సౌకర్యాలు ఫుల్‌ .. సిబ్బంది నిల్‌

ABN , First Publish Date - 2021-04-17T04:52:56+05:30 IST

వైద్యాధికారులను, వైద్య సిబ్బందిని నియమించి సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సౌకర్యాలు ఫుల్‌ .. సిబ్బంది నిల్‌

 రోగులు వంద మంది ... డాక్టర్‌ ఒక్కరే   ఇదీ సామాజిక ఆరోగ్యకేంద్రం పరిస్థితి

నిడదవోలు, ఏప్రిల్‌ 16: పేదవాడికి వైద్యం అందుబాటులో ఉంచామని, ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు ఇక నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రు తర హాలో సేవలు అందిస్తాయని ప్రభు త్వంలోని పెద్దల మాట. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా ఉన్నది. కోట్లు పెట్టి పక్కా భవనం నిర్మించి అధునాతన వైద్య పరికరా లు అందుబాటులో ఉన్నా వైద్య సేవలు అందించేందుకు వైద్యుల కొరత కారణంగా పేదలు అవస్థలు పడుతున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఇదేదో మారుమూల పల్లెల్లో ఉన్న విషయం కాదు. నిడదవోలు నియోజకవర్గానికి ముఖ్యకేంద్రం నిడదవోలు పట్టణం. ప్రభుత్వ ఆసుపత్రిగా అరకొర సేవలతో వైద్య సేవలు అందిస్తున్న ప్రాఽథమిక వైద్య కేంద్రాన్ని గత ప్రభుత్వం హయాంలో 30 పడకల ఆసుపత్రిగా మార్పులు చేసి సామాజిక ఆరోగ్యకేంద్రంగా 297.00 లక్షల రూపాయలతో 2016లో నూతన భవనాన్ని అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ ప్రాథమిక వైద్య కేంద్రంలో నిడదవోలు పట్టణంతో పాటు చుట్టు పక్కల 23 గ్రామాల నుంచి రోజుకు సుమారుగా 150 మంది వరకు ఔట్‌ పేషెంట్లు సేవలు పొందుతుండగా 15 నుంచి 20 మంది వరకు ఇన్‌ పేషెంట్‌లు సేవలు పొందుతున్నారు. 24/7 సేవలు అందించే స్థాయి నిడదవోలు సామాజిక ఆరోగ్యకేంద్రానికి ఉన్నది.

 వైద్యులు, సిబ్బది కొరత

ఈ ఆసుపత్రిలో ఒక డిప్యూటి సివిల్‌ సర్జన్‌, నలుగురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ (ఇందులోనే ఒకరు మత్తు డాక్టర్‌) మరొకరు డెంటల్‌ డాక్టర్‌ మొత్తం ఆరుగురు వైద్యులు ఉండాల్సి ఉండగ ఒకే ఒక్క గైనకాలజిస్ట్‌ మాత్రమే ఈ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. ఒక పక్క ఔట్‌ పేషెంట్లు, మరో పక్క ఇన్‌ సేషెంట్లు ఇవి కాక ఎమర్జెన్సీ యాక్సిడెంటు కేసులు వీటికి తోడు నెలకు పది నుంచి పదిహేను వరకు వివిధ కారణాలతో మరణించిన మృతదేహా లకు పోస్టుమార్టం చేయడం అన్నిటికి ఒక్కరే డాక్టర్‌ ఉన్నారు. పోనీ వైద్య సిబ్బంది అయినా పూర్తి స్థాయిలో ఉన్నారా అంటే అదికూడా కొరతే. హెడ్‌ నర్సు ఒక పోస్టు ఉండగా ఇక్కడ ఒక్కరు కూడా లేరు. స్టాఫ్‌ నర్సులు ఏడుగురు ఉండాల్సి ఉండగా ఇద్దరే ఉన్నారు. దీంతో రోగుల పాట్లు దేవుడికెరుక అన్నట్లు ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖాధికారులు స్పందించి నిడదవోలు సామాజిక ఆరోగ్యకేంద్రం (ప్రభుత్వ ఆసుపత్రి)కు పూర్తి స్థాయిలో వైద్యాధికారులను, వైద్య సిబ్బందిని నియమించి సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-04-17T04:52:56+05:30 IST