సుందరీకరణకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-05-21T06:19:45+05:30 IST

జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణ సుందరీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు.

సుందరీకరణకు గ్రీన్‌సిగ్నల్‌
ఛాంబర్‌ ఆఫ్‌ కామర్సు రోడ్డు

రూ.కోటి 27 లక్షలతో గ్రీన్‌ సిటీ చాలెంజ్‌ ప్రతిపాదనలు
డీఎంఏ ఆమోదం.. రూపు మారనున్న భీమవరం పట్టణం
15వ ఆర్థిక సంఘం, జనరల్‌ ఫండ్‌ నిధులతో పనులు


భీమవరం టౌన్‌, మే 20 : జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణ సుందరీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి పట్టణాభివృద్ధికి పలు సూచనలు ఇవ్వడం.. వాటిని అధికారులు అమలు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. ఒకవైపు పట్టణంలో ఆక్రమణ తొలగింపు కొనసాగుతుండగా మరోవైపు సుందరీకరణ పనులపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా గ్రీన్‌సిటీ చాలెంజ్‌ కింద రూ.కోటి 27 లక్షల19 వేలతో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులను డీఎంఏ ఆమోదించి డిజైన్‌లపై సంతృప్తిని వ్యక్తం చేసింది. పట్టణ సుందరీకరణకు ముఖ్యంగా దాతల సహకారంతో పాటు మునిసిపాలిటీలోని 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్‌ ఫండ్స్‌తో పనులు చేపట్టానున్నారు. దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా దాతల సహకారం తీసుకుంటున్నట్టు మునిసిపల్‌ కమిషనర్‌ ఎస్‌. శివరామకృష్ణ తెలిపారు.

పేవర్‌తో రోడ్ల మార్జిన్ల అభివృద్ధి

పట్టణంలో రోడ్ల మార్జిన్లను పేవర్‌ స్టోన్స్‌తో అభివృద్ధి చేసేందుకు ప్రయోగాత్మకంగా మావుళ్లమ్మ ఆలయం దగ్గరనుంచి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్సు రోడ్డును ఎంపిక చేశారు. ఆ రోడ్డులోని వ్యాపారస్తుల సహకారంతో వారి షాపుల ముందు పేవర్‌ స్టోన్స్‌ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారి సెంట్‌మెంట్‌తో తొలుత ఈ రోడ్డును ఎంపిక చేశారు. మొత్తం ఎస్టిమెట్‌ అంతా మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు సిద్ధం చేసి తమ ఆధ్వర్యంలో పనులు జరిగేలా చూస్తారు. షాపుల ముందు స్థలం కొలతలను బట్టి యజమానులు ఖర్చు భరించేలా ఆలోచన చేస్తున్నారు. అడుగు రూ.102లుగా లెక్కలు వేస్తున్నారు.
ఫ పట్టణ  ప్రారంభంలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే  బీవీరాజు విద్యాసంస్థలు రెండు  స్వాగత ద్వారాలు నిర్మాణానికి ముందుకు రాగా ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ యాజమాన్యంతో మాట్లాడి స్వాగత ద్వారాల నిర్మాణానికి  చర్యలు తీసుకుంటున్నారు.
  జువ్వలపాలెం రోడ్డులో ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి పాత బస్‌స్టాండ్‌ వరకు మార్జిన్‌ను మునిసిపల్‌ నిధులతో బీటీ రోడ్డు వేయనున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఉండి రోడ్డు, పాలకొల్లు– పామర్రు రోడ్ల మార్జిన్‌లను పేవర్‌స్టోన్స్‌తో లేదా బీటీ రోడ్లుగా ఆర్‌అండ్‌బీ అఽధికారులు, నేషనల్‌ హైవే అఽధికారులు అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

బిల్లులు ఇవ్వలేకపోతే.. పనులు నిలిపివేస్తాం
కమిషనర్‌కు స్పష్టం చేసిన మునిసిపల్‌ కాంట్రాక్టర్లు
భీమవరం టౌన్‌, మే 20 : ‘పట్టణంలో జనరల్‌ ఫండ్స్‌, ఆర్థిక సంఘం నిధులతో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులను 20 రోజుల్లోగా చెల్లించండి.. లేదంటే ప్రస్తుతం జరుగుతున్న పనులను నిలిపివేస్తాం..’ అంటూ మునిసిపల్‌ కాంట్రాక్టర్లు కమిషనర్‌ సబ్బి శివరామకృష్ణకు స్పష్టం చేశారు. సుమారు 15 మందికి పైగా కాంట్రాక్టర్లు శుక్రవారం కమిషనర్‌ను కలిశారు. బిల్లులు చెల్లించకపోతే తాము పనులు ఎలా చేస్తామని కొంతమంది కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సమావేశం అనంతరం పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ మునిసిపాలిటీ నుంచి కాంట్రాక్టర్లకు రూ.3 కోట్ల 20 లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. ఫైల్స్‌ అన్ని పెండింగ్‌లో ఉండడంతో ఇరవై రోజులుగా కమిషనర్‌కు తమ గోడు విన్నవిస్తున్నామన్నారు. ఎటువంటి ఫలితం లేకపోవడంతో కాంట్రాక్టర్లలంతా కలసి తమ సమస్యలను వివరించామన్నారు. ఇరవై రోజుల్లోగా సమస్య పరిష్కరించకపోతే ఇక పనులను నిలిపివేస్తామని స్పష్టం చేసినట్టు కాంట్రాక్టర్లు సుంకర హరి, కేవీవీ సూరిబాబు, సుబ్బరాజు, అనంతనాగ్‌ తదితరులు వివరించారు.  దీనిపై కమిషనర్‌ శివరామకృష్ణను సంప్రదించగా ఈనెల 31లోగా పూర్తిగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటానని కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. 2014–15 నుంచి పెండింగ్‌ బిల్లులు ఉన్నట్టు తన దృష్టికి తీసుకొచ్చారని వాటిని కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో జాయింట్‌ మీటింగ్‌ నిర్వహించి పెండింగ్‌ బిల్లుల విషయం పై స్పష్టమైన ఆదేశాలను ఇచ్చినట్టు తెలిపారు.

Updated Date - 2022-05-21T06:19:45+05:30 IST