మాయాజాలం

ABN , First Publish Date - 2022-09-03T05:34:54+05:30 IST

మార్కెట్‌లో బియ్యం వ్యాపారులు మాయా జాలంతో ధరలు అమాంతం పెరిగిపోయా యి.

మాయాజాలం

వ్యాపారుల కృత్రిమ కొరత
చుక్కలనంటుతున్న బియ్యం ధరలు
నిబంధనలు తప్పించుకునే యత్నాలు
ప్రభుత్వానికి, వినియోగదారులకు కుచ్చుటోపీ

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 2 : మార్కెట్‌లో బియ్యం వ్యాపారులు మాయా జాలంతో ధరలు అమాంతం పెరిగిపోయా యి. నిన్నటి వరకు ఉన్న ధరను అమాంతం పెంచేసి జీఎస్టీ అంటూ మరో పక్క బియ్యం లేవంటూ సాకులు చెబుతున్నారు. బియ్యం వ్యాపారుల తీరుతో ఇటు రిటైల్‌ వ్యాపారులు, మరోపక్క వినియోగదారులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇటీవల వరకు క్వింటా సోనా బియ్యం రూ.4వేలు ఉండగా ప్రస్తుతం రూ.4,900కు విక్రయిస్తు న్నారు. స్వర్ణ రూ.4వేల నుంచి రూ.4,700కు పెరిగింది. దీనికి తోడు కేంద్ర బియ్యం విక్రయాలు 25 కేజీల లోపు ఉంటే జీఎస్టీ చెల్లించాలని మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఆ భారం కూడా వినియోగదారులపై వేసేందుకు సిద్ధమయ్యారు.

జీఎస్టీ మెలికతో ప్రభుత్వానికే టోకరా
వ్యాపారులు కొత్త ఎత్తుగడకు తెర లేపారు. ప్రభుత్వ నిబంధనలకు దొరక్కుండా సాధారణంగా 25 కేజీలు విక్రయించే బస్తా బియ్యం ఒక కేజీ పెంచి 26 కేజీల బస్తాలు సిద్ధం చేశారు.  మార్కెట్‌లో ఈ బియ్యం విక్రయా లకు జీఎస్టీ మినహాయింపు లభించినట్టయింది. గతంలో స్వర్ణరకం కేజీ రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.37కి, సోనామసూరి గతంలో రూ.40 తాజాగా రూ.50కి విక్రయిస్తున్నారు. ఇటు కేజీ బియ్యం పెంపు, బియ్యం ధర పెంపు అంతా కలిసి సామాన్యుల నెత్తిన పిడుగు పడినట్టయింది. పుష్కలంగా లభించే స్వర్ణ, సోనా మసూరి రకం బియ్యం నిల్వలను బడా వ్యాపారులు బ్లాక్‌ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. బియ్యం ధరలు అమాంతం పెంచేసి సామాన్యులపై భారం మోపారు. రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీగా మార్కె ట్‌లోకి బ్రాండెడ్‌ బియ్యం ఎగుమతి చేస్తుంటారు. అక్కడ బియ్యం నిల్వలు బ్లాక్‌ చేసి ధరలు పెంచేశారు. ఇటు వినియోగ దారులు, రిటైల్‌ వర్తకులు ధరలు పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సామాన్యులు ఎలా బతకాలి?
నేను ఓ వస్త్రాల దుకాణంలో పని చేస్తున్నాను. మా కుటుంబంలో సరిపడా నెలకు రెండు బస్తాల బియ్యం కొనుగోలు చేస్తాం. ఒక్కసారిగా బస్తాకు రూ.200కు పైగా ధర పెంచితే  సామాన్యులు ఎలా బతకాలి.  
– వానపల్లి నాగదేవి, వినియోగదారు, తాడేపల్లిగూడెం

 బియ్యం కొనాలంటే భయమేస్తోంది..
నిత్యం కూలిపనులు చేసుకుని బతికే మాకు బియ్యం కొనాలంటేనే భయ మేస్తోంది. బియ్యం 25 కేజీలు కొందా మంటే ధర పెంచేశారు. ఇలా అయితే ఏం తినాలో..
– గొడ్డెళ్ల దుర్గారావు, కొండ్రుప్రోలు

Updated Date - 2022-09-03T05:34:54+05:30 IST