సందిగ్ధం..

ABN , First Publish Date - 2022-09-23T05:33:28+05:30 IST

ఎయిడెడ్‌ కళాశాలగా ఉన్న వీరవాసరం ఎడ్యుకేషనల్‌ కమిటీ (వీఈసీ) జూనియర్‌ కళాశాలను యాజమాన్యం ఏడాది కిందట ప్రభుత్వ పరం చేస్తున్నామంటూ అంగీకారం తెలిపింది.

సందిగ్ధం..

త్రిశంకు స్వర్గంలో.. వీరవాసరం వీఈసీ కళాశాల
ప్రభుత్వ కళాశాలగా మార్పు చేస్తూ జీవో
అయినా వీడని సంశయాలు.. ప్రవేశాలపై ప్రభావం
320 నుంచి 50 పడిన విద్యార్థుల ప్రవేశాలు


వీరవాసరం, సెప్టెంబరు 22: ఎయిడెడ్‌ కళాశాలగా ఉన్న వీరవాసరం ఎడ్యుకేషనల్‌ కమిటీ (వీఈసీ) జూనియర్‌ కళాశాలను యాజమాన్యం ఏడాది కిందట ప్రభుత్వ పరం చేస్తున్నామంటూ అంగీకారం తెలిపింది. ఇంటర్‌ అధికారులు, కమిటీలు కళాశాలను సందర్శించి పరిశీలన పూర్తి చేశారు. ఇటీవలే కళాశాల ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు పొందుతూ జీవో జారీ అయ్యింది. అయినప్పటికీ అధికారుల బృందం మరోసారి కళాశాలను సందర్శించి పరిశీలన చేసి పూర్తి నివేదికను అందచేయాల్సి ఉంది.  జీవో నెంబరు 139 కు సంబంధించి నివేదిక ఇవ్వాల్సి ఉండగా అధికారుల బృందం కళాశాలను సందర్శించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ కళాశాల ఎయిడెడ్‌, ప్రైవేట్‌, ప్రభుత్వ కళాశాలా..? అనే సంశయం విద్యార్థుల తల్లిదండ్రులను వీడడం లేదు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల ప్రభావం ఇంటర్‌ విద్య ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీనికి తోడు మారిన విద్యా విధానంలో ప్రతీ మండలంలోనూ ఒక మహిళా ప్రభుత్వ కళాశాలను అదనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాయకుదురు జిల్లా పరిషత హైస్కూల్‌ను ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ స్థితిలో వీరవాసరం వీఈసీ పరిస్థితి అయోమయంగా మారింది. ప్రభుత్వం నుంచి ప్రవేశాల సమయానికి స్పష్టమైన ఉత్తర్వులు లేక విద్యార్థులు సమీప పట్టణంలోని కళాశాలల చేరారు. వీఈసీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ లతో పాటు ఒకేషనల్‌ కోర్సులు కలిపి 320 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు. కళాశాలపై నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ఆసంఖ్య సుమారు 50 మంది విద్యార్థులకు పడిపోయింది. సజ్జెక్టు బోధించే అధ్యాపకులు లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు.

 జీవో సవరణకు ప్రయత్నాలు
వీఈసీ జూనియర్‌ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా గుర్తిస్తూ కమిషనర్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ గతనెల 24న జీవో జారీచేసింది. కళాశాల యాజమాన్యం ఈ జీవో సవరణ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. కళాశాలను ప్రభుత్వం టేకోవర్‌ చేసుకోవాలని ఇచ్చిన లేఖలోని కొన్ని అంశాల మార్పుకు జీవో సవరణ  కోసం ప్రయత్నిస్తోంది.  కళాశాల పేరును వీఎస్‌ఎన్‌ అండ్‌ వీఈసీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలగా మార్పు చేయాలని కోరింది. నిబంధనల మేరకు అవకాశం లేకపోవడంతో  జీవోలో వీఈసీ జూనియర్‌ కళాశాలగానే గుర్తింపు ఇచ్చారు. 

Updated Date - 2022-09-23T05:33:28+05:30 IST