దొంగలొచ్చారు.. జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-09-03T05:36:50+05:30 IST

జిల్లాలో ఇటీవల వరుస దొంగతనాలు అటు ప్రజలకు ఇటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

దొంగలొచ్చారు.. జాగ్రత్త!

భారీగా పెరిగిన చోరీలు
తాళం వేసి  ఊరెళ్లారో.. ఇల్లు లూటీ చేసేస్తున్నారు..
రెక్కీ చేసి.. మరీ దోపిడీలు
లబోదిబోమంటున్న ప్రజలు
పెరిగిన కేసులతో పోలీసులు సతమతం


జిల్లాలో ఇటీవల వరుస దొంగతనాలు అటు ప్రజలకు ఇటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం ఏదో ప్రాంతంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి దోచుకెళ్లిపోతున్నారు. ముందుగా ఏదో ఒక వస్తువులు విక్రయాలు చేస్తున్నట్టు ఆ ఏరియాల్లో తిరిగి తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తున్నారు. అనంతరం ఆన్‌లైన్‌లో వస్తువులు వచ్చాయంటూ ఆ ఇంటి వద్దకు వచ్చి చుట్టుపక్కల వారిని ఈ ఇంట్లో వారు లేరా.. అని ఆరా తీసి అనంతరం రాత్రిపూట వారి పని కానిచ్చేస్తున్నారు. ఇటీవల వరుస చోరీలు సర్వసాధారణంగా మారింది.

 
భీమవరం క్రైం, సెప్టెంబరు 2 :  కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన కొద్దిరోజులకు ఉండిలోని ఒక బంగారు దుకాణం తాళాలు బద్దలు కొట్టి వందల కేజీల వెండి వస్తువులు దోచుకెళ్లారు. పోలీసులు ఆ దొంగలను పట్టుకుని చోరీ సొత్తు రికవరీ చేశారు. అది మరువక ముందే ఇటీవల తాడేపల్లిగూడెం, పెనుమంట్ర, మహాదేవపట్నం గ్రామాల్లో వరుస చోరీలు జరిగాయి. ఆ కేసుల్లో చాలావరకు దొంగలను పట్టుకున్నారు. వారం క్రితం భీమవరం టూ టౌన్‌లోని శ్రీరాంపురంలో వృద్ధ దంపతులు నిద్రిస్తుండగా ఇంట్లోకి చొరబడి 70 కాసుల బంగారం, రూ.8 లక్షల నగదు దోచుకెళ్లారు. గురువారం వీరవాసరం మండలం పెర్కిపాలెంలో 40 కాసులు బంగారం చోరీకి గురైంది.  ఆకివీడులో 3 కాసుల బంగారం, 55 వేల నగదు దోచేశారు. ఇలా నెల రోజుల వ్యవధిలోనే పలు చోరీలు జరగడంతో పోలీసులే విస్తుపోయే పరిస్థితి నెలకొంది. ఇది పాత నేరస్తుల పనా.. లేక ఎవరైనా తెలిసిన వారు చేస్తున్నారా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

జైళ్లలో పరిచయాలు..
చాలా మంది నేరస్తులు ఏదో ఒక కేసులో పట్టుబడి జైలుకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న నేరస్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. వారు బయటకు వచ్చాక ప్లాన్‌లు వేసి ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నారు. నింది తులు దూరప్రాంతాల వారు కావడంతో పోలీసులకు కేసులు ఛేదించడం ఇబ్బందికరంగా మారుతోంది. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊరు వెళితే సమీప పోలీస్‌స్టేషన్‌లో తెలపాలని, అప్పుడు లాక్ట్‌ మోనటరింగ్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌ఎంఎస్‌)ను అమర్చుతామని గతంలో పోలీసులు ఎన్ని రకాలుగా చైతన్యపరిచారు. చాలా మంది వినియోగించుకున్నారు. ఏలూరు జిల్లా ఏలూరులో ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కేవలం 6 నిమిషాల్లో దొంగలను అప్పట్లో పోలీసులు పట్టుకున్నారు. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నివాసాల్లో విలువైన బంగారం, నగదు ఉంచిన తాళాలు వేసి ఊర్లు వెళుతున్నారు. దీంతో దొంగలకు తమ పని సులువవుతోంది.

విలువైన వస్తువులు జాగ్రత్త
  – రవిప్రకాశ్‌, ఎస్పీ
చాలామంది విలువైన వస్తువులను నివాసాల్లో ఉంచి ఇంటికి తాళాలు వేసి ఊరు వెళుతున్నారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో జాగ్రత్త పర్చుకోవాలి. సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇస్తే వారు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ (లాక్‌ మానటరింగ్‌ సిస్టమ్‌)ను ఏర్పాటు చేస్తారు. వరుస చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. గస్తీ ముమ్మరం చేస్తున్నాం. ఎక్కువగా పాత నేరస్తులు, కొత్తవారు కలిసి చోరీలు చేస్తున్నారు. అలాంటి వారందరిపై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేశాం.
   
 ఆకివీడులో తాళాలు పగులకొట్టి..
ఆకివీడు, సెప్టెంబరు 2: ఆకివీడులో ఓ దొంగ ఇంటి తాళాలు పగులుకొట్టి నగదు, బంగారం చోరీ చేశాడు. స్థానిక వివేకానందనగర్‌ కాలనీలో అద్దెకు ఉంటున్న కలిదిండి కృష్ణంరాజు–పద్మ దంపతులు ఢిల్లీలో ఉంటున్న కుమార్తె– అల్లుడు వద్దకు వెళ్లారు. గతనెల 30వ తేదీ మంగళవారం అర్ధరాత్రి కృష్ణంరాజు నివాసం పక్క ఇల్లు కూడా తాళాలు వేసి ఉండగా ఒక దొంగ పగులకొట్టడానికి ప్రయత్నిం చగా రాలేదు. దాంతో కృష్ణంరాజు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ పాల్పడ్డాడు.  కాగా ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఎదురింటి మహిళ చూసి ఢిల్లీలోని వారికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటీన విమానంలో బయల్దేరి బుధవారం రాత్రికి ఇక్కడకు చేరుకున్నారు. మూడు కాసుల బంగారం, రూ.55 వేలు నగదు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణంరాజుకు చెందిన మోటారు సైకిల్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినా పెట్రోలు లేకపోవడంతో దొంగ వదిలేశాడు. సమీపంలోని ఇంటి సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా మొఖానికి మాస్క్‌ ధరించి వ్యక్తి దొంగతనం చేసినట్టు గుర్తించారు. శుక్రవారం స్పెషల్‌ బ్రాంచి, మహిళా పోలీసులు వివరాలు సేకరించారు. పద్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బీవై కిరణ్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

పెన్నాడలో 5.5 కాసుల బంగారం చోరీ
పాలకోడేరు, సెప్టెంబరు 2: పెన్నాడలో శుక్రవారం తెల్లవారుజామున బంక నాగమణి  నివాసంలో చోరీ జరిగినట్టు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి బీరువాను తెరచి ఐదున్నర కాసుల బంగారాన్ని దొంగిలించాడు. ఆ సమయంలో చప్పుడు కావడంతో లేచి చూసేసరికి దొంగ పారిపోయాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.   
 
దారి దోపిడీ దొంగల అరెస్టు

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 2: రాత్రి సమయంలో దారి కాసి ఒంటరిగా వెళ్తున్న వారిని అడ్డ గించి  దోచుకునే దొంగలను తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీ సులు పట్టుకున్నారు.  పోలీసులు తెలిపిన వివరాలివి.. తాడేపల్లిగూడెం రూరల్‌ స్టేషన్‌ పరిధిలోని ముత్యాలంబ పురం సమీపంలోని రోడ్డులో  జూలై 20న తాడేపల్లిగూడెం కు చెందిన గాఢా త్రిమూర్తులు చేపల చెరువు వద్దకు వెళ్తుండగా బుల్లెట్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి డబ్బులు లాక్కుని పారిపోయారు. ఆగస్టు 29న ఓ వ్యక్తి జాతీయ రహదారి వద్ద తన కుమారుడి కోసం ఎదురు చూస్తుండగా ఎన్‌ఫీల్డ్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగా రపు ఉంగరం లాక్కుని పారిపోయారు. ఈ ఫిర్యాదులపై ఎస్పీ రవి ప్రకాశ్‌, డీఎస్పీ రవికుమార్‌ ఆదేశాల మేరకు సీఐ ఎస్‌వీవీఎస్‌ మూర్తి పర్యవేక్షణలో ఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాస్‌, సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచారు. ముత్యాలంబపురం లక్కీ రోడ్‌లైన్స్‌ సమీ పంలో అనుమానాస్పదంగా కన్పించిన పిప్పరకు చెందిన గరగ శివకృష్ణ, మల్లిపూడి వెంకన్న బాబును శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించగా తాము చేసిన నేరాలను అంగీకరిం చారు. వారి నుంచి  ఉంగరం, యాక్టివా స్కూటీ, రూ.52 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. కేసులను ఛేదించిన ఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాస్‌, ఏఎస్‌ఐ దుర్గారావు, కానిస్టేబుళ్లు ఎం.సుబ్ర హ్మణ్యం, కె.కృష్ణప్రసాద్‌లను ఎస్పీ ఫోన్‌లో అభినందిం చారు. కానిస్టేబుళ్లు సుబ్రహ్మణ్యం, కృష్ణప్రసాద్‌లకు సీఐ రివార్డులు అందించారు.

31 బైక్‌లను కొట్టేశాడు..
తణుకు, సెప్టెంబరు 2: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని తణుకు పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్‌ వద్ద జిల్లా ఎస్పీ యు.రవిప్రకాశ్‌ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాపులపాలెంకు చెందిన దేవర పెద్దిరాజు మోటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.18 లక్షల విలువ గల 31 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పెద్దిరాజును కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌ విధించారు. ఈ సందర్భంగా సీఐ ముత్యాల సత్యనారాయణ, ఏఎస్‌ఐ బి.పోలయ్యకాపు, హెచ్‌సీ ఎం.సత్యనారాయణ, కానిస్టేబుళ్లు జి.శ్రీనివాసు, గోవిందరావు, మహమ్మద్‌ సిరాజుద్దీన్‌, వెలగేశ్వరరావులను ఎస్పీ అభినందించారు.

Updated Date - 2022-09-03T05:36:50+05:30 IST