Abn logo
Oct 18 2021 @ 23:56PM

మద్యం షాపులకు దసరా కిక్కు

పండుగ వేళ రూ.రెండున్నర కోట్ల మేర విక్రయాలు

435 పెట్టెల మద్యం అమ్మకాలు

పరకాలలో కోటిపైగానే.. 

నర్సంపేటలో రూ.73 లక్షలు, వర్ధన్నపేటలో రూ.95 లక్షలు


వరంగల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : దసరా పండుగ.. మద్యం షాపులకు కాసుల వర్షం కురిపించింది. ఒక్క రోజులోనే ఏకంగా సుమారు రెండున్నర కోట్ల రూపాయల మేర మద్యాన్ని వరంగల్‌ గ్రామీణ ప్రాంతంలో మందుబాబులు తాగేశారు. దసరా సందర్భంగా వరంగల్‌ జిల్లాలోని 58 మద్యం షాపులు, 8 బార్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. పాత వరంగల్‌ రూరల్‌ జిల్లాలో రోజుకు కోటి రూపాయల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. కొత్తగా వరంగల్‌ నగరం సర్కిల్‌ కలిసినప్పటికీ ఎక్సైజ్‌ శాఖ మాత్రం లైసెన్సు గడువు ముగిసే వరకు పాత పద్ధతిలోనే లెక్కలను చూస్తోంది. 


ఈ దసరాకు ముందు రోజు సాయంత్రం వరకు మద్యం డిపోల నుంచి వ్యాపారులు రూ.2.71 కోట్ల మేర మద్యాన్ని కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే అక్టోబరు నెల ఆరంభం నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు జిల్లాలో రూ.24.23కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఇవే తేదీల్లో రూ.17.59 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఈసారి సేల్స్‌ పెరిగాయి. ఈ 16 రోజుల్లో 24,116 మద్యం పెట్టెలను అమ్మగా, 41,365 కేసుల బీర్లను విక్రయించారు. ఒక్క 16వ తేదీన 2,435 మద్యం పెట్టెలను అమ్మగా, 5,996 బీరు కేసులను అమ్మారు. దసరా సందర్భంగా పరకాలలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. పరకాల సర్కిల్‌ పరిధిలో 22 మద్యం షాపులు, 2 బార్లు ఉండగా, వాటిలో ఒక్కరోజు రూ.1.03కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. పరకాలలో 840 మద్యం పెట్టెలు, 2,762 బీరు కేసులను విక్రయించారు. నర్సంపేటలో ఒక్కరోజులో 652 మద్యం పెట్టెలు, 1,529 బీరు కేసుల విక్రయాలతో మొత్తం రూ.72.74లక్షల మేర అమ్మకాలు జరిగాయి. ఇక వర్ధన్నపేటలో 943 పెట్టెల మద్యం, 1,705 కేసుల బీర్ల  విక్రయాలు జరగ్గా, ఒక్క రోజులో రూ.95.22లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇలా ఒక్క రోజులో జిల్లా వ్యాప్తంగా రూ.2.71కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. 


16 రోజుల్లో రూ.24.23 కోట్లు

లైసెన్సులు ముగియడానికి మరో రెండు నెలల వ్యవధి ఉండగా ఈ అక్టోబరు మాసంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా గత 16 రోజుల్లో రూ.24.23 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 24,116 మద్యం పెట్టెలు అమ్మగా, 41,365 కేసుల బీర్లను జిల్లాలో విక్రయించారు. నర్సంపేట సర్కిల్‌ పరిధిలో 5,780 మద్యం బాక్సులు, 12,045 బీరు కేసులను విక్రయంచగా రూ.6.41కోట్ల అమ్మకాలు జరిగాయి. పరకాల సర్కిల్‌ పరిధిలో 10,807 మద్యం బాక్సులు, 17,630 బీరు కేసుల విక్రయాలతో పరకాలలో రూ.10.57కోట్ల అమ్మకాలు జరిగాయి. వర్ధన్నపేటలో 7,529 మద్యం బాక్సులు, 11,690 బీరు కేసులను విక్రయించగా, రూ.7.24 కోట్ల అమ్మకాలు జరిగాయి. జిల్లాలో మూడు సర్కిళ్లు ఉండగా, పరకాల సర్కిల్‌లో మాత్రమే మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్టు అధికారుల  గణంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పొల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరులో పరకాలలో పది శాతం మద్యం అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది.


ఇక రెండు నెలల సేల్స్‌పై దృష్టి

మరో 50రోజుల్లో మద్యం షాపుల లైసెన్సుల గడువు ముగియనుంది. దీంతో మద్యం వ్యాపారులు సేల్స్‌పై దృష్టి సారించారు. ఇప్పటికే లైసెన్సు ఫీజు అధికంగా ఉండడం, కరోనా కారణంగా రెండు నెలల వ్యాపారం దెబ్బతినడంతో ఈ లోటును భర్తీ చేయడానికి సిండికేట్‌గా మారిపోయారు. దసరా రోజు ఎమ్మార్పీ కంటే అదనంగా రేటు పెంచి విక్రయించారు. మరో రెండు నెలలే గడువు ఉండడంతో లైసెన్సు ఫీజులను దండుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. వరంగల్‌ నగరంతో పాటు మిగిలిన మూడు ప్రాంతాల్లో సిండికేట్‌గా మారి ఇప్పటికే అమ్మకాలను రెట్టింపు చేసుకుంటున్నారు. గ్రామాల్లో బెల్టుషాపులకు ఆఫర్లు ఇస్తూ తమ ఏరియాలోకి మరో ఏరియాకు చెందిన సరుకులు రాకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం.