పరిషత్‌ ప్రహసనం

ABN , First Publish Date - 2022-05-19T06:02:17+05:30 IST

స్థానిక సంస్థల్లో రారాజు జిల్లా ప్రజా పరిషత్‌. ఒకప్పుడు కీలక నిర్ణయాల్లో, నిధుల విడుదల్లోనూ అగ్రగామి.

పరిషత్‌ ప్రహసనం

నిధులు, విధులు లేక నైరాశ్యం
మసకబారిన జిల్లా పరిషత్‌ ప్రతిష్ట
ఒకప్పుడు రారాజు.. ఇప్పుడు నిరుపేద
స్థానిక అవసరాలు ఎక్కడికక్కడే
సభ్యుల్లోనూ అసంతృప్తి, ఆందోళన
నీరుగారిన గెలిచిన ఉత్సాహం
ఎప్పుడో సన్నబడిన జడ్పీ చైర్మన్‌ విధులు
ఈ మూడేళ్లల్లో అంతా అధోగతే



స్థానిక సంస్థల్లో రారాజు జిల్లా ప్రజా పరిషత్‌.    ఒకప్పుడు కీలక నిర్ణయాల్లో, నిధుల విడుదల్లోనూ అగ్రగామి. అటువంటి జడ్పీ రానురాను తన  ప్రభ కోల్పోతుంది. చాన్నాళ్లపాటు రావాల్సిన నిధులు రానేరాలేదు. గత 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించలేదు. ఎమ్మెల్యేల పెత్తనం పెరిగింది. జడ్పీ ప్రతిష్ట తగ్గింది. జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారంతా ఇప్పుడు పర్యవేక్షణ లేకుండా కీలక అధికారాలు  చెలాయించలేక చతికిలపడ్డారు.  నిధులు కేటాయింపు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు వరుసలో   ఉండాల్సిన జిల్లా పరిషత్‌కి గడిచిన మూడేళ్లలో  మరింత వన్నె తగ్గింది. ఈ మధ్యనే ఇసుక సీనరైజ్‌ అంతోఇంతో  వస్తుండగా,   మిగతా పనులన్నీ ఎగవేస్తున్నారు.  ఒకప్పుడు కళకళలాడిన పరిషత్‌ ప్రాంగణం  ఇప్పుడు వెలవెలబోతుంది.


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఒకప్పుడు రాజకీయ అధికారిక కేంద్ర బిందువుగా జిల్లా ప్రజా పరిషత్‌  ఒక వెలుగు వెలిగింది. కీలక నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడంలో తొలి వరుసలో నిలిచేది. జడ్పీ చైర్మన్‌ అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. ఉపాధ్యాయుల బదిలీల దగ్గర నుంచి కీలక శాఖల పర్యవేక్షణను ఆయనే చేసేవారు. స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధుల నుంచి విన్నపాలు అందితే క్షణాల్లో ఆ పనులన్నీ కానిచ్చేవారు. మారుమూల రోడ్లు వేయాలన్నా, తరగతి గదుల్లో ఫర్నీచర్‌ సమకూర్చాలన్నా, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందికి వార్నింగ్‌ ఇవ్వాలన్నా జడ్పీ మాత్రమే వేదిక. మంత్రులున్నా, సీనియర్‌ ఎమ్మెల్యేలున్నా జిల్లా పరిషత్‌ వీరందరికీ అతీతంగా ముందుకు దూసుకెళ్ళేది. కాని రాను రాను అధికారాలు మసకబారాయి. నిధుల కేటాయింపు వెను కబడింది. పరిస్థితి అధ్వాన్నంగా మారే స్థాయికి వచ్చింది. ఒకప్పుడు నిత్యం సందర్శకులతో కళకళలాడే పరిషత్‌ ప్రాంగణమంతా ఇప్పుడు వెలవెల బోతోంది. టీచర్ల రిక్రూట్‌మెంట్‌ దగ్గర నుంచి సీన రైజ్‌, వినోద పన్ను తదితర ఇతర పన్నులను వసూ లు చేసేవారు. ఆ మేరకు జనరల్‌ ఫండ్‌ను ఒకింత పెంచి స్థానిక అవసరాలకు ప్రాధాన్యత క్రమంలో వినియోగించేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలకంటే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హోదాలో ఉన్న వారికే అత్యంత గౌరవం లభించేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. 2015లో జడ్పీ చైర్మన్‌ అధికారాలను కాస్తంత సవరించారు. ఈ మేరకు కీలక ప్రభుత్వ విభాగాలైన వ్యవసాయం, గ్రామీణ నీటి పారుదల, విద్య, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణాభి వృద్ధి, పశుసంవర్ధక, మత్స్య శాఖ, బీసీ సంక్షేమం, సాంఘి క సంక్షేమం వంటి కీలక శాఖలను పర్యవేక్షించే అధికా రం జిల్లా పరిషత్‌కు ఉండేది. ఆ మేరకు అప్పట్లో చైర్మన్‌ ఒకింత చొరవ తీసుకుని ఆయా శాఖలను ఎక్కడికక్కడ సమీక్షించేవారు. కాని రానురాను ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు, మంత్రుల పెత్తనంతో జిల్లా పరిషత్‌ కాస్తంత వెనుకబడింది. ఇంతకు ముందు 14వ ఆర్థిక సంఘం వరకు జిల్లా పరిషత్‌, మండల ప్రజా పరిషత్‌ కు నిధులు కేటాయించేవారు కాదు. కాని గడిచిన మూడేళ్లు గా 15వ ఆర్ధిక సంఘం నిధులను జిల్లా పరిషత్‌లకు కేటాయిస్తూ వస్తున్నారు.


రాబడి.. ఎడారైంది
జిల్లా పరిషత్‌ నిర్వహణకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రతీ ఏటా ఒకింత బడ్జెట్‌ను ప్రతిపాదించేవారు. ఆ మేరకు వార్షిక నిధులను పన్నుల రూపంలో రాబట్టేవారు. తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానం ప్రవేశ పెట్టడం వల్ల ప్రతీ ఏటా కోట్లలో వచ్చే ఇసుక సీనరేజ్‌ కాస్తా జీరో అయ్యింది. దీంతో జనరల్‌ ఫండర్‌కు వచ్చే నిధుల వరద పూర్తిగా తగ్గు ్గముఖం పట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తేశారు. ఆ స్థానంలో రీచ్‌ల వారీగా కొన్నాళ్లపాటు వేలం వేయడం, మరికొన్నాళ్లు వేరే సంస్థకు ఇవ్వడంతో ఇసుక సీనరైజ్‌ కింద ఈ మధ్యనే జడ్పీకి కాసింత కాసులు రాలినట్టయ్యింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇసుక సీనరైజ్‌ కింద 49 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. కాని ఇదే క్రమంలో జిల్లా పరిషత్‌కు రావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ టాక్స్‌ (వినోద పన్ను) కాస్త మాయమైంది. వినోదపన్నులో కొంత శాతం జిల్లా పరిషత్‌కు కేటాయించాల్సి ఉన్నా ఆ రూపంలో రావాల్సిన ఆదాయం ఎప్పుడో మాయమైంది. 14వ ఆర్థిక సంఘం వరకు కేవలం గ్రామ పంచాయతీలకు మాత్రమే జనాభా ప్రాతిపదికన నిధులు కేటా యించేవారు. జిల్లా పరిషత్‌ను గాలికొదిలేశారు. దీంతో జడ్పీకి వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయినట్టయ్యింది. దీనికితోడు ప్రతీ బడ్జెట్‌లోను రూ.9 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు వార్షిక బడ్జెట్‌ ఆమోదిస్తుండగా, దీనిలో నాలుగు కోట్ల రూపాయలు సరాసరిన పింఛ న్‌దారులకు చెల్లించాల్సి ఉంది. దీంతో అరకొర నిధులతోనే సరి పెట్టుకోవాల్సి వస్తుంది. కార్యాలయ నిర్వహణ ఖర్చులతోపాటు మిగతా వాటిని పరిషత్‌ మోయాల్సి వచ్చేది. 2001లో ప్రభుత్వం ఒకింత నిబంధనలు సవరించి తల ఒక్కింటికి నాలుగు రూపాయలు చొప్పున నిధులు జిల్లా ప్రజా పరిషత్‌ జమ చేసేది. అంతో ఇంతో ఈ నిధులు కొంత కలిసొచ్చేవి. ఇప్పుడు రాను రాను మిగతా మార్గాల ద్వారా జడ్పీకి రావాల్సిన నిధులన్నీ ఎక్కడికక్కడ నిలుస్తూనే ఉన్నాయి. దీంతో రాబడి తగ్గి పరిషత్‌ కాస్తా నిర్వీర్యమైంది. స్థానిక ప్రజా ప్రతినిధులు అభ్యర్ధనలు సైతం  కొన్నింటిని మాత్రమే ఆమోదించి మిగతా వాటిని వదిలేసే పరిస్థితి.


 గొప్పగా గెలిచి.. గుర్రుగా నిలిచి
గడిచిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసిన వారంతా తమ స్తోమతను సైతం లెక్క చేయకుండా బయట నుంచి పెట్టుబడి తెచ్చి మరీ ఎన్నికల్లో దారపోశారు. తద్వారా జడ్పీటీసీగా గెలిచామనిపించారు. దాదాపు జడ్పీటీసీ లుగా 48 మంది, ఎంపీటీసీలుగా 876 మంది గెలుపొందారు. కాని వీరంతా గెలిచిన ఆనందం ఎంతసేపో నిలవలేదు. నిధులు లేక, అంతకంటే విధులు లేక ఎక్కడికక్కడ నీరసపడ్డారు. మండల పరిషత్‌ల్లో జట్పీటీసీలకు కనీసం సీటు కేటాయించా లంటూ తొలుత అనేకమంది ఆందోళనకు దిగారు. ఆ తరువాత ఆ డిమాండ్‌ మరిచిపోవాల్సి వచ్చింది. కొన్నేళ్లుగా పరిస్థితి మరింత దిగజారింది. ఎంపీటీసీ, జడ్పీటీసీలు తమకంటూ గౌరవం లేకపోయిందని, తాము గెలిచింది ఇందుకేనా అంటూ నేరుగా నిలదీసే పరిస్థితులు. జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌కు ఇంతకు ముందు విశేష అధికారాలు ఉన్నా, ఇప్పుడు అవన్నీ ఆవిరయ్యాయి. కీలక ప్రభుత్వ శాఖలను సమీక్షించే అధికారంతో పాటు ఎక్కడికక్కడ అవసరాల మేరకు నిధులు కేటాయింపు, సత్వరం ఉత్తర్వులు జారీ చేసే అధికారాలు ఈ మధ్యనే సన్నగి ల్లాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలు, మంత్రులదే పెత్తనం. దీనికితోడు వలంటీర్ల వ్యవస్థ ఇంకోవైపు. నడుమ ప్రజా పరిషత్‌ కాస్తా వెనుకబడింది. పట్టుమని నిధులు కేటాయించలేక, దగ్గరుండి పనులు మంజూరు చేయలేక పూర్తిగా చతికిలపడ్డారు. రానురాను నిధుల లేమి వెన్నాడుతూనే ఉంది. పట్టుమని జిల్లా పరిషత్‌లో ఉన్న కొద్దిపాటి మంది సిబ్బందిని ఇతర శాఖలకు డిప్యుటేషన్‌గా పంపిస్తుండగా, జడ్పీలో ఉద్యోగుల సంఖ్య 116 మాత్రమే. దీనిని బట్టి జడ్పీ ఎంత నీరసపడింతో అర్థం చేసుకోవచ్చు.


బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..
సంవత్సరం    జడ్పీ బడ్జెట్‌ (రూ.ల్లో)
2018–19        10,03,40,000
2019–20        11,16,05,000
2020–21        11,34,27,000
2021–22        12,97,93,000
2022–23        14,94,99,000

Updated Date - 2022-05-19T06:02:17+05:30 IST