ఇల్లు..ఘొల్లు

ABN , First Publish Date - 2022-07-07T05:15:51+05:30 IST

సొంతింటి కోసం కలలు కన్నారు. ప్రభుత్వం ఎప్పటికి ఇస్తుందా అంటూ ఎదురు చూశారు. ఒకటి కాదు. రెండు కాదు. మూడేళ్లుగా లబ్ధిదారుల ఎదురు చూడక తప్పలేదు.

ఇల్లు..ఘొల్లు

అధ్వానంగా టిడ్కో ఇళ్లు
ఇళ్లల్లో చెత్త కుప్పలు... పాములు
రెండేళ్లు కరోనా క్వారంటైన్‌లుగా టిడ్కో ఇళ్లు
బయట రంగులు మార్పుపైనే ఆసక్తి
శుభ్రం చేయకుండానే ప్రభుత్వం అప్పగింత
టిడ్కో లబ్ధిదారుల గగ్గోలు


సొంతింటి కోసం కలలు కన్నారు. ప్రభుత్వం ఎప్పటికి ఇస్తుందా అంటూ ఎదురు చూశారు. ఒకటి కాదు. రెండు కాదు. మూడేళ్లుగా లబ్ధిదారుల ఎదురు చూడక తప్పలేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజ నలో నిర్మించిన ఏపీ టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించారు. తాళాలు అందజేశారు. సొంతింటి కల నెరవేరిందంటూ అంతా గంతులేశారు. తీరా ఇళ్లకు వెళ్లి తాళాలు తీసి అంతా ఉలిక్కి పడుతు న్నారు. ఇళ్లలో బూజులు పేరుకుపోయాయి, చెత్త చెదారంతో దుర్వాసన వస్తోంది. బాత్‌రూమ్‌లు మకిలిపట్టి పోయాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఇళ్లలో పాములు తిష్ట వేశాయి. అంతే వారిలో ఉత్సా హం కాస్త నీరుగారిపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఇలాగేనా ఇళ్లు అప్పగి స్తారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రస్తుతం తాడేపల్లిగూడెంలోనే 2,272 మంది లబ్ధిదారులు ఇళ్లు అప్పగించారు. వారం రోజుల క్రితమే లబ్ధిదారులకు మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేతుల మీదుగా ఇంటి తాళాలు అప్పగించారు. భీమ వరంలో 1,972, పాలకొల్లులో 1,856 ఇళ్లు ఇంకా అప్పగించాల్సి ఉంది. మూడు పట్టణాల్లోనూ తొలి విడతగా 6,100 ఇళ్లు లబ్ధిదారులకకు ఇవ్వాలని నిర్ణయిం చారు. వాస్తవానికి ఇవి తెలుగుదేశం హయాంలోనే సిద్ధమయ్యాయి. అప్పట్లో ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆకర్షణీయమైన రంగులు వేశారు. కార్పొరేట్‌ స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దారు. ఇక ఇళ్లు అప్పగించడమే తరువాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక లబ్ధిదారులను పట్టించుకోలేదు. సకాలంలో ఇళ్లు ఇవ్వాలన్న ధ్యాసే లేకుండా పోయింది. టీడీపీ హయాంలో తయారైన ఇళ్లను మూడేళ్ల తర్వాత లబ్ధిదారులకు కేటాయి స్తున్నారు.

 కరోనాలో వినియోగం
కరోనా సమయంలో టిడ్కో ఇళ్లను ప్రభుత్వం వినియోగించుకుంది. రెండేళ్ల పాటు కరోనా బాధితులను టిడ్కో ఇళ్లలోనే ఉంచింది. తొలి ఏడాది క్వారంటైన్‌ సెంటర్‌గా ఉపయోగించారు. ఒక్కో బాధితుడికి ఒక ఫ్లాట్‌ను కేటాయించారు. ఇలా రెండేళ్లు కరోనా బాధితులతో టిడ్కో ఇళ్లు కిటకిటలాడాయి. తాడేపల్లిగూడెం లోనే ఏటా 2వేల మంది బాధితులు ఒక్కో రోజు టిడ్కో ఇళ్లల్లో చికిత్స పొందిన సందర్భాలున్నాయి. భీమవరం, పాలకొల్లు పట్టణంలోనూ టిడ్కో ఇళ్లను ఉపయో గించారు. కరోనా బాధితులకు బెడ్‌లు, మంచాలు ఉపయోగించారు. వాటిని అలాగే ఉంచేశారు. అవిప్పుడు తప్పుపట్టి చెత్త కుప్పల్లా దర్శనమిస్తున్నాయి. మరోవైపు టిడ్కో ఇళ్లలో క్వారంటైన్‌ సెంటర్‌లు మూసి వేసిన తర్వాత శుభ్రం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. మళ్లీ కొత్త ఇళ్లు మాదిరిగా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. కరోనా వేళ ట్యాప్‌లు మరమ్మతులకు గుర య్యాయి. వాటిని బాగు చేయాలి. ఇవేమీ లేకుండానే ఇళ్లు అప్పగిం చేశారు.  కొత్త ఇళ్లు చూసుకుందామంటూ వెళ్లిన వారంతా ఒక్కసారిగా నిరాశపడ్డారు. అవి వినియోగానికి పనికిరావంటూ లబోదిబో మంటున్నారు. మౌలిక వసతు లను, ఇళ్లను శుభ్రం చేయకుండానే అప్పగించారంటూ మదనపడుతున్నారు.

బయటికే హంగులు
అధికారులు టిడ్కో ఇళ్లు బ్లాక్‌ల బయట అందంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఉన్న రంగులను మారుస్తున్నారు. ఆకర్షణీయమైన రంగులకు బదులుగా నీలం, తెలుపు రంగులు అద్దుతున్నారు. అవికాస్త వైసీపీ రంగులను తలపిస్తు న్నాయి. నిర్మాణమంతా తెలుగుదేశంలో హయాంలో జరిగింది. అప్పట్లో ఆకర్షణీ యమైన రంగులు వేశారు. వాటిపైనే మళ్లీ ఇప్పుడు కోట్ల రూపాయలు వృథా చేసి వైసీపీ రంగులు వేస్తున్నారు. తాజా రంగులపై లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. బయట రంగులు కొత్తగా వేస్తూ శుభ్రంగా ఉన్నాయన్న భ్రమను కలిగిస్తున్నారు. రెండేళ్లపాటు కరోనా క్వారెంటైన్‌ సెంటర్‌లుగా ఉపయో గించిన ఇళ్లను శుభ్రం చేయాలన్న కనీస విజ్ఞత కొరవడింది. బయట కొత్తవిగా కనిపిస్తున్న ఇళ్లల్లోకి వెళ్లి చూస్తే పాడుబడ్డ ఫ్లాట్‌లుగా దర్శనమిస్తున్నాయి. వీటిని శుభ్రం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

Updated Date - 2022-07-07T05:15:51+05:30 IST