జాతరల్లో కరోనా కోరలు

ABN , First Publish Date - 2022-01-21T05:56:06+05:30 IST

జాతరల్లో కరోనా కోరలు

జాతరల్లో కరోనా కోరలు

 పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు   

 పోలీసు, వైద్య సిబ్బందికి పాజిటివ్‌

ఐనవోలు/భీమదేవరపల్లి, జనవరి 20: ఐనవోలు మల్లికార్జునస్వామి, కొత్తకొండ శ్రీవీరభద్రస్వామి జాతరల్లో కరోనా పంజా విసిరింది. కరోనావ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం అంక్షలు విధించినప్పటికీ వేలాదిగా తరలివచ్చిన భక్తులను కట్టడి చేయడంలో ఆంక్షలు అమలు కాలేదు. ఐనవోలులో ఇప్పటికే పోలీస్‌ అధికారులు, సిబ్బంది, వైద్యులు, సిబ్బంది కరోనా బారినపడి హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. జాతరలో విధులు నిర్వహించిన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏడుగురికి, క్యాంప్‌ నిర్వహించిన వైద్యులు, సిబ్బంది ఐదుగురు, ఆలయ సిబ్బంది ముగ్గురు పరీక్షలు చేసుకోవడంతో పాజిటివ్‌ రావడంతో చికిత్స పొందుతున్నారు. స్థానికులతోపాటు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఆలయం ప్రాంగణంలో, కిరాణం, హోటళ్లు, షాపులు పదుల సంఖ్యలో ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. సంక్రాంతి నుంచి ఉగాదివరకు వీరు వ్యాపారం నిర్వహిస్తారు. వీరిలో చాలామంది  కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఒగ్గు పూజారులు కూడా పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహాజాతర ముగిసి వారాంతపు జాతరలు ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో కరోనా వ్యాప్తి జరుగకుండా పరీక్షలు జరిపి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో ఐనవోలు పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా 140 మందిలో 80 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.  

 కొత్తకొండ శ్రీవీరభద్రస్వామి దేవాలయంలో కరోనా కలకలం రేపుతోంది. పది రోజులుగా కొత్తకొండ శ్రీవీరభదస్వామి దేవాలయంలో బ్రహ్మత్సవాలు, పెద్ద ఎత్తున జాతర జరిగింది. దీని కి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. గురువారం కొత్తకొండ దేవాలయంలో కరోనా పరీక్షలు నిర్వహించగా చైర్మన్‌ మాడిశెట్టి కుమారస్వామితోపాటు మరో ముగ్గురి సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేవాలయంలో మిగతా సిబ్బందితో పాటు భక్తులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మండలంలో కరోనా పరీక్షలు నిర్వహించగా 38 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

గ్రామాల్లో..

 కమలాపూర్‌: మండలంలోని ఉప్పల్‌, కమలాపూర్‌లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలలోని గ్రామాల్లో గురువారం 53 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. కమలాపూర్‌లోని యుపీహెచ్‌సీలో 295 మందికి రాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు చేయగా వారిలో 47 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందన్నారు. వారిలో ఒక్క లక్ష్మీపురంలోనే 17 మంది ఉన్నారన్నారు. అలాగే ఉప్పల్‌ పీహెచ్‌సీలో 106 మందికి పరీక్షలు చేయగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు.

 దామెర: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కరోనా విజృంభిస్తోంది. గురువారం దామెర పీహెచ్‌సీ పరిధిలో 220 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శిరీషతో పాటు మండల పరిధిలోని మరో 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఇన్‌చార్జి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వనజ పేర్కొన్నారు.

Updated Date - 2022-01-21T05:56:06+05:30 IST