ఒక జాతి అన్న భావన పెరగాలని, భారతీయులలోని బహుళత్వాన్ని అప్పుడది స్వీకరిస్తుందన్నది దాని ప్రతిపాదకుల ఉద్దేశ్యం. కానీ, దేశంలో అతిహీన సహజాత దుష్టశక్తులు పూర్తిగా ఇంకా ఏ రూపూ దిద్దుకోని దేశంలో ఒక జాతిని, ఉమ్మడి ప్రేమ మీద కాకుండా, ఉమ్మడి ద్వేషం మీద ఆధారపడి నిర్మించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రగతిశీల సంగీతకారుడు టి.ఎం కృష్ణ ఈ మధ్య ప్రచురించిన ‘‘ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ: నోట్స్ ఆఫ్ డిస్సెంట్’’ అన్న పుస్తకంలో ఎవరో ఏ ప్రయోజనాల కోసమో, రాజీల కోసమో గీసుకున్న గీతల మధ్య జాతీయతలు బందీ కావడమేమిటి అని ప్రశ్నించారు. దేశాల మధ్యనే కాదు, రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య విభజన గీతలు అంతర్గత సాధికారత కోసం కాకుండా అదుపు చేయడం కోసమే ఉపయోగపడుతున్నాయని అన్నారు. ద్వేషజాతీయత స్థానంలో దేశజాతీయతను నిర్మించాలంటే ఏమి చేయాలన్నదే ప్రశ్న. ఉమ్మడి ప్రేమలను గుర్తించడం, సృష్టించడం ఒక మార్గం. సజ్జన శక్తులను ఉద్దీపింపజేయడం మరొక మార్గం. 


వందేళ్ల తరువాత కూడా మళ్లీ గుర్తుచేయవలసి వచ్చే వాక్యం ‘దేశమంటే మనుషులోయ్’. ఈ దేశం తనదేనా, ఈ దేశపు తనానికి ఇచ్చే నిర్వచనం తనకు వర్తిస్తుందా, మరెవరో తనకంటె హెచ్చు దేశస్తుడా అన్న భయసందేహాలు ఎవరికీ రాకూడదు. తన పుటకే తనను దేశభక్తుడిని చేస్తుందని, మరొకరి పుటక వారిని దేశద్రోహిని చేస్తుందని అనుకునే చోట, హిట్లర్ రాజ్యమే చిరస్థాయి అవుతుంది. అట్లా జరగకుండా ఏమి చేయగలమన్నదే ఇప్పుడు సజ్జన నైతికశక్తుల ముందున్న ప్రశ్న.


కె. శ్రీనివాస్

Updated Date - 2021-07-01T06:15:06+05:30 IST