తగ్గేదేలే!

ABN , First Publish Date - 2022-08-19T05:35:02+05:30 IST

ఉపాధ్యాయులందరూ తమ సొంత సెల్‌ఫోన్‌ ద్వారా ఎవరికి వారే ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ వేసే విధానం వివాదం ముదిరిపాకాన పడుతోంది.

తగ్గేదేలే!

త్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు
అవగాహన కోసం 15 రోజుల శిక్షణ
మంత్రి బొత్స ప్రకటనతో ఉద్యోగుల్లో చర్చ .. ఆందోళన కొనసాగింపు
ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ అటెండెన్స్‌కే ప్రభుత్వ  నిర్ణయం


భీమవరం, ఆగస్టు 18 : ఉపాధ్యాయులందరూ తమ సొంత సెల్‌ఫోన్‌ ద్వారా ఎవరికి వారే ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ వేసే విధానం వివాదం ముదిరిపాకాన పడుతోంది. ఈ యాప్‌ను వినియోగించడంపై అవగాహన కోసం 15 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించి అమల్లోకి తెస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడంతో ఉపాధ్యాయ సంఘ నేతలు తమ ఆందోళన కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నారు. ఫ్యాప్టో పిలుపుతో జిల్లాలో ఈయాప్‌ మూడు రోజులుగా బహిష్కరించిన ఉపాధ్యాయులు నామమాత్రంగానే డౌన్‌లోడ్‌లు, అటెండెన్స్‌ల నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్సతో గురువారం నాటి చర్చలు విఫలమయ్యాయి. సొంత మొబైల్‌ వినియోగించి యాప్‌ల ద్వారా అటెండెన్స్‌ నమోదు విధానం సాధ్యం కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వం మొండిగా ఎవరి మొబైల్‌లో వారు వినియోగించి తీరాల్సిందేనని తేల్చేసింది. ఉపాధ్యాయులకు నెలాఖరు వరకు టీచర్లకు శిక్షణ ఇవ్వాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. జిల్లాలో 5,441 మం ది ఉపాధ్యాయులు ఉండగా 2,021 మంది ఉపాధ్యాయు లు రిజిస్టర్‌ అయ్యారు. తొలిరోజు 402 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఈ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ నమోదు చేయించుకోగా రెండో రోజు ఆ సంఖ్య మరో 100కు పెరిగింది. విద్యాశాఖ ఒత్తిళ్ల మేరకు పదుల సంఖ్యలో ఉపా ధ్యాయులు యాప్‌ డౌన్‌లోడ్‌ ప్రయత్నించినా సర్వరు సహకరించలేదు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఓ 15 రోజులు మాత్రమే అవగాహన శిక్షణ పేరుతో కంటితుడుపుగా గడువు ఇచ్చినట్లయింది. త్వరలోనే ఈ ఫేస్‌ యాప్‌ను అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలులోకి వస్తుందని మంత్రి బొత్స చేసిన ప్రకటన అన్ని శాఖల ఉద్యోగులల్లోనూ గుబులు రేపుతోంది. మరోవైపు యాప్‌పై నిర సన తెలుపుతూ జిల్లాలో పలుచోట్ల ఎంఈవోలకు ఉపా ద్యాయ సంఘాల తరపున వినతులు అందించారు.

 ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను ఒప్పుకోం..
15 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించి  ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌  అమల్లోకి తెస్తామని మంత్రి బొత్స చెప్పడం వ్యతిరేకిస్తున్నాం. పైగా మా సొంత మొబైల్‌ వినియోగించడం సాధ్యం కాదు. ఆ యాప్‌ వల్ల మా వ్యక్తిగత సమాచారానికి సమస్య ఏర్పడుతుంది. మేం ఆందోళన చేస్తాం.
బి.గోపీమూర్తి, యూటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి

నిరసన కొనసాగిస్తాం..
 ఉపాధ్యాయ హాజరు కోసం ప్ర త్యేక యాప్‌ ద్వారా నమోదు చేయాలన్న నిబంధనకు మేం పూర్తిగా వ్య తిరేకం. యాప్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కొనసాగిస్తున్నాం. మంత్రి బొత్స నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. సొంతఫోన్లలో యాప్‌ నమోదు విధానాన్ని రద్దు చేయాలి.
ఎస్‌.సాయి శ్రీనివాస్‌, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - 2022-08-19T05:35:02+05:30 IST