హామీ ఏమైంది సారూ!

ABN , First Publish Date - 2022-05-08T05:27:08+05:30 IST

ఒకవైపు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు, మరోవైపు అదనపు టీఎంసీ ఓపెన్‌ కెనాల్‌ నిర్మాణం.. మధ్యలో బిక్కు బిక్కుమంటూ భయంతో కాలం వెళ్లదీస్తున్నారు తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామస్థులు. గ్రామ శివారులో 50 టీఎంసీల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్‌ నిర్మాణం చేపట్టింది.

హామీ ఏమైంది సారూ!
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కట్ట, అదనపు టీఎంసీ ఓపెన్‌ కెనాల్‌ మధ్యలో ఉన్న తుక్కాపూర్‌

  సీఎం ఆదుకుంటామని చెప్పి రెండు నెలలు

 క్షీరాభిషేకాలు చేసిన నాయకులెక్కడా?

 మండిపడుతున్న తుక్కాపూర్‌ ప్రజలు


తొగుట, మే 7: ఒకవైపు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు, మరోవైపు అదనపు టీఎంసీ ఓపెన్‌ కెనాల్‌ నిర్మాణం.. మధ్యలో బిక్కు బిక్కుమంటూ భయంతో కాలం వెళ్లదీస్తున్నారు తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామస్థులు. గ్రామ శివారులో 50 టీఎంసీల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్‌ నిర్మాణం చేపట్టింది. అందుకు గాను తుక్కాపూర్‌ గ్రామస్థుల నుంచి దాదాపు 1,600 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి తక్కువ మొత్తంలో పరిహారం అందించింది. మరికొంత భూమి 3 వందల మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న అదనపు టీఎంసీ ఓపెన్‌ కెనాల్‌లో పోవడంతో నివాసాలు తప్ప భూమి మిగలలేదు. దీంతో బతుకుదెరువు లేక రైతుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల మాదిరిగా తమ గ్రామాన్ని తీసుకొని ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం ఇచ్చి, వేరే చోట పునరావాసం కల్పించాలని వేడుకుంటున్నారు. 


నెరవేరని సీఎం కేసీఆర్‌ హామీ 


ఫిబ్రవరి 23న మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు తుక్కాపూర్‌ గ్రామస్థుల సమస్యను పరిష్కరించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌ వారికి పునరావాసం కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో అదే రోజు టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. టపాసులు కాల్చి సంబురాలు జరిపారు. కానీ హామీ ఇచ్చి రెండు నెలలు దాటినా ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకుల తీరుపై గ్రామస్థులు మండిపడుతున్నారు.


 

Read more