వెట్టి చాకిరీకి వేతనాలేవి ?

ABN , First Publish Date - 2022-01-23T05:47:38+05:30 IST

ప్రభుత్వో ద్యోగులకు సమాంతరంగా అనుబంధ ఉద్యోగులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

వెట్టి చాకిరీకి వేతనాలేవి ?

యానిమేటర్లకు ఆగిన వేతనాలు
ఏడు నెలలుగా ఎదురు చూపులు
పది రెట్లు పెరిగిన పనిభారం
ఓటీఎస్‌,అమూల్‌ సహా అన్నింటికి వీరే!
ఆందోళనకు సిద్ధమవుతున్న సిబ్బంది


ఏలూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వో ద్యోగులకు సమాంతరంగా అనుబంధ ఉద్యోగులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు రోడ్డెక్కారు. మరో రెండు మూడు రోజుల్లో ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లు రోడ్ల మీదకు రాను న్నారు. గడిచిన ఏడు నెలలుగా వేతనాలు కోసం వేడుకుంటున్నా ప్రభుత్వం వారి వినతులను పట్టించుకోలేదు. దీంతో వారికీ పోరుబాట తప్పడం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ యానిమేటర్లను వేతన కష్టాలు వెంటాడు తున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సుమారు 2 వేల మంది యానిమేటర్లు పని చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో యానిమేటర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తున్నట్లు అట్టహాసంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతవరకూ వారికి రూ. 10 వేలు ఇచ్చిన దాఖ లాలు లేవు. ప్రతి నెలా రూ.8 వేలు ప్రభుత్వం ఇస్తుండగా మిగిలిన రూ.2 వేలు గ్రామ సమాఖ్యల నుంచి తీసుకోవాలని చెబుతున్నారు. గ్రామ సమా ఖ్యల వద్ద నగదు లేకపోవడంతో వీరు రూ. 8 వేలతోనే సర్దుబాటు చేసుకుంటున్నారు. నాలుగు నెలలుగా వీరికి ఇది కూడా అందడం లేదు. కిందటేడాది కరోనా సమయంలో కూడా వీరి వేతనాలు ఆగిపోయాయి. ఇలా ప్రతి ఏటా వేతనాలు నెలలకు నెలలు ఆగిపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకు పోతున్నాయి.

సంబంధం లేని పనులూ వీరికే..
డ్వాక్రా గ్రూపుల సమావేశాలు నిర్వహించి వారి అభివృద్ధికి తోడ్పడడం,గ్రూపులకు రుణాలు ఇప్పించడం, మొబైల్‌ బుక్‌ కీపింగ్‌, బ్యాంకు లింకేజీ ద్వారా ఉన్నతి, స్త్రీనిధి, ఆసరా వంటి పథకాలను మహిళలకు అందుబాటులోకి తేవడం వీరి ప్రధాన విధులుగా ఉంటాయి. అయితే ప్రభుత్వం వీటికి తోడు సంబంధం లేని అనేక పనులు కేటాయి స్తోంది. ఓటీఎస్‌ వసూళ్లకు కూడా వీరిపై ఒత్తిడి చేస్తోంది. జగనన్నతోడు పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయడం, వారికి రుణాలు ఇప్పించడం, బ్యాంకుల చుట్టూ తిరిగి టిడ్కో ఇళ్లకు రూ.35 వేల రుణాలు ఇప్పించడం, అమూల్‌ పాల సేకరణ నిమిత్తం డ్వాక్రా గ్రూపులను సిద్ధం చేయడం, కొత్త గ్రూపులను ఏర్పాటు చేయించడం వంటి అనేక పనులు వీరికి అదనపు భారంగా తయార య్యాయి. ఇన్ని పనులు చేస్తున్నా వేతనాలు మాత్రం రావడం లేదు. వీటికి తోడు గిరిజన ప్రాంతాల్లో తక్కువగా గ్రూపులున్న యానిమేటర్లను విలీనం పేరిట తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా ఉద్యోగులు జీవన భద్రతను కోల్పోతున్నారు.

వేతనాలు ఎప్పుడిస్తారు ? : మరియమ్మ, కామవరపుకోట

ప్రభుత్వం రూ. 10 వేల వేతనం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకూ ఎప్పుడూ మేం రూ.10 వేలు వేతనం పొందలేదు. ప్రతినెలా రూ. 8 వేల ఇచ్చి, మిగిలిన రూ.2 వేలు గ్రామ సంఘాల నుంచి తీసుకోమంటోంది. గ్రామ సంఘాల వద్ద ఒక్క రూపాయి కూడా లేదు. దీంతో మేం ఆ రూ.8 వేలతోనే సరిపెట్టుకుంటున్నాం. ఏడు నెలలుగా అవి కూడా రావడం లేదు.

సకాలంలో జీతాలు ఇవ్వాలి : స్రవంతి, కుక్కునూరు

గ్రూపులు తక్కువ ఉన్నాయన్న పేరుతో విలీనం చేయడాన్ని ఆపాలి. ఉద్యోగ భద్రత కల్పించి, సకాలంలో జీతాలు ఇవ్వాలి. పదే పదే జీతాలు ఆగడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం.

Updated Date - 2022-01-23T05:47:38+05:30 IST