భయం.. భయంగా..

ABN , First Publish Date - 2021-02-27T05:46:50+05:30 IST

నిన్నటి వరకూ పచ్చని పొలాల మధ్య ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామం.. శుక్రవారం వార్తలకెక్కింది.

భయం.. భయంగా..
నిర్మానుష్యంగా మత్స్యపురి గ్రామం

మత్స్యపురిలో వైసీపీ, జనసేన నాయకుల కొట్లాట 

ఇళ్లు, వాహనాలపై రాళ్ల దాడులు.. ఆందోళనలో గ్రామస్థులు

నరసాపురంలో పోలీసులకు ఏడు ఫిర్యాదులు


వీరవాసరం/నరసాపురం/భీమవరం, ఫిబ్రవరి 26 : నిన్నటి వరకూ పచ్చని పొలాల మధ్య ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామం.. శుక్రవారం వార్తలకెక్కింది. రెండు పార్టీల మధ్య కొట్లాట.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది. వీరవాసరం మండలం మత్సపురి గ్రామంలో జనసేన ర్యాలీ తీవ్ర ఉదిక్తతలకు దారి తీసింది.  పంచాయతీ ఎన్నికల్లో 14 వార్డులకు 12 జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారు. సర్పంచ్‌ అభ్యర్థిగా కారేపల్లి శాంతిప్రియ 900 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో శాంతిప్రియ, జనసేన మద్దతుదారులు గురువారం రాత్రి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసేందుకు ర్యాలీగా కదిలారు. మార్గమధ్యలో జనసేన, వైసీపీ శ్రేణుల మధ్య వివాదం తలెత్తింది. ఇళ్లపై రాళ్లతో దాడిచేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళితే వైసీపీ అడ్డుకుందని జనసేన మద్దతుదారులు చెబుతుండగా, అంబేడ్కర్‌కు చెప్పులదండ వేస్తుంటే అడ్డుకున్నామని వైసీపీ నాయకులు చెబుతుండడం మరింత వివాదస్పదమైంది. పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు. బాధితులకు న్యాయం జరగకపోతే నియోజకవర్గస్థాయిలో చలో మత్స్యపురి నిర్వహిస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ హెచ్చరించారు. జనసేన నాయకులు మద్దతుదారులు శుక్రవారం నరసాపురం డీఎస్పీ, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏడుగురు ఫిర్యాదుచేశారు. మరోవైపు దళిత మహిళకు న్యాయం చేయాలంటూ భీమవరం నియోజకవర్గ దళిత ఐక్యవేదిక గ్రామంలో ర్యాలీ చేసి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనకు దిగింది.


రాష్ట్రంలో రాక్షస పాలన : జనసేన 

రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనం మత్స్యపురిలో జరిగిన దాడులేనని జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడు బొమ్మిడి నాయకర్‌, భీమవరం ఇన్‌ఛార్జ్‌ కె.గోవిందరావు, మహిళా నాయకురాలు ఘంటశాల వెంకటలక్ష్మి, సర్పంచ్‌ ఆర్‌.శాంతి ప్రియ విలేకరులకు తెలిపారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీను పగలు మహనీయుడిలా రాత్రి గూండాలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అపజయాన్ని జీర్ణించుకోకుండా దాడులు సరికాదన్నారు. అనంతరం మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. మీకు వ్యతిరేకంగా పోటీ చేస్తే ఇళ్లపైకి వచ్చి దాడులకు తెగబడతారా? ఎమ్మెల్యేనే స్వయ ంగా వచ్చి, 200 మందికిపైగా గూండాలు, రౌడీలతో దాడులు చేస్తారా..? అని పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వేగేశ్న కనకరాజు సూరి, నియోజకవర్గం ఇన్‌చార్జి కొటికలపూడి గోవిందరావు(చినబాబు), పట్టణాధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్‌, మండలం అధ్యక్షుడు బండి రమేష్‌కుమార్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. ఇలాంటి దాడులకు జనసేన భయపడదని,ఇది దళితులు, అగ్నికుల క్షత్రియుల ఆత్మ గౌరవ సమస్యని..బాధితులకు అండగా ఉంటామన్నారు. 


జనసైనికుల అరాచకాలు పెరిగాయి : గ్రంధి

జనసేన వచ్చాక నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల అరాచకాలు ఎక్కువయ్యాయని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శిం చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఏ విధంగా విజయోత్సవ ర్యాలీ చేస్తారు. దళితవాడలకు వెళ్లి మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వారి ఇళ్లకు నిప్పు పెట్టాలని ప్రయత్నించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి చెప్పుల దండలు వేసి రాజ్యాంగాన్ని అవమానపరిచారు. వైసీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లి దాడులు చేశారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన నాపైన దాడులకు ప్రయత్నించారు’ అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు.







Updated Date - 2021-02-27T05:46:50+05:30 IST