కుదింపు

ABN , First Publish Date - 2022-08-16T05:47:12+05:30 IST

వాటర్‌గ్రిడ్‌ పథకంలో పట్టణాలకు స్వస్తి పలికారు.

కుదింపు

వాటర్‌ గ్రిడ్‌  పథకంలో పట్టణాలకు స్వస్తి
గ్రామీణ ప్రాంతాలకే పరిమితం.. టెండర్ల దశలో ప్రాజెక్టు
పోటీ పడుతున్న నాలుగు కంపెనీలు

భీమవరం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): వాటర్‌గ్రిడ్‌ పథకంలో పట్టణాలకు స్వస్తి పలికారు. ఆర్థిక ఇబ్బందులతో బృహత్తర పైపులైన్‌ ప్రాజెక్టును కుదించారు. కేవలర  పట్టణ గ్రామీణ ప్రాంతాలకే గోదావరి జలాలను విజ్జేశ్వరం నుంచి నేరుగా మళ్లించేలా గ్రిడ్‌ ప్రణాళికలు రూపొందించారు. అది కూడా పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతానికే ప్రాజెక్టును పరిమితం చేశారు. అందులో ఏలూరు నరగ పాలక సంస్థతో పాటు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పురపాలక సంఘాలు లేకుండా చేశారు. దాదాపు రూ.1400 కోట్లతో తాజా వాటర్‌గ్రిడ్‌ పథకం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. నాలుగు ఏజన్సీలు ప్రాజెక్టు పనులు దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పథకాన్ని అమలు చేయనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు రూ.3600 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. పోలవరం నుంచి మెట్ట ప్రాంతానికి సిద్ధేశ్వరం నుంచి డెల్టా ప్రాంతానికి గోదావరి జలాలను శుద్ధి చేసి తరలించాలని భావించారు. రెండున్నరేళ్ల పాటు ప్రాజెక్టుపై కుస్తీపట్టారు. ఒక దశలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాజెక్టును పక్కకు పెట్టారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు ప్రాజెక్టు కుదించి మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

 మూడు సెగ్మెంట్‌లకే పరిమితం
గోదావరి జలాలను నేరుగా మళ్లించే వాటర్‌ గ్రిడ్‌ పథకం ప్రాజెక్టు మూడు సెగ్మెంట్‌లకే పరిమితం అయ్యింది. ఏలూరు, భీమవరం, నరసాపురం ప్రాంతాలకు డెల్టాను మూడు సెగ్మెంట్‌లుగా విభజించారు. ఒక్కొక్క భారీ నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. గ్రామాలకే నీటిని సరఫరా చేయనున్నారు. పట్టణాలను మినహాయించారు. తొలుత పట్టణాలకు కూడా వర్తింప చేసి నిర్మాణ బాధ్యతలను గ్రామీణ నీటి పారుదల శాఖకు అప్పగించారు. ఇప్పుడు కేవలం పల్లెలకే పంపిణీ చేయనున్నారు.

మూడు పట్టణాలకు ప్రత్యేక పైపులైన్లు
జిల్లాలోని పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు, పాలకొల్లు, తణుకు పట్టణాలకు ప్రత్యేకంగా పైపులైను ప్రాజెక్టు మంజూరు చేశారు. వాటర్‌ గ్రిడ్‌ పథకంతో సంబంధం లేకుండా సదరు మూడు పట్టణాలకు విజ్జేశ్వరం నుంచి పైపులైను ద్వారా మంచినీటిని మళ్లించనున్నారు. వాటర్‌ గ్రిడ్‌ పథకానికి మూడు పట్టణాల పైపులైను ప్రాజెక్టుకు ఎటువంటి సంబంధం లేదు. తణుకు, పాలకొల్లు, నిడదవోలు పట్టణాలకు సుమారు రూ.250 కోట్లతో పబ్లిక్‌ హెల్త్‌ విభాగం పనులు చేపట్టనుంది. కానీ తాడేపల్లిగూడెం, భీమవరం పురపాలక సంఘాలు, ఏలూరు నగర పాలక సంస్థ లోను వాటర్‌ గ్రిడ్‌లో చోటు దక్కలేదు. ప్రత్యేక పైపులైను ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం లేదు. నిజానికి తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి మొట్టమొదటిగా పైపులైను ప్రాజెక్టు వేస్తామని తెలుగుదేశం హయాంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రయ త్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు. అనం తరం వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా జిల్లాలో ని పట్టణాలు, పల్లెలకు గోదావరి నుంచి నేరుగా మంచినీళ్లు అందించి వాటర్‌ గ్రిడ్‌ పథకం తెరపైకి వచ్చింది. చివరికి అందులోను పట్టణాలకు చోటులేదు.

Updated Date - 2022-08-16T05:47:12+05:30 IST