పోలీసులు పట్టించుకోవడం లేదని..

ABN , First Publish Date - 2020-11-25T08:13:21+05:30 IST

తమపై దాడి చేసినవారికే గీసుగొండ పోలీసులు మద్దతు తెలుపుతున్నారని, తమకు న్యాయం చేయాలని ఖిలావరంగల్‌ మండలం వసంతాపూర్‌లో దాడికి గురైన బాధితులు ఆందోళన చేపడ్టారు.

పోలీసులు పట్టించుకోవడం లేదని..

న్యాయం కోసం వసంతాపూర్‌ బాధితుల ధర్నా

సీపీ కార్యాలయం ఎదుట బైఠాయింపు

 

వరంగల్‌ అర్బన్‌ క్రైం, నవంబరు 24: తమపై దాడి చేసినవారికే గీసుగొండ పోలీసులు మద్దతు తెలుపుతున్నారని, తమకు న్యాయం చేయాలని ఖిలావరంగల్‌ మండలం వసంతాపూర్‌లో దాడికి గురైన బాధితులు ఆందోళన చేపడ్టారు. ఈ మేరకు మంగళవారం వరంగల్‌ సీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. హెడ్‌క్వార్టర్‌ జంక్షన్‌ వద్ద రెండు గంటల పాటు ఆందోళన చేపట్టడడంతో హన్మకొండ- కరీంనగర్‌ రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. 


ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. గుండెకారి జగదీశ్వర్‌రావు, గుండెకారి బాబురావుల కుటుంబాల మధ్య చాలా రోజులుగా భూవివాదం నెలకొందని, దీనిపై ఈనెల 8న  గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశామని బాబురావు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి పోలీసులు కేసు నమోదు చేయకుండా భూ ఆక్రమణకు పాల్పడిన జగదీశ్వర్‌రావుకు మద్దతుగా మాట్లాడినట్టు బాధిత కుటుంబీకులు శోభ, రాజేశ్‌, పద్మ, చిన్ని, రవి, ఎల్లయ్య ఆరోపించారు. కేసు ఎందుకు జాప్యం చేస్తున్నారని స్థానిక సీఐని ప్రశ్నిస్తే ‘ఇంకా పది రోజుల వరకు అరెస్టు చేయను.. దిక్కున్న చోట చెప్పుకోండి’ అని జవాబిచ్చినట్టు వారు పేర్కొన్నారు. దీంతో భూమి విషయమై సోమవారం జగదీశ్వర్‌రావు ఇంటికి వెళ్లిన తమపై కర్రలతో చితకబాదినట్టు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉదయం పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే సాయంత్రం వరకు పట్టించుకోలేదని, అంతేకాకుండా దాడిచేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని ధర్నాకు దిగినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 


కాగా, కమిషనరేట్‌ కార్యాలయం ఎదుట వసంతాపూర్‌కు చెందిన సుమారు 200 మంది ధర్నా చేస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు.. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. బాధితుల వద్దకు గీసుగొండ సీఐ శివరామయ్య రావడంతో ఒక్కసారిగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు స్పెషల్‌ పార్టీ పోలీసులను దింపారు. డీసీపీతో మాట్లాడిస్తానని హన్మకొండ సీఐ చంద్రశేఖర్‌ హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేయగా తప్పకుండా న్యాయం చేస్తానని హామి ఇచ్చినట్టు బాధితులు తెలిపారు. కాగా ఈ ఘటనపై మామునూరు ఏసీపీ, గీసుగొండ సీఐలతో పోలీసు అధికారులపై డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Updated Date - 2020-11-25T08:13:21+05:30 IST