రవాణా కుదేలు

ABN , First Publish Date - 2021-02-28T05:15:09+05:30 IST

కొవ్వూరు కేంద్రంగా లారీ యజమాని నాగేంద్ర కుమార్‌ ఇసుక సరఫరా చేస్తుంటారు. ప్రభుత్వం నిర్ధారించిన ధరకే ఇసుక సరఫరా చేయాల్సిందే.

రవాణా కుదేలు

పెరిగిపోతున్న డీజిల్‌ ధరలు

తీవ్ర నష్టాల్లో లారీ ట్రాన్స్‌పోర్టు రంగం

యజమానుల గగ్గోలు 

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి) 

కొవ్వూరు కేంద్రంగా లారీ యజమాని నాగేంద్ర కుమార్‌ ఇసుక సరఫరా చేస్తుంటారు. ప్రభుత్వం నిర్ధారించిన ధరకే ఇసుక సరఫరా చేయాల్సిందే. టన్నుకు రూ.100 వంతున అద్దె నిర్ధారించారు. అప్పట్లో డీజల్‌ ధర రూ.67 ఉంది. ఇప్పుడు డీజల్‌ లీటరు రూ.90 అయింది. ప్రభుత్వం చెల్లించే కిరాయి మాత్రం అంతే ఉంది. ఇప్పుడు లారీలు తిప్పితే నెలకు రూ.50 వేలు నష్టం వస్తుంది. దాంతో నాగేంద్ర కుమార్‌ లారీలు నిలిపి వేయాలన్న పరిస్థితికి వచ్చారు. అలా చేస్తే నెలసరి వాయిదాలు చెల్లించడం కష్టం అవుతుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కిరాయి పెంచాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అదే జరిగితే ఇసుక ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కిరాయి పెంచేందుకు ససేమిరా అంటోంది. దాంతో ఇసుక సరఫరా చేసే రవాణా రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. గోదావరి ఇసుక  ర్యాంప్‌ల పరిధిలోనే జిల్లాలో 2000 లారీలు తిరుగుతున్నాయి.డీజల్‌ ధరలు పెరిగిపోవడంతో లారీ యజమానులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వం కిరాయి పెంచదు. మరో రంగానికి వాహనాలు తరలించే అవకాశం లేదు. వీరి పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్న చందంగా ఉంది. 

నడిపితే నష్టం..నడపకపోతే కష్టం

మరోవైపు తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఎరువులు అధికంగా దిగుమతి అవుతుంటాయి. రైల్వే వ్యాగన్‌ల ద్వారా కంపెనీలు దిగుమతి చేస్తున్నాయి. తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌ నుంచి గోదాములకు లారీల్లో ఎరువులు రవాణా చేస్తుం టారు. దీనిపై వందల లారీలు ఆధారపడి ఉన్నాయి. కంపె నీలు ముందుగానే కిరాయి నిర్ణయిస్తుంటాయి. డీలర్‌లకు ఎరువులు అప్పగిస్తుంటారు. ఇప్పుడు డీజిల్‌ ధరలు పెరిగినా సరే కిరాయి పెరగడం లేదు. దాంతో ఆ నష్టాన్ని లారీ యజ మానులే భరిస్తున్నారు.ఇతర సరకులు రవాణా చేసే లారీ రంగం కూడా కుదేలైంది.ఎప్పుడో నిర్ణయించిన కిరాయిలతో వాహనాలు నడుపుతున్నారు. రోజువారీ కిరాయి అధికం చేస్తే వాహనాలకు గిరాకీ పడిపోతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే అద్దె పెంచేందుకు సరకు రవాణాదారులు అంగీ కరిస్తున్నారు.ఏడు నెలల క్రితం డీజల్‌ ధర రూ.65 ఉండేది. ఇప్పుడది రూ.90లకు చేరింది. లీటరుపై ఏకంగా రూ.25 పెరి గింది. జిల్లాలో తిరిగే సరకు రవాణా వాహనాలకు నెలకు రూ.25 వేలు భారం పడుతోంది. ఇతర ప్రాంతాలకు సరుకు తరలించే వాహనాలకు డీజిల్‌ కోసం అదనంగా రూ.50 వేలు వెచ్చిస్తున్నారు.డీజిల్‌ ధరలు ఇదే మాదిరిగా ఉంటే ఒక్కో లారీపైనే ఏడాది కాలంలో ఒక్కో లారీకి కనిష్టంగా రూ.4 లక్షలు నష్టపోవాల్సి వస్తోందని లారీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొందరు సొంతంగా లారీలు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు.డీజిల్‌ ధర పెరిగిపోవడం వల్ల సొమ్ములు మిగలడం లేదంటూ వాపోతున్నారు. నెలసరి వాయిదాలు చెల్లించాలి. నిర్వహణ కోసం కొంత వెచ్చించాలి. లారీ తిప్పకపోతే వాయిదాల భారం పెరిగిపోతోంది. తిప్పితే నష్టాలు వస్తున్నాయి. మొత్తంపైన డీజిల్‌ ధరలతో లారీ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. 

Updated Date - 2021-02-28T05:15:09+05:30 IST