అమ్మో..జ్వరం

ABN , First Publish Date - 2022-08-14T05:02:01+05:30 IST

మారిన వాతావరణంతో జిల్లా పలు చోట్ల జ్వరాల వ్యాప్తి చెందుతున్నాయి.

అమ్మో..జ్వరం

 జిల్లాలో విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు
వాతావరణ మార్పులు, దోమలు, నీటి కాలుష్యమే  ప్రధాన కారణాలు


భీమవరం, ఆగస్టు 13 : మారిన వాతావరణంతో జిల్లా పలు చోట్ల జ్వరాల వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు జ్వరాల బారినపడుతున్నారు. భీమవరంలో ఏ పిల్లల  ఆస్పత్రిలో చూసిన వైరల్‌ జ్వర పీడితులు కనిపిస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో పరిస్థితి తీవ్రత పెరిగింది. ఇటీవల వరదలు వచ్చి తగ్గిన ప్రాంతాల్లో మలేరియా కేసులు అక్కడక్కడా నమోదవుతున్నట్టు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సమాచారం అందుతోంది. పట్టణ ప్రాంతాల్లో టైఫాయిడ్‌, సాధారణ జ్వరాలు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, పరిసరాల శుభ్రత లోపించడం, దోమల బెడద, నీటి కాలుష్యం తదితర కారణాలతో జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన తల నొప్పి, చలి, వణుకు విడవకుండా వచ్చే జ్వరం, వాంతులు ఉంటే మలేరియా పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. పెద్దలకు ఒళ్ళు నొప్పు లు, తలనొప్పి, కాళ్ళ వాపు, నీరసం వరుసగా రెండు రోజులు తగ్గకపోతే ఆస్పత్రికి వెళ్ళి వైద్యుడి సలహాతో డెంగీ పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని సూచిస్తున్నారు.
పిల్లల పట్ల జాగ్రత్త వహించండి
వైరల్‌ జ్వరాలు బాగా పెరిగాయి. వారం, పది రోజులు ఇబ్బంది పెడతాయి. పిల్లలు జ్వరాల బారిన పడితే జాగ్రత్తలు తీసుకోవాలి. డయేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించాలి.
– డాక్టర్‌ ముదునూరి గోపాలకృష్ణంరాజు, చిన్నపిల్లల స్పెషలిస్టు, భీమవరం.
 
 వైఎస్‌ పాలెంలో వైరల్‌ ఫీవర్స్‌
నరసాపురం, ఆగస్టు 13: మండలంలోని వైఎస్‌ పాలెం పంచాయతీలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటి లో ఒక్కరిద్దరు జ్వరంతో మంచం పడుతున్నారు. కొందరు పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే, మరి కొందరు ఇంటి వద్దే ప్రాఽథమిక వైద్యం తీసుకుంటున్నారు.  ఈ క్రమంలో గ్రామ సర్పంచ్‌ నాగముత్యామాంబ ఆరోగ్య సిబ్బంది తో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఇంటింటా సర్వే చేయాలని ఏఎన్‌ఎంలను అదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలో పంట పొలాలు దెబ్బతిన్నాయి. నీరు బయటకు వెళ్లే మార్గం లేక నారుమడులు నీటిలో కుళ్లిపోయా యి. నివాసాలకు చేలు దగ్గరగా ఉండడంతో దోమల బెడద గ్రామంలో ఎక్కువైయింది. ఈ కారణంగానే అనారోగ్యాల బారినపడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. దీనిపై డిప్యూ టీ డీఎంహెచ్‌వో ప్రసాద్‌ను వివరణ కోరగా వైరల్‌ జ్వరాల విషయం తన దృష్టికి రాలేదన్నారు. విచారించి గ్రామంలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - 2022-08-14T05:02:01+05:30 IST