వ్యాక్సిన్‌ మీకింతే.. కాదు పెంచాలి

ABN , First Publish Date - 2021-04-19T05:15:29+05:30 IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువగా నమోద వుతున్న జిల్లాల్లో ‘పశ్చిమ’ స్థానం (13)లో ఉంది.

వ్యాక్సిన్‌ మీకింతే..   కాదు పెంచాలి

అన్ని జిల్లాల్లో విజృంభిస్తున్న వైరస్‌.. అట్టడుగు స్థానంలో పశ్చిమ

నేడు వ్యాక్సినేషన్‌లో హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ప్రాధాన్యం


ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 18 : 

‘మీ జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. ఆ మేరకే వ్యాక్సిన్లు ఇస్తున్నాం.. కేసుల సంఖ్య పెరిగితే చూద్దాం..’ అంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ ముక్తాయింపు ఇస్తోంది. 

‘వ్యాక్సిన్‌ కేటాయింపునకు కేసుల సంఖ్యతో ముడి పెట్టొద్దు.. ఎక్కువ డోసుల టీకా మందు ఇస్తే జిల్లాలో త్వరగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తాం’ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అభ్యర్థన ఇది. 


రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువగా నమోద వుతున్న జిల్లాల్లో ‘పశ్చిమ’ స్థానం (13)లో ఉంది. జిల్లాలో నమోదయ్యే కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు తక్కువగా ఉండడమే టీకా మందు తగినన్ని నిల్వలు అందకపోవడానికి కారణమని వైద్యవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్‌ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్పటికీ రెండు, మూడు రోజులకోసారి అరకొరగా పంపిణీ అవుతున్న నిల్వలు స్థానిక డిమాండ్‌కు ఏ మూలకూ చాలడం లేదు. తొలి డోసు టీకా మందునే డిమాండ్‌ మేరకు అందించలేని పరిస్థి తుల్లో ఇప్పుడు రెండో డోసు వ్యాక్సిన్‌ కోసం వస్తు న్న వారికి  సకాలంలో వ్యాక్సినేషన్‌ జరగడం లేదు. సీవీసీల్లో టీకా మందు పంపిణీకి సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించడంతోపాటు పలుచోట్ల రాత్రి 10 గంటల వరకు సరఫరా చేస్తున్నారు. తాజాగా ఏ రోజుకారోజు నిల్వలు అందితే గాని వ్యాక్సినేషన్‌ పూర్తిస్థాయిలో జరిగే పరిస్థితి లేదు. శనివారం జిల్లాకు దిగుమతి అయిన 37 వేల 700 డోసుల వ్యాక్సిన్‌ నిల్వల వినియోగానికి ఆదివారం కేవలం 40 సెషన్‌ సైట్ల(సీవీసీ)లను మాత్రమే తెరిచినప్పటికి దాదాపు 10 శాతానికి పైగా నిల్వలు ఖాళీ అయిపోయాయి. గత గురువారం ఒక్క రోజులోనే 52 వేల డోసుల వ్యాక్సిన్‌ను ప్రజలకు వేసిన విషయాన్ని వైద్యవర్గాలు ఉదహరిస్తున్నాయి.  


నేడు వీరికే తొలి ప్రాధాన్యం

జిల్లాలో సోమవారం నిర్వహించనున్న వ్యాక్సినేషన్‌లో హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల (మునిసిపల్‌, రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌ శాఖల ఉద్యోగులు)కు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఏడాది కాలంగా కొవిడ్‌ వ్యాప్తి నివారణ/నియంత్రణ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఈ రెండు కేటగిరీల ఉద్యోగుల్లో సుమారు 13 వేల మంది ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. వీరిలో తొలి డోసు టీకా మందు వేయించుకోవాల్సిన వారితోపాటు రెండో డోసు వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన వారు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ కొవిడ్‌ ఉధృతి పెరగడంతో సంబంధిత శాఖల ఉద్యోగులు సేవలు అందించాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 

 

Updated Date - 2021-04-19T05:15:29+05:30 IST