ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

ABN , First Publish Date - 2022-06-30T05:50:49+05:30 IST

ప్రభుత్వం ఎట్టకేలకు ఏపీ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తోంది.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
తాడేపల్లిగూడెంలో సిద్ధమైన టిడ్కో ఇళ్లు

నేడు టిడ్కో ఇళ్లు పంపిణీ
తాడేపల్లిగూడెంలో 2,272 ఇళ్లు అందజేసేందుకు కసరత్తు
టీడీపీ హయాంలోనే నిర్మాణం పూర్తి
రంగులు మార్చేందుకు మూడేళ్లు
రూ.కోట్లాది ప్రజాధనం వృథా


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం ఎట్టకేలకు ఏపీ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తోంది. తొలుత జిల్లాలో తాడేపల్లిగూడెంలో ఇళ్లను ఇచ్చేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేతుల మీదుగా గురువారం లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించనున్నారు. వాస్తవానికి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో  ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నిర్మించిన టిడ్కో ఇళ్లకోసం మూడేళ్లుగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం హయాంలోనే పూర్తయిన ఇళ్లను ఇప్పటివరకు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు అప్పట్లో వేసిన రంగులను మార్చింది. వైసీపీ రంగు లను తలపించేలా రంగులతో పెయింటింగ్‌ వేసింది. అందు కోసం ప్రభుత్వం దాదాపు రూ.20 కోట్లు వృథా చేస్తోంది. అంతకు మించి కొత్తగా వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న అపవాదు ఎదుర్కొంటోంది.
ఇళ్లు ఎప్పటికిస్తారన్న దానిపై లబ్ధిదారుల్లో ఆతృత పెరిగింది. రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. తాడేపల్లిగూడెంలో 2,272 ఇళ్లు గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. భీమవరం, పాలకొల్లు పట్టణాల్లో తదు పరి అప్పగిస్తారు. సదరు పురపాలక సంఘాల్లోనూ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. వసతులు కల్పించాల్సి ఉంది. గడచిన మూడేళ్లలో డ్రెయినేజీ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లను ఇప్పటివరకు నిర్మించలేక పోయింది. మరుగుదొడ్లు వినియోగం సక్రమంగా సాగాలంటే సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు కీలకం కానున్నాయి. తెలుగుదేశం హయాంలో టెండర్లు ఖరారయ్యాయి. వాటిని చేపట్టాల్సిన ప్రభుత్వం పనులను రద్దు చేసి ఇప్పుడు మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి పనులు చేపడుతోంది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు పనులు నిర్వహిస్తున్నారు. తాత్కాలికంగా సెప్టిక్‌ ట్యాంక్‌లు ఏర్పాటు చేశారు.

మిగిలిన ఇళ్ల నిర్మాణం ఎప్పుడో..
జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాల్లో  20,512 ఇళ్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో 2,272, భీమవరంలో 1,920, పాలకొల్లులో 1,856 మందికి ఇళ్లు అప్పగించేలా కసరత్తు చేశారు. తొలుత తాడేపల్లిగూడెంలో అందజేస్తున్నారు. మొత్తంగా 6,048 ఇళ్లు మాత్రమే కేటాయిస్తున్నారు. మిగిలిన ఇళ్లు నిర్మాణం నత్తనకడన సాగుతున్నాయి. ప్రభుత్వం సక్రమంగా బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్ట్‌ ఏజన్సీలు నిర్మాణాలను అంతంత మాత్రంగానే చేపడుతున్నాయి.  అంతర్గతంగా సివిల్‌ వర్క్‌ పనులు పూర్తి చేయాలి. అదికూడా వేగవతంగా చేపడితే ఏడాది సమయం పడుతుంది. అప్పటిలోగా ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. మిగిలిన బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి. మూడు పట్టణా ల్లోనూ 14,464 ఇళ్లు సిద్ధం చేయాల్సి ఉంటుంది. తెలుగుదేశం హయాంలో పూర్తి చేసుకున్న 6,048 ఇళ్లు ఇవ్వడానికి ప్రస్తుత ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. మిగిలిన ఇళ్లు కూడా గత ప్రభుత్వ హయాంలోనే నిర్మాణానికి నోచుకున్నాయి. అప్పటినుంచి ఇసుమంతైన పనికూడా ముందుకు సాగలేదు. అదే ఇప్పుడు ఇతర లబ్ధిదారుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఎప్పటిలోగా ఇళ్లు అప్పగిస్తారనే విషయమై మీమాంస వెంటాడుతోంది.

Updated Date - 2022-06-30T05:50:49+05:30 IST