ఏం మొహం పెట్టుకుని వస్తున్నావ్‌ పొన్నాల!

ABN , First Publish Date - 2022-05-21T05:03:50+05:30 IST

నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించని పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు యాత్రల పేరిట ఏ మొహం పెట్టుకుని రైతుల వద్దకు వస్తున్నాడని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రశ్నించారు.

ఏం మొహం పెట్టుకుని వస్తున్నావ్‌ పొన్నాల!
మద్దూరులో కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే

 మాజీ మంత్రిని ప్రశ్నించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి


చేర్యాల, మే 20: నీటిపారుదల శాఖ  మంత్రిగా పనిచేసి నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించని పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు యాత్రల పేరిట ఏ మొహం పెట్టుకుని రైతుల వద్దకు వస్తున్నాడని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రశ్నించారు. కొమురవెల్లి మండలం గౌరాయపల్లి గ్రామంలో జడ్పీ నిధులతో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ హయాంలోనే నియోజకవర్గ రైతాంగానికి సాగు నీరు అందించామని తెలిపారు. అధికారంలో ఉన్న సమయంలో రైతుల గోడు పట్టని కాంగ్రెస్‌ నాయకులు ప్రస్తుతం డిక్లరేషన్‌ పేరిట బూటకపు నాటకాలతో బయలుదేరారని విమర్శించారు. పొన్నాల లక్ష్మయ్య నిర్వాకంతో జనగామ ప్రజలు రక్షిత మంచినీటికి నోచుకోలేదని, చీటకోటూరు రిజర్వాయర్‌లో నీరు పాకురుపట్టాయని ఎద్దేవా చేశారు. కాగా తాటిచెట్టు పైనుంచి పడి మృతిచెందిన చేర్యాల మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన ఆరెల్ల రవీందర్‌గౌడ్‌ కుటుంబానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.10వేల ఆర్థికసహాయం చేశారు. పార్టీ సభ్యత్వ బీమా, రైతుబీమా, గీతకార్మిక బీమా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఫోన్‌లో అధికారులను ఆదేశించారు. ఆయనవెంట ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిలివేరు సిద్ధప్ప, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, సర ్పంచులు సద్ది కృష్ణారెడ్డి, కొండపాక భిక్షపతి, నాయకులు పచ్చిమడ్ల మానస, కనకయ్య ఉన్నారు.


కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


మద్దూరు, మే 20: మద్దూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చాతగాని తనంతో మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. కాగా కల్యాణలక్ష్మి చెక్కులు పొందిన ప్రతీ కుటుంబం కనీసం 10 చెట్లు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నరేందర్‌, అశోక్‌, వైస్‌ ఎంపీపీ మలిపెద్ది సుమలతమల్లేశం, సొసైటీ చైర్మన్‌ నాగిళ్ల తిరుపతిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఇర్రి రాజిరెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వంగ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 


కల్యాణలక్ష్మి మంజూరుకు డబ్బుల వసూలు


తమ గ్రామంలో కొందరు కల్యాలణక్ష్మి చెక్కులు మంజూరు కావాలంటే రూ.20 వేలు డిమాండ్‌ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని దూళిమిట్ట మండలంలోని బెక్కల్‌ గ్రామానికి చెందిన భారతి ఆరోపించింది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫిర్యాదు చేసింది. దళారుల అవతారమెత్తిన ఎంత వారిని ఉపేక్షింబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు.


 

Updated Date - 2022-05-21T05:03:50+05:30 IST