Abn logo
Apr 13 2021 @ 00:03AM

మృత్యువులోనూ తోడుగా..

ముగ్గురు స్నేహితుల దుర్మరణం.. 

వకీల్‌ సాబ్‌ సినిమాకు వచ్చి.. 

గోదావరిలో స్నానానికి దిగి.. 

కొవ్వూరులో ఘటన..చాగల్లులో విషాదఛాయలు

కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు


కొవ్వూరు/చాగల్లు, ఏప్రిల్‌ 12 : వారు ముగ్గురూ స్నేహితులు. చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు. వేర్వేరు వృత్తుల్లో స్థిరపడినప్పటికీ రోజూ కలవాల్సిందే. వకీల్‌ సాబ్‌ సినిమా చూసేందుకు కొవ్వూరు వచ్చి.. గోదావరిలో స్నానానికి దిగి  మృత్యువాతపడ్డారు. మరణంలోనూ వీరి స్నేహం వీడలేదు. ఈ విషాద ఘటన కొవ్వూరు, చాగల్లులో తీవ్ర విషాదాన్ని నింపింది. చాగల్లుకు చెందిన పేరిశెట్టి సత్యనారాయణ(22), పెరుగు సోమరాజు(23), పట్టపు హేమంత్‌(23), దొంగ శ్రీనివాస్‌, ముత్యాల సాయివెంకట పవన్‌సందీప్‌, సాంబారి అప్పలరాజు స్నేహితులు. వీరంతా ఆదివారం మధ్యాహ్నం వకీల్‌సాబ్‌ సినిమా చూసేందుకు కొవ్వూరు వచ్చారు. అప్పటికే మ్యాట్నీ ప్రారంభం కావడంతో ఫస్ట్‌ షో చూద్దామని నిర్ణయించుకుని, కుమారదేవం రోడ్డులోని నిర్మలగిరి గుడి రేవు వద్ద గోదావరి స్నానానికి వెళ్లారు. తినేందుకు ఏమైనా తెస్తామని చెప్పి శ్రీనివాస్‌, సందీప్‌, అప్పలరాజు బయటకు వెళ్లి వచ్చారు. తమ ముగ్గురు స్నేహితులు అక్కడ లేకపోవడంతో అంతా వెతికారు. ఫోన్లు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ ప్రాంతమంతా వెతికారు. గట్టుపై వీరి దుస్తులు కనిపించడంతో వీరు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాత్రికి వీరి ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పట్టణ సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయానికి వీరి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి.. కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాలకు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. సందీప్‌ ఫిర్యాదు మేరకు సీఐ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.  


చాగల్లులో విషాదఛాయలు

ముగ్గురు స్నేహితుల మరణం చాగల్లులో తీవ్ర విషాదాన్ని నింపింది. వీరు అందరిని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. అంతకుముందు రోజే వకీల్‌ సాబ్‌ సినిమాపై తమతో చర్చించినట్టు   స్నేహితులు చెప్పారు. వకీల్‌ సాబ్‌ సినిమా చూడ్డానికి వెళుతున్నామని చెప్పి.. ఇలా మృత్యువాత పడటం జీర్ణించుకోలేక పోతున్నా మని వాపోయారు. సోమరాజు చాగల్లు పెట్రోలు బంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి లేడు. వీరు మగ్గురు సోదరులు. పెద్దవాడికి వివాహమైంది. సోమరాజు అవివాహితుడు. కుటుం బానికి ఆర్థికంగా ఆసరాగా ఉంటున్నాడు. హేమంత్‌ కూడా నిరుపేద కుటుంబంలో జన్మించి, పట్టుదలగా చదువుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులో ఉద్యోగం చేయాల్సి ఉన్నప్పటికి.. కరోనా వల్ల వర్క్‌ ఫ్రం హోమ్‌తో ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. ప్రయోజకుడు అయిన కొడుకు సంపాదన తినే యోగం లేకపోయిందని తండ్రి రామలింగేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అతని తమ్ముడు చదువుతున్నాడు. సత్యనారాయణ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వీరు ముగ్గురి మరణంతో ఆయా కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 


ప్రమాదాల నివారణకు చర్యలు

కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో లోతు ఎక్కడ ఉన్నదో తెలుసుకుని.. అక్కడకు ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, గోదావరి హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ అధికారులు పర్యటించి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై డీఎస్పీ బి.శ్రీనాధ్‌, హెడ్‌వర్క్స్‌ ఈఈ జి.శ్రీనివాసరావు తదితరులతో చర్చించారు.

మృతదేహాలను నది నుంచి తీసుకువస్తున్న దృశ్యం


Advertisement
Advertisement
Advertisement