ఇల్లు కట్టే దారేది..!

ABN , First Publish Date - 2022-04-21T06:48:19+05:30 IST

జగనన్న తోడులో జిల్లాకు 1,04,678 పక్కా గృహాలు కేటాయిస్తే, ఇప్పటి వరకు 1043 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయంటే జగన్న ఇళ్ల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు అర్థమవుతున్నాయి. జిల్లాలో 529

ఇల్లు కట్టే దారేది..!

జగనన్న కాలనీ లేఔట్లలో కనీస వసతులు నిల్‌ 

జగనన్న తోడు ఇల్లు కేటాయింపు 104678

పూర్తి 1043 మాత్రేమే..

కడప, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇల్లు కట్టడం లేదు... ఊర్లే కడుతున్నాం... ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కేటాయించాం’’ ఇది జగనన్న ఇళ్ల కాలనీల పై సీఎం జగన్‌ మొదలుకొని ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. రూ.5 లక్షలతో ఇళ్లు నిర్మించి మరీ లబ్ధిదారులకు తాళంచెవితో సహా ఇస్తామని ప్రకటించిన సర్కార్‌ నాలుక మడతేసి సెంటు, సెంటున్నర స్థలం కేటాయించి లక్ష 80 వేల రూపాయలు ఇస్తాం పండగ చేసుకోమంది. మరి ప్రభుత్వ బాషలో చెప్పినట్లు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు 7 అడుగులు వెనక్కిలా ఉంది. ఇల్లు కట్టుకుంటారా.. లేదంటే స్థలం వదిలేయాలంటూ లబ్ధిదారుల మెడపై కత్తి పెట్టినంత పని చేసి.. వలంటీర్ల ద్వారా వార్నింగ్‌ ఇప్పించినా ఇళ్ల నిర్మాణాకి లబ్ధిదారులు సుమఖుత వ్యక్తం చేయడం లేదు. కారణం ఆ జగనన్న కాలనీలన్నీ (లేఔట్లు) ఊరికి దూరంగా కొండల్లో ఉన్నాయి. సరే ఇచ్చిన స్థలంలో కట్టుకుందామంటే సిమెంటు, ఇసుక కలిపేందుకు నీళ్లు లేవు. నిర్మాణ పనులు మాట దేవుడెరుగు కనీసం తాగేందుకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి.. అక్కడికి వెళ్లేందుకు రోడ్లు లేవు. మహిళలు ఒంటరిగా ఆ స్థలాల వద్దకు వెళ్లలేని పరిస్థితి. ఆటోలో వెళ్దామంటే ప్రాంతాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1000 అడుగుతున్నారు. ఇన్ని వ్యయ ప్రయాసలు ఓర్చి ఇల్లు కట్టుకోవడం పేదలకు సాధ్యమయ్యే పనేనా..? అందుకే ప్రభుత్వమే కట్టివ్వాలంటూ ఆప్షన్లు ఇచ్చారు. ప్రభుత్వం మూడో ఆప్షన్‌లో కూడా నాలుక మడతేయడంతో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 

జగనన్న తోడులో జిల్లాకు 1,04,678 పక్కా గృహాలు కేటాయిస్తే, ఇప్పటి వరకు 1043 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయంటే జగన్న ఇళ్ల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు అర్థమవుతున్నాయి. జిల్లాలో 529 జగన్న లేఔట్లు వేశారు. 1,04,678 పక్కా గృహాలు కేటాయించారు. కడప కార్పొరేషన్‌లో 15 లేఔట్లు వేయగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 34, కమలాపురం 63, మైదుకూరు 70, బద్వేలు 82, జమ్మలమడుగు 92, పులివెందుల 139, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల పరిధిలో 34 లేఔట్లు కేటాయించారు.


అంతా హంబక్కు..

జగన్న లేఔట్లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ ఇతర అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తాం.  ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేఔట్లు అన్నీ ఒక కొత్త గ్రామాలుగా ఉంటాయని ప్రచారం వేశారు. ఊరంటే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌, పాఠశాల, పచ్చదనం, ప్రార్థనా మందిరాలు ఉంటాయి. రియల్టర్లు వేసే ప్రైవేటు లేఔట్లలో కూడా ఈ నిబంధనలు పొందుపరుస్తారు. పట్టాలు ఇచ్చాం.. ఇళ్ల నిర్మాణం చేపట్టాలనే హడావిడి నిర్ణయంతో ఎక్కడపడితే అక్కడ లేఔట్లు వేశారు. చాలా లేఔట్లలో కనీసం వెళ్లేందుకు రోడ్లు లేవు, నీళ్లు లేవు.. కొన్ని చోట్ల  బోర్లు, నీటి సౌక ర్యానికి ట్యాంకర్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి కనెక్షన్లు ఇవ్వలేదు. లేఔట్లలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా నీటి సరఫరా, ఇతర పనుల కోసం రూ.99.62 కోట్లు అవసరమని అంచనా వేసి పనులు చేపట్టారని చెబుతారు. అయితే నిధులు, పనులు రికార్డుల్లో ఉన్నాయి తప్ప కొన్ని లేఔట్లలో పనులు మాత్రం క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు 


ఈ ఫోటోలో కనిపిస్తున్నది కడప కార్పొరేషన్‌ పరిధిలో వైఎ్‌సఆర్‌కాలనీ సమీపంలోని కొండల్లో ఉన్న క్రస్టర్‌ లేఔట్‌. వైఎఆర్‌ లేఔట్‌, ఎస్టీపీ లేఔట్‌ ఉన్నాయి. ఇక్కడ శంకరాపురం, ఎన్జీవో కాలనీ, మృత్యుంజయకుంటతో పాటు మరి కొన్ని ప్రాంతాలకు చెందిన 1250 మందికి పట్టాలు ఇచ్చారు. ఇవి సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఆ లేఔట్లకు వెళుతుంటే ప్రభుత్వం చెప్పినట్లు కొత్తగా వెలిసే ఊరికి వెళ్లినట్లు కనిపించడం లేదు. అడవిలో కలప లేక పశుగ్రాసం కోసమో వెళ్లినట్లు ఉంటుంది. క్లస్టర్‌ లేఔట్లోకి వెళితే అదంతా కొండ, కింద అంతా పెద్ద గుంతలా కనిపిస్తోంది. సుమారు 150 అడుగుల లోయ ఉంటుంది. ఇక్కడ పొరపాటున జారిపడ్డా నేరుగా లోయలో ఉంటారు. అసలు ఇక్కడ పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో.. అక్కడ కేవలం 40 మంది మాత్రమే బేస్మట్టం వేసుకున్నారు. నీటికోసం బోర్లు వేశారు. అయితే వాటికి కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు 1000 నుంచి 1200 రూపాయలు ఇచ్చి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకొని బేస్మట్టం వేసుకుంటున్నారు. కనీసం తాగేందుకు కూడా నీరు లేదు. ఇక్కడ గతంలో క్లస్టర్‌ వుండడంతో ఆ వాహనాల రాకపోకతో రోడ్డు దెబ్బతింది. టూ వీలర్‌లో కూడా వెళ్లలేని పరిస్థితి. ఇక నగరం నుంచి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏదైనా సామాగ్రి తీసుకెళ్లాలంటే ఆటో బాడుగ రూ.500 నుంచి 600 తీసుకుంటున్నారు. కొందరైతే అక్కడిదాకా వచ్చి ఆ కొండ పైకి మేము రాలేమంటూ మధ్యలో దించేస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. స్థలం కోసం ఆటోలో వెళ్లాలన్నా రూ.150 ఇస్తే కాని ఆటోలు రాని పరిస్థితి. అంతా కొండ ప్రాంతం కావడంతో మహిళలు ఒకరే వెళ్లలేని పరిస్థితి. అక్కడ ఇల్లు కట్టుకోడానికి నీళ్లు లేవు. పైకి వెళ్లడానికి రోడ్లు లేవు.  ఉండడానికి నీడ లేదు. కనీసం తాగేందుకు నీరు లేకపోతే ఎట్లా ఇల్లు కట్టుకుంటారబ్బా... 


ఈ ఫోటోలో కనిపిస్తున్నది గోపవరం మండలంలోని మడకలవారిపల్లె పరిధిలోని సిద్ధమ్మ పేరంటాల వద్ద వేసిన జగన్న లే ఔట్‌. ఇక్కడ 1530 మందికి పట్టాలు ఇచ్చారు. ఇప్పటి వరకు కేవలం 350 మంది మాత్రమే బేస్మట్టం వేశారు. అంతకు మించి ఒక్క అడుగు ముందుకు పడలేదు. బోర్లు వేసినప్పటికీ వాటర్‌ కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు స్థలం పోతుందనే భయంతో ట్యాంకర్ల ద్వారా తెచ్చుకొని బేస్మట్టం వేసుకున్నారు. లేఔట్‌ బద్వేలు-నెల్లూరు జాతీయ రహదారి సమీపంలోని కొండపై ఉంటుంది.  లేఔట్లోకి రాకపోకల కోసం ఇక్కడ తెలుగుగంగ కాలువపై వంతెన కడతామని అప్పట్లో లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. ఇంతవరకు వంతెన ఊసే లేదు. దీంతో చుట్టూ తిరిగి వెళుతున్నారు. 


జమ్మలమడుగులోని జగనన్న లేఔట్‌. ఇక్కడ 2767 మందికి పట్టాలు ఇచ్చారు. అయితే ఇళ్లు కట్టుకోవడానికి వెళ్లేందుకు రోడ్లు లేవు. సామగ్రి తెచ్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. బోర్లు వేసి ట్యాంకర్లు నిర్మించారు. కనెక్షన్లు ఇవ్వడం మరిచారు. దీంతో ట్యాంకర్లతో  నీళ్లు తోలుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 500 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. 


ఇలా పై మూడు లేఔట్ల పరిస్థితే కాదు. చాలా లేఔట్లలో ఇదే దుస్థితి నెలకొంది. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల సమస్య ఉండడంతో పనులు ముందుకు జరగడం లేదని చెబుతున్నారు. దీంతో ఇళ్ల మంజూరు ఘనం.. వసతులు దౌర్భాగ్యం అన్నట్లు ఉంది. 


జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల జాప్యం గురించి జిల్లా గృహ నిర్మాణశాఖాధికారి కృష్ణయ్యను వివరణ కోరేందుకు మంగళవారం ఉదయం ఆంధ్రజ్యోతి ఆయన కార్యాలయం వెళ్లగా అప్పుడు ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. సాయంత్రం ఫోన్‌లో వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


జిల్లాకు మంజూరైన ఇళ్ల నిర్మాణం వివరాలు 

--------------------------------------------------------------------------------------------------

నియోజకవర్గం మంజూరు మొదలెట్టనివి పునాదుల్లోపు బేస్మెంట్‌ ఆర్‌ఎల్‌ ఆర్సీ పూర్తి 

--------------------------------------------------------------------------------------------------------------

కడప 21500 547 16977 2336 227 253 42

బద్వేలు 13193 3060 5455 1479 270 239 24

జమ్మలమడుగు 11955 1914 5042 1226 258 411 183

కమలాపురం 6608 1038 2513 765 234 335 179

మైదుకూరు 7684 369 3819 835 236 532 374

ప్రొద్దుటూరు 23384 2672 15137 357 114 284 169

పులివెందుల 17823 5515 4032 895 102 82 29

ఒంటిమిట్ట 2561 417 905 500 73 95 43

---------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 104678 15532 53880 8393 1514 2231 1043

-------------------------------------------------------------------------------------------------- 

Updated Date - 2022-04-21T06:48:19+05:30 IST