చెల్లి ఇంట్లో ప్రియుడితో కలిసి అక్క దొంగతనం

ABN , First Publish Date - 2021-09-19T05:32:57+05:30 IST

చెల్లి నగలు కొనడంతో అసూయపడిన అక్క తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి ఆ నగలను కాజేసింది.

చెల్లి ఇంట్లో ప్రియుడితో కలిసి అక్క దొంగతనం
కేసు వివరాలు చెబుతున్న డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌కిరణ్‌..అరెస్టు చేసిన నిందితులు

ఏలూరు క్రైం, సెప్టెంబరు 18 : చెల్లి నగలు కొనడంతో అసూయపడిన అక్క తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి ఆ నగలను కాజేసింది. ఈ కేసు వివరాలను శనివారం రాత్రి ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ వెల్లడించారు.  టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎంఆర్‌సీ కాలనీలో బోడా కీర్తి నివాసం ఉంటోంది. ఆమె అక్క అయిన ఏలూరు బగ్గయ్యపేటనకు చెందిన బూసి అను రాధ (30) ప్రస్తుతం ఎంఆర్‌సీ కాలనీలో ఒక గది అద్దెకు తీసుకుని తన ప్రియుడైన ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన భీమవరపు శ్యామ్‌కుమార్‌ (26), అతని స్నేహితుడైన ఏలూరు అగ్రహారానికి చెందిన పట్నాల లావణ్య అయ్యప్ప (21)తో కలిసి ఉంటోంది. కీర్తి ఇటీవల బంగారు ఆభరణాలు కొని ధరించగా అసూయ చెందిన అనురాధ వాటిపై కన్నేసింది. ఈనెల 16వ తేదీ రాత్రి కీర్తి ఊరు వెళ్లగా ఇదే అదనుగా ఆమె, తన ప్రియుడు, అతని స్నేహితుడు కీర్తి ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటి బయట  కాపలా ఉండగా వారిద్దరు ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులగొట్టి  బంగారు నక్లెసు (4 కాసులు), ఒక జత బంగారు బుట్టజోడు (ఒకటిన్నరకాసులు), ఒక బంగారు గొలుసు (రెండున్నర కాసులు) అపహరించుకుని వెళ్లిపోయారు. ఊరు నుంచి తిరిగొచ్చిన బాధితురాలు శుక్రవారం రాత్రి టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బోణం ఆది ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌ బాబు, టూటౌన్‌ కానిస్టేబుళ్లు కమలాకర్‌బాబు, సుకుమార్‌ దర్యాప్తు చేపట్టి నిందితులు ముగ్గురిని శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లక్షల 40 వేల రూపాయల విలువైన మొత్తం బంగారు వస్తువులను స్వాధీనం చేసు కున్నారు. సమావేశంలో టూటౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌, టూటౌన్‌ ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-19T05:32:57+05:30 IST