బదిలీలపై సహ‘కారం’

ABN , First Publish Date - 2022-09-23T05:31:49+05:30 IST

సహకార సంఘాల ఉద్యోగుల బదిలీల వ్యవహారం ఆందోళనకు దారి తీస్తోంది.

బదిలీలపై సహ‘కారం’

డివిజన్‌, మండల స్థాయి పరిమితం చేయాలంటున్న ఉద్యోగులు
ఇదే ప్రాతిపదికన నెల్లూరు జిల్లాలో బదిలీ నిర్ణయం
ఉమ్మడి పశ్చిమలో కొలిక్కిరాక ఆందోళనలో ఉద్యోగులు

భీమవరం, సెప్టెంబరు 22 : సహకార సంఘాల ఉద్యోగుల బదిలీల వ్యవహారం ఆందోళనకు దారి తీస్తోంది. సొంత ప్రాంతంలోని సహకార ఉద్యోగులు విధులు నిర్వహించడం వల్ల సంఘాల ఆర్థిక పరిపుష్టికి దోహద పడేది. సుమారు 90 ఏళ్ల తర్వాత  ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు, ఉద్యోగులు తర్జనభర్జన గురవుతున్నారు. పరిమితమైన వేతనాలతో పొరుగు ప్రాంతాలకు వెళ్లి అద్దె నివాసాల్లో ఉంటూ విధులు నిర్వహించాలంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉద్యోగులు ఇచ్చిన విజ్ఞప్తుల మేరకు బదిలీలను రాష్ట్రస్థాయిలో కాకుండా ప్రాంతీయ స్థాయిలో పడితే బాగుంటుందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అయితే దీనిపై ఇంతవరకు కసరత్తు
మొదలు కాలేదు. రాష్ట్రంలో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో  బదిలీలను మండలం, సహకార డివిజనల్‌ స్థాయిలకు పరిమితం చేయాలన్న ప్రతిపాదనతో అక్కడ డీసీసీబీ అధికారులు, డీసీసీబీ చైౖర్మన్‌ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే ఆలోచన అన్ని ప్రాంతాల్లో అమలుచేస్తే బాగుంటుందని ఉద్యో గులు కోరుకుంటున్నారు.
సహకార బదిలీల వల్ల రాష్ట్రంలో ఎక్కువగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నష్టపోతుందని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. జిల్లా డీసీసీబీ పరిపాలన ఇంకా ఉమ్మడి జిల్లా పరిధిలోనే పని చేస్తోంది. దీంతో ఈ జిల్లా అంతా ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. గతనెల చివరి వారానికి బదిలీ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలో ఈ వ్యవహారంతో కొంత సందిగ్ధత కొనసాగుతోంది. ఉదాహరణకు ఉమ్మడి 12 జిల్లాల్లో సుమారు 600 కోట్లు డిపాజిట్లు ఉండగా ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని సహకార సంఘాల్లో సుమారు 500 కోట్లు డిపాజిట్లు  ఉన్నాయి. సిబ్బంది బదిలీల ప్రభావం ఈ డిపాజిట్లపై పడుతుంది. కాబట్టి ప్రభుత్వం బదిలీల వ్యవహారం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లా సహకార యంత్రాంగం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Updated Date - 2022-09-23T05:31:49+05:30 IST