ఒక్కరోజే.. 209 కేసులు

ABN , First Publish Date - 2021-04-17T06:02:39+05:30 IST

ఒక్కరోజే.. 209 కేసులు

ఒక్కరోజే.. 209 కేసులు
నెక్కొండలో టెస్టుల కోసం వచ్చిన ప్రజలు

భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌

జిల్లాలో మొత్తం 961 యాక్టివ్‌ కేసులు

ఆస్పత్రులకు పరుగులు

భయాందోళనలో ప్రజలు


ఆంధ్రజ్యోతి - వరంగల్‌ రూరల్‌

అంతా అనుకున్నట్టే అయింది. కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాను కుదిపేస్తోంది. ఒక్కరోజులో 209పాజిటివ్‌ కేసులు రావడంతో కలకలం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 1,744 మందికి పరీక్షలు చేయగా వారిలో 209 మందికి పాజిటివ్‌ అని తేలింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,51,325 మందికి పరీక్షలు నిర్వహిస్తే వారిలో 7,920 పాజిటివ్‌ కేసులు వరకు వచ్చాయి. కరోనా కలకలం మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క రోజులో 209 పాజిటివ్‌ కేసులు వచ్చింది లేదు. సెకండ్‌ వేవ్‌ మొదలైన నాటి నుంచి డబుల్‌ డిజిట్‌తోనే కేసులు పెరిగాయి. తాజాగా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడు అంకెలకు చేరడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో మొదటి వేవ్‌లో పాజిటివ్‌ కేసు నమోదు కావడానికి నెలరోజుల వ్యవధి పట్టింది. రాష్ట్రమంతా విస్తృతంగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నా, జిల్లాలో మాత్రం అప్పట్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవడానికి జనం ఆస్పత్రులకు తరలివస్తున్నారు. కరోనా లక్షణాలు లేకుండా వస్తుందని ప్రచారం ఎక్కువ కావడంతో జలుబు, జ్వరం లాంటిది రాగానే ఆస్పత్రికి పరుగులు తీసుకున్నారు. జిల్లాలో ఎలాంటి శుభ కార్యక్రమాలు మౌఢ్యం కారణంగా జరుగడం లేకపోయినా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్తుండడంతో ప్రజలు మరింత భయంతో వణికిపోతున్నారు. 


వ్యాక్సిన్‌ కోసం వస్తే.. 

జిల్లాలో ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదు వెనుక మరో కారణం ఉంది. ఇన్నాళ్లూ వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్న ప్రజలు రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండడం, మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు చూసిన వాళ్లు వ్యాక్సిన్‌ కోసం ఆస్పత్రులకు వస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసే ముందు ఆస్పత్రి సిబ్బంది యాంటీజెన్‌ టెస్టులను నిర్వహిస్తుండడంతో పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 1,648 యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించగా వారిలో 209 మందికి పాజిటివ్‌గా తేలింది. 


జిల్లాలో 977 యాక్టివ్‌ కేసులు

కరోనా ఆరంభమైన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో 977 యాక్టివ్‌ కేసులు నమోద య్యాయి. శుక్రవారం ఒక్కరోజే 209 కేసులు నమోదు కాగా, గురువారం 208, బుధవారం 135, మంగళవారం 49 కేసులు నమోదు అయ్యాయి. రెండు రోజులుగా ఎక్కువ పరీక్షలు చేస్తుం డడంతో కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులంటున్నారు. నర్సంపేట(బాంజీపేట) 179, సంగెం మండలంలో 96, ఆత్మకూరు 4, దామెర63, శాయంపేటలో 27, రాయపర్తి(పరకాల) 35, గీసుగొండ 93, పర్వతగిరి 89, రాయపర్తి 54, నెక్కొండ 79, అలంకానీపేట 6, చెన్నారావుపేట 77, నల్లబెల్లి 24, మేడపల్లి 10, ఖానాపూర్‌ 21 దుగ్గొండి 18, కేశవపురం 16 కేసుల చొప్పున ఆక్టీవ్‌ కేసులున్నాయి. 



Updated Date - 2021-04-17T06:02:39+05:30 IST