ఉపసంహ ‘రణం’

ABN , First Publish Date - 2021-02-28T05:14:28+05:30 IST

నామినేషన్ల ఉపసంహరణ సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు స్పీడు పెంచాయి.

ఉపసంహ ‘రణం’

జంగారెడ్డిగూడెం వైసీపీలో కొత్త ఎత్తుగడలు

సీట్లు పంచుకున్నారంటూ కొవ్వూరులో కలకలం

నర్సాపురంలో జనసేన, టీడీపీ సరికొత్త ఎత్తుగడ 

ఏలూరులో ఇంకా వీడని సస్పెన్స్‌

ఉపసంహరణ వైపే అభ్యర్థుల గాలం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లో పుర సమరం ప్రతి ష్టాత్మకంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు స్పీడు పెంచాయి. నయానో భయానో కొందరి నైనా తమవైపు తిప్పుకుని వారితో నామినేషన్లు ఉపసంహ రింప చేసి కొన్ని డివిజన్లు, వార్డులను తమ ఖాతాలో వేసుకోవాలని అధికార వైసీపీ తెగ ఉవ్విళ్లూరు తోంది. వైసీపీ వలలో చిక్కు కోవద్దంటూ తెలుగుదేశం తమ అభ్యర్థులకు విజ్ఞప్తి చేస్తోంది. బీజేపీ, జనసేన, వామపక్షాలు తమకు అనువైన ప్రాంతాల్లో పోటీకి అభ్యర్థులను ఉత్సాహ పరుస్తున్నాయి.  

జంగారెడ్డిగూడెం అధికార వైసీపీలో చైర్మన్‌ అభ్యర్థిపై వివాదం నెలకొంది. ఎంపీ కోటగిరి శ్రీధర్‌ బలపర్చిన లక్ష్మీజ్యోతికి బదులుగా ఎమ్మెల్యే ఎలీజా బలపర్చిన అభ్యర్థుల్లో ఎవరికి చోటు లభిస్తుందనే దానిపై తర్జన భర్జన పెరిగింది. ఇద్దరు సీనియర్లు పొంతన లేకుండా వ్యవ హరించడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటు న్నాయి. ఒక సామాజిక వర్గాన్ని బలపరిచే దిశలో ఎమ్మెల్యే ఆయన సన్నిహితవర్గం వేగంగా ప్రవర్తిస్తుండగా.. దీనికి దీటుగా ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని మిగతా వర్గం ఎదురు చూస్తోంది. 49 వేల ఓటర్లున్న నగర పంచా యతీలో ఒక సామాజిక వర్గం నుంచి అధిక ఓటర్లే ఉన్నారు. ఆర్థిక సంపత్తి కలిసి వస్తుందని భావిస్తున్నారు. దీంట్లోనే ఎటూ తేలక తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు దేశం సైతం ఐదో వార్డులో అభ్యర్థి చనిపోవడంతో ఆ స్థానంలో వేరొకరితోనామినేషన్‌ వేయించే అవకాశం ఉంది. బలమైన, ఆర్థిక హంగు కలిగిన అభ్యర్థి అయితే తిరుగు లేదని యోచిస్తోంది. నగరంలో ప్రముఖ వ్యక్తి సతీమణిని బరిలోకి దింపే ప్రయత్నాలకు పదును పెట్టింది. ఇదే కనక జరిగితే వైసీపీ, టీడీపీ చైర్మన్‌ అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం వారు రంగంలో ఉన్నట్లు అవుతుంది. 

కొవ్వూరు మున్సిపాల్టీలోనూ మరింత వేడెక్కింది. ఇక్కడి అన్ని వార్డులను సంతృప్తికరంగా పంచుకుని ఏకగ్రీవ మయ్యేలా చూడాలని ప్రధాన పక్షాలు భావిస్తున్నట్లు సాగుతున్న ప్రచారం కాస్త పెద్ద దుమారాన్నే సృష్టించింది. వైసీపీ, టీడీపీ సహా బీజేపీ, జనసేనలు సర్దుబాటు కుదుర్చుకుని ఆ మేరకు బరిలోకి దిగాలని ఎత్తుగడ వేస్తున్నాయన్న ప్రచారాన్ని బీజేపీ, జన సేన తిప్పికొట్టాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు అనువైన స్థానాల్లో గెలుపు కోసం బరిలో ఉంటామని పోటీ నుంచి తప్పుకునే అవకాశం లేదని ఆ పార్టీలు స్పష్టం చేశాయి. టీడీపీ అన్ని స్థానాలకు పోటీ చేయాలని యోచిస్తోంది. 

నిడదవోలులో ఇంకో రకంగా ఉంది. టీడీపీ ఛైర్మన్‌ అభ్యర్థిగా ఆర్థిక హంగు కలిగిన వారిని భుజాన వేసుకుని ముందుకు నడపాలన్నదే టీడీపీ వ్యూహం. వైసీపీ ఇప్పటికీ గుంభనంగానే వ్యవహరిస్తోంది. 

నరసాపురం మున్సిపాల్టీలోనూ టీడీపీ, జనసేన ఎత్తుగడలు మార్చాయి. ఈ రెండు పార్టీలు 31 వార్డుల్లో అటో ఇటో తేల్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగేందుకు టీడీపీ సమన్వయ కమిటీ ఆదివారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 22 వార్డుల్లో టీడీపీ, మిగతా వార్డుల్లో జనసేన కౌన్సిలర్లు పోటీ చేయడానికి అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీలో గుబులు ఆరంభమైంది. నామినేషన్ల ఉపసంహరణతో ప్రతిపక్ష పార్టీలు కొంత బలహీన పడతాయని వైసీపీ భావించినా ఈ ప్లాను తలకిందులైనట్లు అయింది.  

ఏలూరులో బెదిరింపులు

ఏలూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశంలో కాస్తంత బలహీనంగా తమ వైపు మొగ్గు చూపుతారనున్న వారందరితోనూ వైసీపీ చర్చలకు దిగింది. అత్యంత రహస్యంగా కొందరికి బెదిరింపు ధోరణులతో ఇంకొందరికి గేలం వేస్తున్నారు. టీడీపీ మాత్రం తమ పార్టీ అభ్యర్థులు ఎవరూ అంత సులభంగా లొంగిపోరని  ధీమాగా చెబుతున్నా ఆదివారానికి కొన్ని డివిజన్లలో అనూహ్య ఫలితాలు వెలుగుచూసే అవకాశం ఉంది.


Updated Date - 2021-02-28T05:14:28+05:30 IST